Labels

రేనాటి సూరీడా..

29 September 2019 భారీతనానికి టాలీ’తరం కేరాఫ్ అడ్రెస్సవుతోంది. పాన్ ఇండియా సినిమాలన్నీ ప్రాంతీయ భాషా పరిశ్రమ నుంచే ఉద్భవిస్తున్నాయని సగర్వంగా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తోంది. భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు చిత్రసీమ గురించి ప్రత్యేకంగా ఆలోచిస్తోందంటే -కారణం వచ్చిన రెండూ మూడు పెద్ద చిత్రాల గురించి కాదు.. ఈ అనుసరణ ఎంతవరకూ కొనసాగగలదన్న అంశం గురించే. నాలుగొందల కోట్ల పెట్టుబడితో రెండు భాగాల బాహుబలి ఆవిష్కృతమైనపుడు -యాధృచ్చికంగా జరిగిందనుకున్నారు. రెండేళ్లు తిరక్కుండా అంతే బడ్జెట్‌తో -సాహో వచ్చినపుడూ మళ్లీ అలాంటి సీన్ చూడలేంలే అనే అన్నారు. ఇప్పుడు సుమారు మూడొందల కోట్లతో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు రెడీ అయినపుడు -టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాల అనుసరణ ఎంతకాలం? అన్న విషయాన్ని ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచనలకు నాంది పలుకుతోన్న చిత్రం సైరా. పాన్ ఇండియా సినిమా మళ్లీ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదన్న మాట అప్పుడెలా వినిపించిందో ఇప్పుడూ అలానే వినిపిస్తుంది. కానీ, వచ్చే చిత్రాలు వస్తూనే ఉన్నాయి. ఇంకా వస్తాయి. వస్తూనే ఉంటాయనీ ధైర్యంగా చెప్పగలిగే పరిస్థితి టాలీవుడ్‌లో కనిపిస్తోంది. సైరా. భారత స్వతంత్ర తొలి పోరాటకర్త జీవిత కథ. బ్రిటీష్ పాలనపై కత్తిగట్టిన వీరుల చిత్రాలు టాలీవుడ్‌కు కొత్తకాదు. కాని -సిపాయి తిరుగుబాటుకు ముందే హింసాత్మకమార్గంలో కత్తిదూసిన అజ్ఞాత వీరుడి కథే సైరా. రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర పోషిస్తోన్న చిరంజీవి -తెలుగు సినీ కథానాయక చరిత్రకు కొత్త వెలుగునిస్తాడా? చూడాలి. ** నటించడాన్ని -జీవించటం నుంచే మొదలెట్టాడు చిరంజీవి. పాత్రలోకి ఒదిగిపోయే ద్రావణంలా -తనవంతు పాత్రే పోషించాడు. అలా ఎన్నో పాత్రల్లోకి ఒదిగిపోయి -‘చిరంజీవి’గా మిగిలాడు కొణిదెల వరప్రసాద్. పదేళ్ల క్రితంనాటి కలను నెరవేర్చుకోడానికీ -సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ కాయకష్టానికి సిద్ధమైన చిరు ప్రస్థానాన్ని ‘సైరా’ వరకూ పరిశీలిద్దాం. 1978లో ‘ప్రాణం ఖరీదు’తో తెరంగేట్రం చేసిన చిరు, ‘మనఊరి పాండవులు’గా ఆడియన్స్‌కి దగ్గరైపోయాడు. వెండితెరపై 1988కే అంటే పదేళ్లలో యముడికి మొగుడుతో సెంచరీ కొట్టాడు చిరు. అవకాశాలు వెతుక్కునే స్థాయినుంచి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేస్థాయికి ఎదిగిన చిరంజీవికి ఒక దశలో పోటీ అన్నదే లేకుండాపోయింది. నాలుగు దశాబ్దాల కాలంలో తిరుగులేని హీరోగా నిలబడటానికి కారణం -చిరంజీవిలోని నటన ఒక్కటే కాదు, పరుగాపని తత్వం. ‘మెగా’ స్టార్‌డమ్ ఊరకనే రాలేదు. ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులన్నీ దాటాకే దక్కింది. చిరంజీవి చేసిన చిత్రాలన్నీ బ్లాక్‌బస్టర్లు, సూపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్టే కాదు. ఫ్లాపులున్నాయి. అట్టర్‌ఫ్లాప్‌లున్నాయ్. ఎన్నో చిత్రాలు యావరేజ్‌లు, అబౌ యావరేజ్‌లు, బిలో యావరేజ్‌ల దగ్గరా ఆగిపోయాయి. సంఖ్యాపరంగా చూస్తే -చిరంజీవి చిత్రాల్లో హిట్లు 53. సూపర్ హిట్లు కేవలం నాలుగే. ఇండస్ట్రీ హిట్లు ఐదు, ఫ్లాప్‌లు 41, అట్టర్ ఫ్లాప్‌లు 21, యావరేజ్‌లు 15, అబౌ యావరేజ్ 4, బిలో యావరేజ్ 8. 150 చిత్రాల్లో ఎన్నో చిత్రాలు తస్సుమన్నా -అది చిరంజీవి చిత్రం అన్న పేరు తెచ్చుకుంది. అదే మెగాస్టార్‌ను చేసింది. ఇప్పుడు చిరంజీవికి హిట్టు ఫట్టుతో సంబంధం లేదు. ఏ సినిమా చేసినా -అది చిరంజీవి సినిమా అనే రేంజ్‌లోనే సెకెండ్ ఇన్నింగ్సూ మొదలవుతుంది. పూర్తి చారిత్రక చిత్రంలో తననుతాను చూసుకోబోతున్నాడు చిరు. అదే సైరా. టీజర్ సెనే్సషన్ అయ్యింది. ‘సూర్యుడివై వీరుడివై వెలుగే పంచావు’ అంటూ టైటిల్ సాంగ్ ఆడియన్స్ నాల్కల మీద ఆడుతోంది. ఇప్పటివరకు చిరంజీవికి కాస్ట్యూమ్ డ్రామా లేకపోయింది. కానీ సైరాతో అదీ ఫుల్‌ఫిల్ అయిపోతుంది. పదేళ్ల క్రితమే అనుకున్న కథ.. సుమారుగా మూడేళ్లు నిర్మాణం జరుపుకున్న సినిమా -సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తోంది సైరా. కథను బలంగా చెప్పడానికి దేశంలో ఆరితేరిన నటులను తెచ్చిపెట్టుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా అమితాబ్ కనిపించనున్నాడు. ఝాన్సీ లక్ష్మిబాయిగా అనుష్క, రాజా పండి పాత్రలో తమిళ హీరో విజయ్ సేతుపతి, అవుకురాజుగా కన్నడ స్టార్ సుదీప్, దేశభక్తి కలిగిన లక్ష్మి పాత్రలో తమన్నా భాటియా, రాజ కుటుంబానికి చెందిన దేశభక్తుడు వీరారెడ్డిగా జగపతిబాబు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భార్య సిద్దమ్మగా నయనతార నటిస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి పెర్ఫార్మెన్స్‌పై ఆడియన్స్‌లో ఆసక్తి కనిపిస్తోంది. చారిత్రక నేపథ్యం కలిగిన చిత్రం, పైగా సమరయోథుడి జీవిత కథ కనుక స్క్రిప్ట్‌వర్క్‌పై ఎక్కువ కష్టమే పెట్టామని చెబుతోంది చిత్రబృందం. నరసింహారెడ్డి జీవితాన్ని తెలుసుకోడానికి చెన్నై లైబ్రరీలో పుస్తకాలు అధ్యయనం చేశామని, తంగిరాల సుబ్బారావు రాసిన పుస్తకాలు, బ్రిటీషర్లు ప్రచురించిన గెజిట్లు.. ఉయ్యాలవాడ ఎక్కడెక్కడ తిరిగాడు, ఏ ప్రాంతంలో పోరాటాలు సలిపాడు, ప్రభుత్వం అతన్ని ఎక్కడ ఉరితీసింది.. ఇలాంటి విషయాలు సేకరించి ఉద్దంత రచయితల సహకారంతో స్క్రిప్ట్ పూర్తి చేశారని తెలుస్తోంది. ఇక యుద్ధ సన్నివేశాల కోసం జార్జియా నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో క్రొత్త ప్రపంచానే్న ఆవిష్కరించి, వెయ్యిమందికి పైగా జూనియర్ ఆర్టిస్టులతో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారని తెలుస్తోంది. హైదరాబాద్‌లోనూ భారీ సెట్స్‌వేసి చిత్ర నిర్మాణం పూర్తి చేశారు. పాన్ ఇండియా సినిమా కనుక తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. బాహుబలికి ఇది సమానస్థాయిలో ఉంటుందా? అంటే బాహుబలి రెండు భాగలూ జానపదాలు. కానీ ఇదొక వీరుడి యదార్థ జీవితగాథ. భారతదేశ చరిత్రలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం, బ్రిటీషర్లపై ఆయన తిరుగుబాట్లలోని కీలక ఘట్టాలు చిత్రంలో కనిపించనున్నాయి. ఈ భారీ చిత్రానికి నిర్మాత -చిరంజీవి తనయుడు రామ్‌చరణ్. ‘కొణిదెల ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై దాదాపు 250 కోట్ల నిర్మాణ వ్యయంతో పూర్తి చేశారు. దర్శకుడు సురేందర్‌రెడ్డి మూడేళ్ల సమయం తీసుకుని ఈ చారిత్రక చిత్రాన్ని తెరకెక్కించాడు. కథకు రచనా సహకారం, సలహాలు పరుచూరి బ్రదర్స్ అందిస్తే, మాటల్ని తూటాల్లా పేల్చే బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందించారు. ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ ఒక ఎత్తు. రత్నవేలు దేశంలోని టాప్ టెన్ సినిమాటోగ్రాఫర్లలో ఒకరు. యాక్షన్ ఎపిసోడ్స్‌ని రామ్‌లక్ష్మణ్, సంగీతాన్ని అమిత్ త్రివేదీ సమకూర్చారు. వీటన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ -పవన్‌కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం మరో అట్రాక్షన్. కథ విషయానికొస్తే.. 1857నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎదురు నిలిచినటువంటి విప్లవ వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. స్వాతంత్య్ర సంగ్రామంలో ఈయన పాత్ర పెద్దది. ఝాన్సీలక్ష్మీబాయి, భగత్‌సింగ్‌లకు తీసిపోని విప్లవకెరటం ఉయ్యాలవాడ. తన జీవితానే్న త్యాగం చేసిన వీరుడు చరిత్రలో కనుమరుగయ్యాడు. ఆయన కాలంలో జరిగిన తిరుగుబాట్లు, మిత్రులు, శత్రువులు, పరిస్థితులు, పోరాటాలు, గెలుపు ఓటములు, యుద్ధాలు జరిగిన విధానం, ఎందుకోసం ఆ తిరుగుబాటు జరిగింది, అజాత శత్రువులెవరు? అనే విషయాలనే తెరమీదికెక్కించడం జరిగింది. ఈయన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు. అయితే ఈయన కర్నూలు (రాయలసీమ) ప్రాంతానికి చెందినవాడు. అయినప్పటికీ కేవలం ప్రాంతానికే పరిమితం కాకుండా యాస, భాషలు కాస్త అందరికీ అర్థమయ్యేలా చిత్రంలోని మాటలు, పరిసరాలుంటాయి. నరసింహారెడ్డి ఈ సినిమా కథలో ఒక పాలెగాడు. అయినప్పటికీ దాదాపు 70మంది పాలెగాళ్లను తాటిమీదకుతెచ్చి రాజులమీద ఎదురుదాడి చేయడమే ఇందులోని సారాంశం. మరో పది రోజుల్లో ఈ భారీ బడ్జెట్ చిత్రం విడుదల కానుంది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోన్న ‘సైరా’ -టాలీవుడ్ స్టామినాను ఎంత గొప్పగా చెప్పనుందో చూద్దాం. -శ్రీనివాస్ పర్వతాల