Labels

థామస్ కుక్..కోలాప్స్: రోడ్డున పడ్డ 22వేల మంది

థామస్ కుక్..కోలాప్స్: రోడ్డున పడ్డ 22వేల మంది


Sep 23 2019

ప్రపంచవ్యాప్త మాంద్యం యూరప్ నుంచి  బ్రిటన్ వైదొలిగే బ్రెగ్జిట్ దెబ్బకు ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక విమానయాన సంస్థ ‘థామస్ కుక్’ కుదేలైంది. తీవ్ర నష్టాలతో కుప్పకూలింది. ఎంతో ఫేమస్ అయిన ఈ సంస్థ పెట్టుబడుల కోసం అన్వేషించి ఎవరూ రాకపోవడంతో దివాళా తీసినట్టు థామస్ కుక్ సీఈవో పీటర్ ఫాంక్ హౌజర్ ఆదివారం రాత్రి ప్రకటించారు. బ్రెగ్జిట్  సంక్షోభంతో పర్యాటకం పడిపోయి తమ సంస్థ నష్టాల్లోకి కూరుకుపోయిందని థామస్ కుక్ ఎయిర్ వేస్ ప్రకటించింది.

థామస్ కుక్ సంస్థ దివాళా తీయడంతో పాటు ఇదివరకే ఈ సంస్థలో   ప్రయాణికులు బుక్ చేసుకున్న దాదాపు 6 లక్షల విమాన టికెట్లను వెంటనే రద్దు చేసింది. వారంతా ఇప్పుడు ఆయా దేశాల్లోనే చిక్కుకుపోయారు. ఇక థామస్ కుక్ చెందిన వివిధ దేశాల్లోనే 22 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఇందులో 9వేల మంది బ్రిటన్ వారు ఉండడం గమనార్హం.

థామస్ కుక్ దివాళా.. విమానయాన టికెట్ల రద్దుతో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన బ్రిటన్ వాసులను దాదాపు 40కు పైగా చార్టెడ్ విమానాలు మిగతా విమానాలను అద్దెకు తీసుకొని వారిని ఉచితంగా బ్రిటన్ కు తీసుకువచ్చేందుకు  ప్రయత్నిస్తున్నామని బ్రిటన్ రవాణా కార్యదర్శి గ్రాంట్ షాప్స్ చెప్పారు.

ప్రపంచంలోనే ప్రసిద్ధమైన బ్రాండ్లలో ‘థామస్ కుక్’ చాలా ఫేమస్. దీన్ని 1841లో ఇంగ్లండ్ లోని లీసెస్టర్స్ షైర్ లో థామస్ కుక్ అనే వ్యక్తి స్థాపించాడు. మొదట రైలు సేవలను ప్రారంభించిన సంస్త ఆ తర్వాత విమానయాన రంగంలోకి దిగింది. 16 దేశాలకు విస్తరించి ప్రపంచంలోనే ప్రముఖ బ్రాండ్ గా నిలిచింది.  178 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పర్యాటక సంస్థ నష్టాల నుంచి గట్టెక్కాలంటే దాదాపు 200 మిలియన్ పౌండ్లు అవసరం అట.. సో సంక్షోభం ఇప్పట్లో తీరేమార్గం లేకపోవడంతో దివాళా తీసినట్టు ప్రకటించింది.

 ఈ సంస్థ దివాళా కారణంగా దాదాపు 150000 వేల మంది ప్రయాణికులు ఇప్పుడు వివిధ దేశాల్లో టికెట్లు కొని చిక్కుబడిపోయారు. బుక్ చేసుకున్న  6 లక్షల టికెట్లను ప్రయాణికులు నష్టపోయారు. 22 వేల మంది ఉద్యోగులు రోడ్డునపడ్డారు. ప్రపంచంలో మాంద్యం ఎఫెక్ట్ తో భారీగా నష్టపోయిన సంస్థగా థామస్ కుక్ ప్రస్తుతం నిలిచింది.

ప్రశాంత్ కిషోర్ మాజీ అనుచరుడు..టీడీపీ స్ట్రాటజిస్టుగా?

