హోస్టన్ లో హోడీ మోడీ కార్యక్రమం జరగటం.. ఈ సందర్భంగా 50వేలకు పైగా ప్రవాస భారతీయులతో అక్కడి స్టేడియం కిక్కిరిసిపోవటమే కాదు.. మరో పదివేల మందికి పైగా ప్రజలు స్టేడియం బయటే ఉండిపోయారు. అమెరికా దేశాధ్యక్షుడికి సైతం దక్కనంత ఫాలోయింగ్ దేశం కాని దేశంలోమోడీకి ఉందన్న విషయం నిన్నటి రాత్రితో ప్రపంచానికి అర్థమైన పరిస్థితి. ఈ సభ సందర్భంగా హోడీ.. మోడీ అన్న నినాదం పెద్ద ఎత్తున సభికులు చేయటంతో పాటు.. నిన్న కార్యక్రమం వేడుకగా సాగింది.
ఇదిలా ఉంటే.. ఈ సభకు సంబంధించిన ఒక కొత్త విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. దీని సారాంశమేమంటే.. ఈ సభకు ట్రంప్ హాజరు కావాల్సిన దాని కంటే దాదాపు గంట ఆలస్యంగా వచ్చినట్లుగా చెబుతున్నారు. ట్రంప్ ఆలస్యం గురించి తెలీని మోడీ షెడ్యూల్ ప్రకారం వేదిక మీదకు వచ్చారని.. ఆ తర్వాత ట్రంప్ ఆలస్యంగా వస్తున్న విషయాన్ని తెలుసుకొని.. వెనక్కి వెళ్లినట్లుగా తెలుస్తోంది.
ఆ తర్వాత ట్రంప్ వచ్చే ముందు వచ్చి.. ఇరువురుకలిసి వేదిక మీదకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇంతకూ మోడీని గంట పాటు ట్రంప్ ఎందుకు వెయిట్ చేయించారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముందుగా అనుకున్న ప్రకారం మోడీ రాత్రి 9.20 గంటలకు వేదికపైకి చేరుకున్నారు. మోడీ మాట్లాడిన తర్వాత 9.39 గంటలకు ట్రంప్ ప్రసంగించాల్సి ఉంది. అయితే.. ట్రంప్ మాత్రం 10.25 గంటలకు వేదిక వద్దకు చేరుకున్నారు. ఆయన ఆలస్యానికి కారణంగా కావాలని చేసింది కాదని చెబుతున్నారు.
టెక్సాస్ రాష్ట్రంలో చాలాచోట్ల కుండపోత వర్షాలు కురిసాయని.. ఫలితంగా ఎక్కడ చూసినా వరద నీరే. ఈ కారణంగా చాలా చోట్ల కరెంటు సరఫరా లేదు. వరదల కారణంగా ఐదుగురు మరణించారు. దీంతో.. మోడీ సభకు హాజరు కావాల్సిన ట్రంప్.. మధ్యలో ఆగి పరిస్థితిని సమీక్షించి.. అధికారులకు ఆదేశాలు జారీ చేసి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో గంట ఆలస్యంగా ట్రంప్ వేదిక మీదకు వచ్చారు.