Labels

టీడీపీ చేజారిన ఐదో నెంబర్ గది!

  న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: పార్లమెంటు ఆవరణలోని ఐదో నంబర్ గది ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ నుంచి జారిపోయి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ చేతిలో పడింది. తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా మరో గదిని కూడా కేటాయించలేదు. పార్లమెంటు ఆవరణలోని ప్రధాన సర్కిల్‌లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉండకూడదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంతం నెగ్గింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఔటర్ సర్కిల్‌లోని ఐదో నంబర్ కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ నుంచి తప్పించి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు కేటాయించారు. తెలుగుదేశం పార్టీకి లోక్‌సభలో ముగ్గురు, రాజ్యసభలో ఇద్దరు సభ్యులున్నారు. వైసీపీకి ఇరవై రెండు మంది, రాజ్యసభలో ఇద్దరు సభ్యులన్నారు. తమకు ఐదో నంబర్ గదిని కేటాయించాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయి రెడ్డి లోక్‌సభ స్పీకర్‌కు గతంలో లేఖ రాశారు. ఆయన ఇంతటితో ఆగకుండా స్పీకర్ ఓం బిర్లాను పలుమార్లు కలిసి తమ పార్టీకి ఐదో నంబర్ గదిని కేటాయించవలసిన అవసరం గురించి వివరించారు. ఇదిలాఉంటే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న బీజేపీకి దూరం కావడం.. గత లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా నరేంద్ర మోదీపై చంద్రబాబు రకరకాల ఆరోపణలతో విరుచుకుపడడం తెలిసిందే. కొన్ని సందర్భాల్లో మోదీని వ్యక్తిగత స్థాయిలో కూడా దూషించారు. బీజేపీ అధినాయకత్వం వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని అత్యంత ప్రాధాన్యత ఉన్న ఐదో నంబర్ గది కార్యాలయాన్ని వైసీపీకి కేటాయించిందని అంటున్నారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయం దాదాపు 35 సంవత్సరాల నుండి ఈ ఐదవ నంబర్ గదిలోనే కొనసాగుతోంది. ఎన్‌టీ రామారావు నాయకత్వంలో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ 1984లో 30 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నప్పుడు ఐదో నంబర్ గదిని కేటాయించారు. తెలుగుదేశం పార్టీకి అత్యధిక మంది లోక్‌సభ సభ్యులున్నందుకే పార్లమెంటులోని ఔటర్ లాబీలోని ఐదో నంబర్ గదిని కేటాయించారు. ఐదో నంబర్ గదికి కుడి వైపున కొద్దిదూరంలో ప్రధాన మంత్రి కార్యాలయం ఉంటే.. ఎడమ పక్క ఐదు అడుగుల దూరంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయం ఉంటుంది. అందుకే ఐదో నంబర్ గదికి అంత ప్రాధాన్యత. తెలుగుదేశం లోక్‌సభ సభ్యుల సంఖ్య 1989లో రెండుకు, 2004లో ఐదుకు, 2009లో ఆరుకు పడిపోయినా ఐదో నంబర్ గదిని నిలబెట్టుకున్నారు. 2004లో అప్పటి టీడీఎల్‌పీ నాయకుడు కె.ఎర్రంనాయుడు, 2009లో టీడీఎల్‌పీ నాయకుడు నామా నాగేశ్వరరావు ఐదో నంబర్ గదిని కాపాడుకోవటంలో విజయం సాధించారు. గతంలో తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలు ఐదో నంబర్ గది కోసం పెద్దఎత్తున గొడవ చేశాయి. గతంలో ఈ ఐదో నంబర్ గది ఒకసారి తృణమూల్ కాంగ్రెస్‌కు, మరోసారి డీఎంకేకు కేటాయించినా తెలుగుదేశం నాయకులు కష్టపడి కాపాడుకోగలిగారు. అయితే ఇప్పుడు వైసీపీ పక్షం నాయకుడు విజయసాయి రెడ్డి ఐదో నంబర్ గదిని సాధించుకునేందుకు వేసిన ఎత్తులను తెలుగుదేశం సభ్యులు ఎదుర్కొనలేకపోయారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఐదో నంబర్ గదిని వైసీపీకి కేటాయించటంతో తెలుగుదేశం సభ్యులు ఆ గదిని ఖాళీ చేయకతప్పడం లేదు. ఇదిలాఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌కు పార్లమెంటు మూడో అంతస్తులోని 125 నంబర్ గదిని కేటాయించారు.