ప్రశాంత్ కిషోర్ మాజీ అనుచరుడు..టీడీపీ స్ట్రాటజిస్టుగా?  

అధికారం కోల్పోగానే చంద్రబాబు నాయుడు  ప్రశాంత్ కిషోర్ ను సంప్రదించినట్టుగా వార్తలు వచ్చాయి. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ మళ్లీ పుంజుకోవడానికి అనుగుణంగా ప్రశాంత్ కిషోర్ టీమ్  సేవాలను చంద్రబాబు నాయుడు వాడుకోవాలని ఫిక్సయినట్టుగా అప్పట్లోనే వార్తలు వచ్చాయి. పొలిటికల్ స్ట్రాటజిస్టుగా పీకే సంపాదించుకున్న పేరేమిటో చెప్పనక్కర్లేదు. ఆయన ఎవరి కోసం పని చేస్తే వారు గెలిచేస్తారనే ప్రచారం వచ్చింది.


జగన్ పార్టీ ఏపీలో సాధించిన విజయంలో పీకే చాలా క్రెడిట్ ను పొందాడు. ఇలాంటి క్రమంలో పీకేతో ఒప్పందం కోసం  చంద్రబాబు ప్రయత్నం చేశారట. అయితే అది కుదరలేదని సమాచారం. ఎన్నికల తర్వాత కూడా జగన్ మోహన్ రెడ్డి పీకేతో ఒప్పందాన్ని కొనసాగిస్తున్నారని టాక్. ఆ సంగతేమో కానీ..ఇప్పుడు టీడీపీ ఒక స్ట్రాటజిస్టును నియమించుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అతడి పేరు రాబిన్ శర్మ అట.

ఇది వరకూ ఈయన పీకే కు సంబంధించిన ఐప్యాక్ లోనే పని చేశాడని సమాచారం.  అక్కడ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు సొంతంగా పొలిటికల్ కన్సల్టెంట్ గా అవతారం ఎత్తాడట. ఇతడికి టీడీపీ భారీ ఆఫర్ కూడా ఇచ్చిందని టాక్. ఏకంగా యాభై కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నారట. ఇప్పటికే ఈ రాబిన్ శర్మ అనే వ్యక్తి పని కూడా ప్రారంభించాడట. టీడీపీ వార్తలను మీడియాకు రెగ్యులర్ అప్ డేట్స్ కూడా ఈయన ఇస్తున్నారట. ఈ విషయాన్ని టీడీపీ ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి  ఉంది.


హౌడీమోదీ వెనుక రీజన్ 2020 అమెరికన్ ఎలక్షన్లేనా?

వచ్చే ఏడాది జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ట్రంప్ హౌడీమోదీ కార్యక్రమానికి వచ్చారని.. ప్రవాస భారతీయులను ఊరడించే పనిలో భాగంగా ఆయన ఈ కార్యక్రమానికి వచ్చారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక ఆయన ఇమిగ్రెంట్లకు వ్యతిరేకన్న ముద్ర బలంగా పడింది. ఆయన తీసుకున్న పలు నిర్ణయాలే దానికి కారణం.. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ట్రంప్ ఆ ముద్రను తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు.


మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పేరుతో వచ్చే ఏడాది ఎన్నికల కోసం ట్రంప్ ఆల్రెడీ నిర్వహిస్తున్న ప్రచార సభలకు భిన్నంగా హౌడీమోదీ నిర్వహించారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ర్యాలీలన్నీ పూర్తిగా శ్వేతజాతీయులే లక్ష్యంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు. కానీ హౌడీ మోదీ కార్యక్రమం ప్రవాస భారతీయులు లక్ష్యంగా నిర్వహించిన కార్యక్రమం. అదే సమయంలో అమెరికాలోని టీవీ చానళ్లు ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రసారం చేయడంతో మిగతా ప్రాంతాల్లోని ప్రవాస భారతీయులు ఇతర ఆసియా దేశాల ప్రవాసులపైనా ఈ ప్రభావం కనిపిస్తోంది.

