కొద్ది నెలల క్రితం దేశంలో సార్వత్రిక ఎన్నికలు మహా జోరుగా సాగాయి. మీడియాలో వచ్చిన కథనాలు చూసిన వారంతా మోడీకి ఈసారి గడ్డు పరిస్థితి తప్పదన్న భావన కలుగజేశారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తమ రాష్ట్రంలో మోడీ బలంగా ఉన్నారు కానీ.. ఇతర రాష్ట్రాల్లో ఆయనకు ప్రతికూలతను ఎదుర్కొన్నట్లుగా భావించారు. చివరకు.. ఫలితాలు వెలువడిన తర్వాత అంతా నోరెళ్ల పెట్టారు. తిరుగులేని రీతిలో దేశాన్ని పాలించిన మోడీకి.. ఎన్నికల సందర్భంగా ఎదురైన ఇబ్బందులు.. విమర్శలు అన్ని ఇన్ని కావు.
ఈ సందర్భంగా ఆయన గెలుపు మీద కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో.. అమెరికా మొదలు చాలా దేశాలకు చెందిన నేతలు.. ఆయనకు సన్నిహితంగా వ్యవహరించే వారంతా కామ్ గా లెక్కలు వేసుకున్నారే తప్పించి.. ఎవరూ మోడీని భుజాన వేసుకున్నది లేదు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే ఆయనకు అందరూ అభినందనలు తెలియజేశారు. ఇలాంటి పరిస్థితి ఒక్క మోడీకే కాదు.. ప్రజాస్వామ్యం ఉన్న ఏ దేశంలోనైనా ఇలాంటి పరిస్థితే ఉంటుంది.
మరి.. అలాంటివేళ.. మరో ఏడాదిలో అధ్యక్ష ఎన్నికల పరీక్షను ఎదుర్కొనున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు అనుకూలంగా దేశ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు.. మరోసారి దేశాధ్యక్షుడు అయ్యేది ట్రంప్ నే అన్న మాట ప్రచారమయ్యేలా ఎందుకు వ్యాఖ్య చేసినట్లు? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
దీనిపై పలువురు జాతీయవాదులు తీవ్రఆగ్రహాన్ని వ్యక్తం చేస్తే.. మరికొందరు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్న వాళ్లు లేకపోలేదు. తాజాగా జరిగిన హోస్టన్ సభలో ట్రంప్ ను ఉద్దేశించి మరీ ఇంతలా పొగిడేయటం ఏ మాత్రం బాగోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారత్ కు అమెరికాతో తప్పించి.. ఫలానా అమెరికా అధ్యక్షుడితో దగ్గరగా ఉండాల్సిన అవసరం లేదన్న విషయాన్ని మర్చిపోవద్దంటున్నారు.
హోస్టన్ లో మోడీ ప్రసంగం చూస్తే.. ఆయన దేశ ప్రధాని అన్న విషయాన్ని మర్చిపోయారా? అన్న అనుమానం కలుగుతుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. దేశ ప్రధానికి ఉండే హుందాతనాన్ని తన మాటలతో చెడగొట్టారన్న గుర్రును పలువురు వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ ప్రచార కార్యకర్తలా వ్యవహరించారని.. ఈ తీరు ఏ మాత్రం మంచిది కాదంటున్నారు. మరి.. ఈ తరహా విమర్శలకు మోడీ ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.