Sep 23 2019
సాధారణంగా మన దేశంలో వాడుతున్న ఫోన్ నెంబర్లు 10 అంకెలే ఉంటాయి. కానీ ఈ 10 అంకెలు మాయం అయ్యి...త్వరలోనే 11 అంకెల మొబైల్ నెంబర్లు రానున్నాయని తెలుస్తోంది. కొత్తగా వచ్చే మొబైల్ నెంబర్లు 11 అంకెలతో ఇచ్చేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రయత్నాలు చేస్తోంది. అయితే పది అంకెల మొబైల్ నెంబర్లలో కొన్ని 9తో ప్రారంభమయితే.. మరికొన్ని 8 - 7 - 6 సిరీస్ తో ప్రారంభంమయ్యాయి. కానీ 2050 నాటికి ఇండియాలో మొబైల్ నెంబర్లకు ఏర్పడే డిమాండ్ ను అనుసరించి 11 అంకెలను తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.
10 అంకెల నెంబర్లతో 250 కోట్ల మందికి సేవలందించే అవకాశాలు మాత్రమే ఉన్నాయి. అంతకు మించి మొబైల్ నంబర్లు కావాలంటే - 11 అంకెలు కావాల్సిందే. అందుకే ట్రాయ్ మొబైల్ ఫోన్ నంబర్ లోని అంకెలను 10 నుండి 11 కి పెంచడానికి చూస్తోంది. కాకపోతే ఈ నెంబర్లు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనే విషయం తెలియదు. కానీ ప్రస్తుతం మొబైల్ వినియోగదారులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ప్రతిరోజూ కోట్లలో కొత్త సిమ్ లు తీసుకుంటున్నారు. వీటికి తగ్గట్టుగా మొబైల్ నెంబర్ సిరీస్లు మారుస్తూ వెళుతున్నారు.
ఇప్పటికే - 9 - 8 - 7 నెంబర్లతో ప్రారంభమయ్యే సిరీస్ వచ్చాయి. జియో వచ్చాక 6 తో మొదలయ్యే సిరీస్ కూడా వచ్చింది. త్వరలోనే 5 సిరీస్ నెంబర్లు కూడా రావోచ్చని తెలుస్తోంది. అయితే పది అంకెల నెంబర్లు 250 కోట్లు దాటిస్తే.. 11 అంకెల మొబైల్ నెంబర్స్ వచ్చేస్తాయి. ప్రస్తుతానికి 10 అంకెల నెంబర్లు 210 కోట్లు నెంబర్లు ఉన్నాయి. ఇక ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ - మెషిన్-మెషిన్ కమ్యూనికేషన్ల కోసం 13 అంకెల సంఖ్య సిరీస్ను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది.
ప్రస్తుతం జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఫోన్ కనెక్షన్లు కూడా పెరగనున్నాయి. పెరుగుతున్న జనాభా దృష్ట్యా చూసుకుంటే 2050 నాటికి 328 కోట్ల మొబైల్ కనెక్షన్లు కావాలని ట్రాయ్ అంచనా వేస్తోంది. దాని ప్రకారం 11 అంకెల మొబైల్ నెంబర్లను తీసుకొచ్చి...వినియోగదారుల అవసరాలు తీర్చాలని ట్రాయ్ యోచిస్తోంది.