నిన్నటి హౌడీమోదీ సభలో ట్రంప్ తన సహజ స్వభావానికి విరుద్ధంగా కనిపించారు. ట్రంప్ ఎక్కడున్నా తానే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలనుకుంటారు. అగ్రరాజ్యాధినేతగా ఆ హోదా ఆయనకు సహజంగానే దక్కుతుంది. కానీ నిన్నటి సభలో ట్రంప్ ప్రధాన వక్త కాదు. మొత్తం మోదీయే నడిపించారు.

ప్రసంగంలోనూ మోదీ ట్రంప్ ని మించిపోయారు. మోదీ - ట్రంప్ కాంబినేషన్ లో తమకు అమెరికాలో ఇబ్బందులు ఉండవన్న సందేశాన్ని అంతర్లీనంగా పంపించగలిగారు. న్యూయార్క్ టైమ్స్ - వాషింగ్టన్ పోస్ట్ వంటి పత్రికలన్నీ ట్రంప్ వచ్చే ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని రాసుకొచ్చాయి.

ట్రంప్ కంటే ముందు ఏ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఇలా ప్రవాసుల కోసం ఆ దేశ నాయకుడు నిర్వహించిన సభకు వెళ్లలేదని చెబుతున్నారు. సుమారు 70 వేల మందితో నిర్వహించిన సభ కావడం.. భారత్తో సంబంధాలు  ప్రవాస భారతీయుల అవసరం వంటి అనేక కారణాల వల్ల ట్రంప్ ఈ సభకు వెళ్లేందుకు ఆసక్తి చూపారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సుమారు 60 మంది డెమొక్రాట్ నేతలు కూడా ఈ సభకు వచ్చారు.. వారిలో సెనేటర్లు గవర్నర్లు ఉన్నారు. అంతమంది డెమొక్రాట్లు పాల్గొన్న ఒక సభలో ట్రంప్ మాట్లాడడం కూడా ఇదే తొలిసారి.

ట్రంప్ ఇమిగ్రెంట్స్కు వ్యతిరేకమన్న ముద్ర ఉన్నప్పటికీ.. ఆయన వ్యతిరేకతంతా అక్రమ వలసదారులపైనే కానీ సక్రమ పద్ధతుల్లో అమెరికా వచ్చిన వారి విషయంలో కాదన్న సంకేతం బలంగా పంపించగలిగారు.

మరోవైపు 2016 అధ్యక్ష ఎన్నికల్లో ప్రవాస భారతీయుల్లో 82 శాతం మంది డెమొక్రాట్ నేత హిల్లరీకి ఓటేయగా.. కేవలం 9 శాతం మందే రిపబ్లికన్ నేత ట్రంప్కు ఓటేశారు. కానీ మోదీ సహాయంతో ప్రవాస భారతీయ ఓట్లను తన వైపు తిప్పుకోగలనని ట్రంప్ గట్టి నమ్మకంతో ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. ఆ క్రమంలోనే ఆయన మోదీ సభకు అంత ప్రాముఖ్యమిచ్చి వచ్చారని.. మోదీ పిలిస్తే భారత్ కూడా వస్తానని అన్నారని చెబుతున్నారు.

జగన్ హెలికాప్టర్ లో వెళ్లడం మానుకుంటేనే మంచిదా?

Sep 23 2019


ఏపీ సీఎం జగన్ మోహనరెడ్డి హెలికాప్టర్ పర్యటనల విషయంలో అధికారులు ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదని.. టేకాఫ్ - ల్యాండింగులకు సంబంధించిన ప్రామాణిక జాగ్రత్తలు తీసుకోకుండా అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో జగన్ భద్రతపై వైసీపీలో కలవరం మొదలైంది. ఇలాంటి తప్పులు ఎందుకు జరుగుతున్నాయి.. అధికారుల నిర్లక్ష్యమే కారణమా.. లేకుంటే కుట్ర కోణాలేమైనా ఉన్నాయా అన్న అనుమానాలూ మొదలవుతున్నాయి.

జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి సోమవారం ఉదయం హైదరాబాద్ కు బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేక్ ఆఫ్ విషయంలో వివాదం చెలరేగడం తీవ్ర కలకలం రేపింది. హెలికాప్టర్ టేక్ ఆఫ్ కు సమస్యలు ఉన్నాయని అధికారులు సమాచారం ఇవ్వడంతో సీఎం కార్యాలయం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అసలు సమస్య ఏంటని ప్రశ్నించిన అధికారులకు - విమానాశ్రయ సిబ్బంది సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో ఈ ఘటనపై విచారించి - చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు సీఎంఓ ఆదేశాలు పంపింది. ఆ మరుక్షణమే సర్వే శాఖ డీఐ వేణు కు కలెక్టర్ నుంచి నోటీసులు వెళ్లాయి. ఈ మొత్తం ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. హెలికాప్టర్ టేక్ ఆఫ్ కు అనుమతి లభించాక ఆయన హైదరాబాద్ వెళ్తారు.

మరోవైపు ఇటీవల వరదకు గురైన కర్నూలు జిల్లాలో జగన్ పర్యటించినప్పుడు కూడా ఇలాగే జరిగిందని చెబుతున్నారు. నంద్యాలలో సీఎం హెలికాఫ్టర్ ల్యాండింగ్ పై తప్పుడు సమాచారం అందించినట్టు సీఎం కార్యాలయం గుర్తించింది. దాంతో ఆగ్రహించిన సీఎం కార్యాలయం.. కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. దీనిపై డీఆర్ ఓ మరియు అధికారులు విచారణ జరుపుతున్నారు. జగన్ హెలికాఫ్టర్ ల్యాండింగ్ వివరాలపై నిర్లక్షంగా వ్యవహరించిన అధికారి వేణుపై  తప్పదని వైసీపీవర్గాల్లో వినిపిస్తోంది. అదే సమయంలో జగన్ హెలికాప్టర్ ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిదని ఆయన శ్రేయోభిలాషులు సూచిస్తున్నారు.

మోడీ తాను భారత ప్రధానినన్న విషయాన్ని మర్చిపోయారా?

కొద్ది నెలల క్రితం దేశంలో సార్వత్రిక ఎన్నికలు మహా జోరుగా సాగాయి. మీడియాలో వచ్చిన కథనాలు చూసిన వారంతా మోడీకి ఈసారి గడ్డు పరిస్థితి తప్పదన్న భావన కలుగజేశారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తమ రాష్ట్రంలో మోడీ బలంగా ఉన్నారు కానీ.. ఇతర రాష్ట్రాల్లో ఆయనకు ప్రతికూలతను ఎదుర్కొన్నట్లుగా భావించారు. చివరకు.. ఫలితాలు వెలువడిన తర్వాత అంతా నోరెళ్ల పెట్టారు. తిరుగులేని రీతిలో దేశాన్ని పాలించిన మోడీకి.. ఎన్నికల సందర్భంగా ఎదురైన ఇబ్బందులు.. విమర్శలు అన్ని ఇన్ని కావు.


ఈ సందర్భంగా ఆయన గెలుపు మీద కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో.. అమెరికా మొదలు చాలా దేశాలకు చెందిన నేతలు.. ఆయనకు సన్నిహితంగా వ్యవహరించే వారంతా కామ్ గా లెక్కలు వేసుకున్నారే తప్పించి.. ఎవరూ మోడీని భుజాన వేసుకున్నది లేదు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే ఆయనకు అందరూ అభినందనలు తెలియజేశారు. ఇలాంటి పరిస్థితి ఒక్క మోడీకే కాదు.. ప్రజాస్వామ్యం ఉన్న ఏ దేశంలోనైనా ఇలాంటి పరిస్థితే ఉంటుంది.

