Labels

ఒక్కేసి….. పువ్వేసి

తెలంగాణలో పెద్ద పండగ దసరా. తొమ్మిది రోజుల పాటు ఆడపడుచులు బతుకమ్మ ఆటపాటలతో గడుపుతారు. రోజుకో బతుకమ్మను చేసి ఇరుగు, పొరుగువారు కలిసి ఆడుతారు. ఆ తర్వాత ఆ బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. ఎన్నో ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఈ సంస్కృతి సంప్రదాయాలు తెలంగాణలో మరింత జోరందుకుంటున్నాయి. శనివారం రోజు నుంచే బతుకమ్మ పండగ మొదలవుతోంది. పండుగ విశిష్టత సెప్టెంబరు, అక్టోబర్ నెలల్లో తెలంగాణ ప్రజలకు రెండు పెద్ద పండుగ లుంటాయి. ఒకటి బతుకమ్మ పండుగ, మరొకటి విజయ దశమి, బతుకమ్మ పండుగ మాత్రం తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను ఆడిన తర్వాత నిమజ్జనం చేస్తారు. ఈ పండుగ వర్షాకాలం చివరిలో, శీతాకాలం తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయలలో పూసి ఉంటాయి. వీటిలో గునుగు పూలు, తంగేడు పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నంది వర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. సీతాఫలాలు ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ. పండుగ సంబరాలు 9 రోజులపాటు ప్రతిరోజూ ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మహా అమావాస్య రోజు బతుకమ్మ పండగ మొదలవుతుంది. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. రెండోరోజు అటుకుల బతుకమ్మ, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు. నాలుగోరోజు నానే బియ్యం బతుకమ్మ నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు. సద్దుల బతుకమ్మతో ముగింపు….. ఐదోరోజు అట్ల బతుకమ్మ, అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరో రోజు అలిగిన బతుకమ్మ ఈ రోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు. ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎనిమిదోరోజు వెన్నముద్దల బతుకమ్మ, నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు. తొమ్మిదోరోజు సద్దుల బతుకమ్మ, ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్‌ రైస్‌, కొబ్బరన్నం, నువ్వులన్నం. తొమ్మిదిరోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు. బతుకమ్మ పండగ మొదలైనప్పటి నుంచి అన్ని రోజుల మహిళలు ఆడుతూ… పాడుతూ హుషారుగా ఉంటారు. ఒక వేళ ఈ ఎనిమిది రోజులు కూడా ఎవరైనా బతుకమ్మను చేయకున్నా…. ఆడకున్నా చివరిరోజు అనగా సద్దుల బతుకమ్మ రోజు తప్పకుండా ఆడుతారు.