Labels

హ్యూస్టన్‌లో దారుణం.. భారత సంతతి పోలీస్‌ అధికారిని కాల్చి చంపిన దుండగుడు

హ్యూస్టన్: అమెరికాలో భారత సంతతి పోలీస్‌ అధికారిని విధుల్లో ఉండగా కారులో వచ్చిన ఓ జంట నడి రోడ్డుపై అతి కిరాతకంగా తుపాకీతో కాల్చి చంపేశారు. సందీప్ సింగ్ ధలివాల్(40) అనే వ్యక్తి హ్యూస్టన్‌లో ట్రాఫిక్ పోలీస్‌గా విధులుగా నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో కారులో వచ్చిన ఓ జంటను తనిఖీల పేరుతో ధలివాల్ ఆపాడు. కారులోంచి దిగిన వ్యక్తి తనతో పాటు తెచ్చుకున్న తుపాకీతో ధలివాల్‌పై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా, హ్యూస్టన్ పోలీస్ విభాగంలో ధలివాల్ మొదటి సిక్కు డిప్యూటీ అని.. విధుల్లో కూడా తలపై పాగాతోనే ఉండేవాడని పోలీస్ అధికారి గాంజలేజ్ తెలిపారు. గత పదేళ్లుగా హ్యూస్టన్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ధలివాల్ పనిచేస్తున్నాడని ఆయన పేర్కొన్నారు.  ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పరిశీలించిన అధికారులు.. సింగ్‌ను కాల్చిన తరువాత నిందితుడు సమీపంలోని షాపింగ్ మాల్ వైపు పరిగెత్తిన్నట్లు గుర్తించారు. వీడియోలో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్లు గాంజలేజ్ పేర్కొన్నారు.  నిందితుడి కారు, అతడితో పాటు ఉన్న మహిళ, వారు ఉపయోగించిన తుపాకీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ధలివాల్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ధలివాల్ చాలా మంచి పోలీస్ ఆఫీసర్ అని, అతడికి తన సిక్కు కమ్యూనిటీ అంటే ఎంతో గౌరవమని పోలీస్ కమిషనర్ అదిరన్ గ్రేసియా చెప్పారు. తన కమ్యూనిటీకి గౌరవంగా విధుల్లో కూడా ఎప్పుడు తల పాగాతోనే ఉండేవాడని ఆయన గుర్తు చేశారు.