మరి.. అలాంటివేళ.. మరో ఏడాదిలో అధ్యక్ష ఎన్నికల పరీక్షను ఎదుర్కొనున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు అనుకూలంగా దేశ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు.. మరోసారి దేశాధ్యక్షుడు అయ్యేది ట్రంప్ నే అన్న మాట ప్రచారమయ్యేలా ఎందుకు వ్యాఖ్య చేసినట్లు? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

దీనిపై పలువురు జాతీయవాదులు తీవ్రఆగ్రహాన్ని వ్యక్తం చేస్తే.. మరికొందరు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్న వాళ్లు లేకపోలేదు. తాజాగా జరిగిన హోస్టన్ సభలో ట్రంప్ ను ఉద్దేశించి మరీ ఇంతలా పొగిడేయటం ఏ మాత్రం బాగోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారత్ కు అమెరికాతో తప్పించి.. ఫలానా అమెరికా అధ్యక్షుడితో దగ్గరగా ఉండాల్సిన అవసరం లేదన్న విషయాన్ని మర్చిపోవద్దంటున్నారు.

హోస్టన్ లో మోడీ ప్రసంగం చూస్తే.. ఆయన దేశ ప్రధాని అన్న విషయాన్ని మర్చిపోయారా? అన్న అనుమానం కలుగుతుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. దేశ ప్రధానికి ఉండే హుందాతనాన్ని తన మాటలతో చెడగొట్టారన్న గుర్రును పలువురు వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ ప్రచార కార్యకర్తలా వ్యవహరించారని.. ఈ తీరు ఏ మాత్రం మంచిది కాదంటున్నారు. మరి.. ఈ తరహా విమర్శలకు మోడీ ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.

మోడీని గంట సేపు వెయిట్ చేయించిన ట్రంప్


హోస్టన్ లో హోడీ మోడీ కార్యక్రమం జరగటం.. ఈ సందర్భంగా 50వేలకు పైగా ప్రవాస భారతీయులతో అక్కడి స్టేడియం కిక్కిరిసిపోవటమే కాదు.. మరో పదివేల మందికి పైగా ప్రజలు స్టేడియం బయటే ఉండిపోయారు. అమెరికా దేశాధ్యక్షుడికి సైతం దక్కనంత ఫాలోయింగ్ దేశం కాని దేశంలోమోడీకి ఉందన్న విషయం నిన్నటి రాత్రితో ప్రపంచానికి అర్థమైన పరిస్థితి. ఈ సభ సందర్భంగా హోడీ.. మోడీ అన్న నినాదం పెద్ద ఎత్తున సభికులు చేయటంతో పాటు.. నిన్న కార్యక్రమం వేడుకగా సాగింది.

ఇదిలా ఉంటే.. ఈ సభకు సంబంధించిన ఒక కొత్త విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. దీని సారాంశమేమంటే.. ఈ సభకు ట్రంప్ హాజరు కావాల్సిన దాని కంటే దాదాపు గంట ఆలస్యంగా వచ్చినట్లుగా చెబుతున్నారు. ట్రంప్ ఆలస్యం గురించి తెలీని మోడీ షెడ్యూల్ ప్రకారం వేదిక మీదకు వచ్చారని.. ఆ తర్వాత ట్రంప్ ఆలస్యంగా వస్తున్న విషయాన్ని తెలుసుకొని.. వెనక్కి వెళ్లినట్లుగా తెలుస్తోంది.

ఆ తర్వాత ట్రంప్ వచ్చే ముందు వచ్చి.. ఇరువురుకలిసి వేదిక మీదకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇంతకూ మోడీని గంట పాటు ట్రంప్ ఎందుకు వెయిట్ చేయించారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముందుగా అనుకున్న ప్రకారం మోడీ రాత్రి 9.20 గంటలకు వేదికపైకి చేరుకున్నారు. మోడీ మాట్లాడిన తర్వాత 9.39 గంటలకు ట్రంప్ ప్రసంగించాల్సి ఉంది. అయితే.. ట్రంప్ మాత్రం 10.25 గంటలకు వేదిక వద్దకు చేరుకున్నారు. ఆయన ఆలస్యానికి కారణంగా కావాలని చేసింది కాదని చెబుతున్నారు.

