Labels

హౌడీమోదీ వెనుక రీజన్ 2020 అమెరికన్ ఎలక్షన్లేనా?

వచ్చే ఏడాది జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ట్రంప్ హౌడీమోదీ కార్యక్రమానికి వచ్చారని.. ప్రవాస భారతీయులను ఊరడించే పనిలో భాగంగా ఆయన ఈ కార్యక్రమానికి వచ్చారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక ఆయన ఇమిగ్రెంట్లకు వ్యతిరేకన్న ముద్ర బలంగా పడింది. ఆయన తీసుకున్న పలు నిర్ణయాలే దానికి కారణం.. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ట్రంప్ ఆ ముద్రను తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు.


మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పేరుతో వచ్చే ఏడాది ఎన్నికల కోసం ట్రంప్ ఆల్రెడీ నిర్వహిస్తున్న ప్రచార సభలకు భిన్నంగా హౌడీమోదీ నిర్వహించారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ర్యాలీలన్నీ పూర్తిగా శ్వేతజాతీయులే లక్ష్యంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు. కానీ హౌడీ మోదీ కార్యక్రమం ప్రవాస భారతీయులు లక్ష్యంగా నిర్వహించిన కార్యక్రమం. అదే సమయంలో అమెరికాలోని టీవీ చానళ్లు ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రసారం చేయడంతో మిగతా ప్రాంతాల్లోని ప్రవాస భారతీయులు ఇతర ఆసియా దేశాల ప్రవాసులపైనా ఈ ప్రభావం కనిపిస్తోంది.

నిన్నటి హౌడీమోదీ సభలో ట్రంప్ తన సహజ స్వభావానికి విరుద్ధంగా కనిపించారు. ట్రంప్ ఎక్కడున్నా తానే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలనుకుంటారు. అగ్రరాజ్యాధినేతగా ఆ హోదా ఆయనకు సహజంగానే దక్కుతుంది. కానీ నిన్నటి సభలో ట్రంప్ ప్రధాన వక్త కాదు. మొత్తం మోదీయే నడిపించారు.

ప్రసంగంలోనూ మోదీ ట్రంప్ ని మించిపోయారు. మోదీ - ట్రంప్ కాంబినేషన్ లో తమకు అమెరికాలో ఇబ్బందులు ఉండవన్న సందేశాన్ని అంతర్లీనంగా పంపించగలిగారు. న్యూయార్క్ టైమ్స్ - వాషింగ్టన్ పోస్ట్ వంటి పత్రికలన్నీ ట్రంప్ వచ్చే ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని రాసుకొచ్చాయి.

ట్రంప్ కంటే ముందు ఏ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఇలా ప్రవాసుల కోసం ఆ దేశ నాయకుడు నిర్వహించిన సభకు వెళ్లలేదని చెబుతున్నారు. సుమారు 70 వేల మందితో నిర్వహించిన సభ కావడం.. భారత్తో సంబంధాలు  ప్రవాస భారతీయుల అవసరం వంటి అనేక కారణాల వల్ల ట్రంప్ ఈ సభకు వెళ్లేందుకు ఆసక్తి చూపారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సుమారు 60 మంది డెమొక్రాట్ నేతలు కూడా ఈ సభకు వచ్చారు.. వారిలో సెనేటర్లు గవర్నర్లు ఉన్నారు. అంతమంది డెమొక్రాట్లు పాల్గొన్న ఒక సభలో ట్రంప్ మాట్లాడడం కూడా ఇదే తొలిసారి.

ట్రంప్ ఇమిగ్రెంట్స్కు వ్యతిరేకమన్న ముద్ర ఉన్నప్పటికీ.. ఆయన వ్యతిరేకతంతా అక్రమ వలసదారులపైనే కానీ సక్రమ పద్ధతుల్లో అమెరికా వచ్చిన వారి విషయంలో కాదన్న సంకేతం బలంగా పంపించగలిగారు.

మరోవైపు 2016 అధ్యక్ష ఎన్నికల్లో ప్రవాస భారతీయుల్లో 82 శాతం మంది డెమొక్రాట్ నేత హిల్లరీకి ఓటేయగా.. కేవలం 9 శాతం మందే రిపబ్లికన్ నేత ట్రంప్కు ఓటేశారు. కానీ మోదీ సహాయంతో ప్రవాస భారతీయ ఓట్లను తన వైపు తిప్పుకోగలనని ట్రంప్ గట్టి నమ్మకంతో ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. ఆ క్రమంలోనే ఆయన మోదీ సభకు అంత ప్రాముఖ్యమిచ్చి వచ్చారని.. మోదీ పిలిస్తే భారత్ కూడా వస్తానని అన్నారని చెబుతున్నారు.