Labels

ఆ సెనెటర్ సతీమణికి మోడీ సారీ..

ఆ సెనెటర్ సతీమణికి మోడీ సారీ..

Sep 23 2019
హుస్టన్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ స్థానిక సెనెటర్ వైఫ్ కి సారీ చెప్పారు. ఎందుకలా? అంటే దానికో ఆసక్తికర కారణం ఉంది. హోడీ మోడీ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత ప్రధాని హోస్టన్ కు రావటం తెలిసిందే. ఆయన పాల్గొనే బహిరంగ సభకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరు కావటంతో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత భారీగా పెరిగిపోయింది. రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాలకుచెందిన అధినేతలు ఒకే వేదికను పంచుకోవటం.. ఇరువురు తమ మధ్యనున్న బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే క్రమంలో పాల్గొన్న కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు.


అంచనాలకు తగ్గట్లే 50వేలకు పైనే స్టేడియంలోకి రాగా.. మరో 10 వేల మందికి పైనే ప్రజలు స్టేడియం బయట ఉండిపోయారు. వారిని స్టేడియంలోకి అనుమతించకపోవటంతో.. వారంతా బయట ఏర్పాటు చేసిన ఎల్ ఈడీ స్క్రీన్ల మీద జరుగుతున్న కార్యక్రమాన్ని వీక్షించారు. ఇదిలా ఉంటే హుస్టన్ సెనెటర్  జాన్ కార్నే సతీమణి శాండీకి ప్రధాని మోడీ సారీ చెప్పారు.

ఎందుకంటే.. ఆదివారం శాండీ పుట్టిన రోజు. అయితే.. అదే రోజు భారత ప్రధాని మోడీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లు హాజరవుతున్న కార్యక్రమానికి ఆయన తప్పనిసరిగా హాజరు కావాల్సిన పరిస్థితి. దీంతో.. ఇదే విషయాన్ని మీడియా ముందు ప్రస్తావించిన మోడీ.. శాండీ మీకు నా క్షమాపణలు. ఈ ముఖ్యమైన రోజు మీ భర్త మీతో కాకుండా నాతో ఉండటం మీకు జెలస్ కావటాన్ని అర్థం చేసుకోగలను.

మీరు ఆనందంతో గడపాల్సిన ఈ రోజును.. మీ జీవిత భాగస్వామి నాతో ఉండాల్సి వచ్చింది. మీరు మరింత సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నా అని చెప్పి ఆకట్టుకున్నారు. ఈ సందేశాన్ని సెనెటర్ జాన్ కార్నే తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సందేశం పలువురిని ఆకట్టుకుంటుంది. ఎప్పుడేం చెప్పాలో.. దాన్ని తూచా తప్పకుండా చెప్పి మనసుల్ని దోచుకునే అలవాటు ఉన్న మోడీ సత్తా తాజా ఎపిసోడ్ లో మరింత స్పష్టంగా కనిపిస్తుందని చెప్పకతప్పదు.