టెక్సాస్ రాష్ట్రంలో చాలాచోట్ల కుండపోత వర్షాలు కురిసాయని.. ఫలితంగా ఎక్కడ చూసినా వరద నీరే. ఈ కారణంగా చాలా చోట్ల కరెంటు సరఫరా లేదు. వరదల కారణంగా ఐదుగురు మరణించారు. దీంతో.. మోడీ సభకు హాజరు కావాల్సిన ట్రంప్.. మధ్యలో ఆగి పరిస్థితిని సమీక్షించి.. అధికారులకు ఆదేశాలు జారీ చేసి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో గంట ఆలస్యంగా ట్రంప్ వేదిక మీదకు వచ్చారు.


ఐటీలో బెంగళూరును మించిపోయిన హైదరాబాద్


Sep 23 2019
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ చిత్రాన్నిమార్చేసిన రంగం ఐటీగా చెప్పాలి.రాష్ట్ర విభజనకు ముందు ఐటీ రంగం పుణ్యమా అని తెలుగు వారికి.. హైదరాబాద్ కు కొత్త ఇమేజ్ క్రియేట్ అయ్యిందని చెప్పాలి. ఒకప్పుడు అమెరికాలో జాబ్ అంటే అదో కలగా ఉంటే.. ఐటీ పుణ్యమా అని.. ప్రతి తెలుగు లోగిలోనూ ఒకరిద్దరు అమెరికాలో ఉండే పరిస్థితి. అదే సమయంలో.. హైదరాబాద్ లోనూ ఐటీ రంగం ప్రాధాన్యం అంతకంతకూ పెరిగిపోయింది.


పలు గ్లోబల్ సంస్థలు హైదరాబాద్ లో తమ కార్యాలయాల్ని ఏర్పాటు చేయటం చూస్తే.. ఐటీ రంగంలో హైదరాబాద్ ప్రాధాన్యత ఏమిటన్నది ఇట్టే అర్థం కాక మానదు.  ఐటీ టెక్నాలజీ సొల్యూషన్స్ విషయంలో ప్రపంచ స్థాయి సామర్థ్యం హైదరాబాద్ సొంతంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అభివర్ణిస్తున్నారు.

యాపిల్.. ఫేస్ బుక్.. అమెజాన్ లాంటి టాప్  కంపెనీలు హైదరాబాద్ లో తమ కార్యాలయాన్ని తెరవటం.. కార్యకలాపాల్ని ముమ్మరంగా చేపట్టం చూస్తే.. ఐటీ రంగంలో బెంగళూరుకు ప్రధాన పోటీదారుగా మారటమే కాదు.. కొన్ని విషయాల్లో బెంగళూరును కూడా దాటేసిందన్న వ్యాఖ్య చేయటం గమనార్హం.

ఐటీ రంగంలో హైదరాబాద్ 17 శాతం గ్రోత్ రేట్ ను నమోదు చేసిందని.. ఐదు లక్షలకు మించిన ఐటీ ఉద్యోగులు ఐటీ కారిడార్ లో పని చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజనకు ముందు కేవలం మూడు లక్షల మంది ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ లో పని చేస్తుండగా.. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో దాదాపు 12.67 లక్షల ఉద్యోగాల్ని క్రియేట్ చేయగలిగినట్లు చెప్పారు. ఏమైనా గ్లోబల్ ఐటీ రంగంలో హైదరాబాద్ పాత్రను మర్చిపోలేరన్నది మాత్రం నిజమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిజమే.. ఐటీ విషయంలో హైదరాబాద్ ను కొట్టే నగరం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దక్షిణాదిన లేదని చెప్పక తప్పదు

11 అంకెల మొబైల్ నెంబర్లు రానున్నాయా..!


Sep 23 2019

సాధారణంగా మన దేశంలో వాడుతున్న ఫోన్ నెంబర్లు 10 అంకెలే ఉంటాయి. కానీ ఈ 10 అంకెలు మాయం అయ్యి...త్వరలోనే 11 అంకెల మొబైల్ నెంబర్లు రానున్నాయని తెలుస్తోంది. కొత్తగా వచ్చే మొబైల్ నెంబర్లు 11 అంకెలతో ఇచ్చేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రయత్నాలు చేస్తోంది. అయితే పది అంకెల మొబైల్ నెంబర్లలో కొన్ని 9తో ప్రారంభమయితే.. మరికొన్ని 8 - 7 - 6 సిరీస్ తో ప్రారంభంమయ్యాయి. కానీ 2050 నాటికి ఇండియాలో మొబైల్ నెంబర్లకు ఏర్పడే డిమాండ్ ను అనుసరించి 11 అంకెలను తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.

10 అంకెల నెంబర్లతో 250 కోట్ల మందికి సేవలందించే అవకాశాలు మాత్రమే ఉన్నాయి. అంతకు మించి మొబైల్ నంబర్లు కావాలంటే - 11 అంకెలు కావాల్సిందే. అందుకే ట్రాయ్ మొబైల్ ఫోన్ నంబర్ లోని అంకెలను 10 నుండి 11 కి పెంచడానికి చూస్తోంది. కాకపోతే ఈ నెంబర్లు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనే విషయం తెలియదు. కానీ ప్రస్తుతం మొబైల్ వినియోగదారులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ప్రతిరోజూ కోట్లలో కొత్త సిమ్ లు తీసుకుంటున్నారు. వీటికి తగ్గట్టుగా మొబైల్ నెంబర్ సిరీస్లు మారుస్తూ వెళుతున్నారు.

ఇప్పటికే - 9 - 8  - 7 నెంబర్లతో ప్రారంభమయ్యే సిరీస్ వచ్చాయి. జియో వచ్చాక 6 తో మొదలయ్యే సిరీస్ కూడా వచ్చింది. త్వరలోనే 5 సిరీస్ నెంబర్లు కూడా రావోచ్చని తెలుస్తోంది. అయితే పది అంకెల నెంబర్లు 250 కోట్లు దాటిస్తే.. 11 అంకెల మొబైల్ నెంబర్స్ వచ్చేస్తాయి. ప్రస్తుతానికి 10 అంకెల నెంబర్లు 210 కోట్లు నెంబర్లు ఉన్నాయి. ఇక ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ - మెషిన్-మెషిన్ కమ్యూనికేషన్ల కోసం 13 అంకెల సంఖ్య సిరీస్ను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది.

ప్రస్తుతం జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఫోన్ కనెక్షన్లు కూడా పెరగనున్నాయి. పెరుగుతున్న జనాభా దృష్ట్యా చూసుకుంటే 2050 నాటికి 328 కోట్ల మొబైల్ కనెక్షన్లు కావాలని ట్రాయ్ అంచనా వేస్తోంది. దాని ప్రకారం 11 అంకెల మొబైల్ నెంబర్లను తీసుకొచ్చి...వినియోగదారుల అవసరాలు తీర్చాలని ట్రాయ్ యోచిస్తోంది.

ఆధార్ కు మంగళం పాడనున్న కేంద్రం....!

భారత్ లో ఇప్పుడు ప్రభుత్వ పథకాలకు ఉపయోగిస్తున్న  ఆధార్ కార్డుకు కేంద్ర ప్రభుత్వం మంగళం పాడనున్నదా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్లకు - సిమ్ కార్డులకు - ఓటర్ ఐడీకి - సంక్షేమ పథకాలకు - ప్రభుత్వ - ప్రైవేటు ఉద్యోగుల వేతనాలకు లింక్ చేయాలని గతంలో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అయితే దీనిపై అనేక సార్లు సుప్రీంకోర్డు ఆధార్ కార్డుల అస్థిత్వాన్ని ప్రశ్నించింది. అయితే ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డుకు స్వస్తి చేప్పేందుకు సన్నద్ధం అవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనతో తేలిపోతుంది.

ఆయన సోమవారం మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం 2021లో చేపట్టనున్న జనాభా లెక్కల (సెన్సస్) కోసం మొబైల్ యాప్ వాడబోతున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. పేపర్ సెన్సెస్ నుంచి డిజిటల్ సెన్సెస్ కు ఇదొక పరివర్తన అని చెప్పారు. 2021 మార్చ్ 1 నుంచి జనాభా లెక్కింపు ప్రక్రయను చేపట్టనున్నట్టు గత మార్చిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హిమాలయ ప్రాంతాలైన జమ్మూకశ్మీర్ - హిమాచల్ ప్రదేశ్ - ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జనాభా లెక్కింపు ప్రక్రియ అక్టోబర్ 2020 నుంచే ప్రారంభం కానున్నది. అయితే ఒకే దేశం ఒకే భాష అంశంపై వ్యాఖ్యానించి విమర్శల పాలైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పుడు ఒకే దేశం ఒకే కార్డు ఉండాలని ఉద్ఘాటించారు.

అంతే కాదు  ప్రస్తుతం భారత పౌరులకు ఉన్న పాస్ పోర్టు - ఆధార్ - ఓటర్ కార్డు - బ్యాంక్ ఖాతా అన్నిటికీ కలిపి ఒకే కార్డు ఉండాలని అమిత్ షా అనడం ఇప్పుడు దేశంలో చర్చనీయాంశంగా మారింది.

కేంద్ర హోంశాఖ మంత్రి మాట్లాడుతూ 2021 జనాభా లెక్కల కోసం కేంద్రం రూ.12 వేల కోట్లు బడ్జెట్ కెటాయించామన్నారు. ఇంతకాలం దేశంలోని జనాబా లెక్కలు పేపర్లపై జరిగేవని - రాబోయే జనాభా లెక్కలు డిజిటిల్ పద్దతిలో జరుగుతాయని ఆయన అన్నారు. అందుకోసం ఓ ప్రత్యేక మొబైల్ యాప్ తయారు చేసినట్లు వివరించారు.  ఒక వ్యక్తి మరణిస్తే వెంటనే జనాభా డేటాలో సమాచారం అప్ డేట్ చేయగలిగే వ్యవస్థ రావాలని అన్నారు అమిత్ షా.

సెప్టెంబర్ 2020కల్లా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ను తయారు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఒకసారి నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ పూర్తయిన తర్వాత పాన్ ఇండియా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ కు ఇదే ఆధారంగా మారుతుందని చెప్పారు. అస్సాంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ ఎన్ ఆర్ సీని ఎలాగైతే తీసుకొచ్చామో... ఎన్ పీఆర్ పద్ధతిని దేశవ్యాప్తంగా తీసుకొస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. రాబోవు రోజుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీంటికి జనాభా లెక్కింపు ద్వారానే అందుతాయని స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటలను గమనిస్తే ఆధార్ కార్డుకు మంగళం పాడినట్లే.


  ప్రయాణికులకు విజ్ఞప్తి: ఆకు దొన్నెల్లో ఆహారం అందుకోండి!

 23-09-2019 రత్లాం: మధ్యప్రదేశ్‌లోని రత్లాం రైల్వే జోన్ పరిధిలో ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు  ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అలాగే కాగితం, సింథటిక్ వినియోగానికి కూడా చెక్ చెబుతున్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా ఆకు దొన్నెలను వినియోగిస్తున్నారు. స్టేషన్‌లోని స్టాల్స్, ట్రాలీలు, ఇతర యూనిట్లలో ఆహార పదార్థాలను ఆకు దొన్నెలలోనే అందిస్తున్నారు. స్థానిక రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దేశంలో ఏ రైల్వే స్టేషన్‌లోనూ లేని విధానాన్ని తొలిసారిగా ఇక్కడ అమలు చేస్తున్నామని చెప్పారు. ఇండోర్, ఉజ్జయిని, దేవాస్, చిత్తోర్‌గఢ్, దాహాద్‌తో పాటు మరికొన్ని స్టేషన్లలో ఆకు దొన్నెలను వినియోగిస్తున్నట్లు తెలిపారు.