అసలే మోడీ. ఇక.. పొగడటం మొదలెడితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అత్యున్నత స్థానంలో ఉన్న ఒక రాజకీయ నేత కొన్ని విషయాల్లో ఎంత కఠినంగా ఉండగలరో.. అవసరమైతే ఊహించని రీతిలో పొగడ్తలతో ముంచెత్తే విలక్షణ గుణం మోడీ సొంతం. తనకున్న టాలెంట్ ను తాజాగా ట్రంప్ కు అర్థమయ్యేలా చేశారని చెప్పాలి. హోస్టన్ లో ఏర్పాటు చేసిన హోడీ మోడీ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ఉద్దేశించి మోడీ కురిపించిన పొగడ్తల వర్షంతో అగ్రరాజ్య అధినేత తడిచిపోయారనే చెప్పాలి.
ట్రంప్ విషయంలో మోడీ చేసిన వ్యాఖ్యలు మోతాదు మించినట్లుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. భారతదేశ ప్రధానిగా ప్రాతినిధ్యం వహిస్తున్న వేళ.. హుందాతనాన్ని మిస్ అయ్యారని.. ట్రంప్ కు మరీ ఇంత బాజాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందా? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. తన ప్రసంగాన్ని తొలుత ఇంగ్లిషులో చేసిన మోడీ.. తర్వాత హిందీలో చేయటం ద్వారా అటు ట్రంప్ ను... ఇటు ప్రవాసభారతీయుల మనసుల్ని దోచేశారు.
ట్రంప్ ను మోడీ పొగిడిన పొగడ్తల్లో శాంపిల్ గా కొన్ని చూస్తే..
% అమెరికాలో సెప్టెంబరు 11 దాడుల వెనుక ఉన్నవారైనా.. ముంబయి దాడులకు సూత్రధారులైనా వారి చిరునామా ఒక్కటే. ఉగ్రవాదాన్ని పెంచి పోసిస్తున్న వారిపై నిర్ణయాత్మక పోరాటాన్ని చేయాల్సిన తరుణమిదే. ఉగ్రవాదంపై పోరులో భారత్ కు ట్రంప్ మద్దతుగా నిలిచారు.
% చర్చల్లో నేను గట్టిగా వ్యవహరిస్తుంటానని ట్రంప్ అంటుంటారు. ఒప్పందాలు ఖరారు చేయటంలో ఆయన నిపుణుడు. ఆయన నుంచి నేనెంతో నేర్చుకుంటున్నా. కుటుంబంతో సహా భారత్ ను సందర్శించాలని ఆయన్ను ఆహ్వానిస్తున్నా.
% ట్రంప్ చాలా ప్రత్యేకమైన వ్యక్తి అంటూ ప్రవాస భారతీయులకు మోడీ పరిచయం చేయటం గమనార్హం. ఈ అద్భుత స్టేడియానికి.. సభకు.. ట్రంప్ నకు స్వాగతం చెప్పటం నాకు దక్కిన గౌరవం.
% భారత్ లోనూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ శుభాకాంక్షలు.. ఇప్పుడు మన దగ్గర ఒక విశిష్ఠ వ్యక్తి ఉన్నారు. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టటానికి ముందే ఆయన పేరు ప్రతి ఇంట్లో మారుమోగింది. ప్రపంచ వ్యాప్తంగా ఆయన పేరు సుపరిచితం. ప్రపంచరాజకీయాల్లో దాదాపుగా అన్ని చర్చల్లోనూ ఆయన పేరుప్రస్తావనకు వస్తుంది. సీఈవో నుంచి కమాండర్ ఇన్ చీఫ్ వరకూ.. బోర్డురూమ్ ల నుంచి ఓవల్ ఆఫీసు వరకూ.. స్టూడియోల నుంచి అంతర్జాతీయ వేదికల వరకూ.. రాజకీయాల నుంచి ఆర్థిక వ్యవస్థ వరకూ.. భద్రత వరకూ అన్నింటా తనదైన దీర్ఘకాల ముద్ర వేశారు. ఆయనే.. ట్రంప్.
% ఆమెరికా ఆర్థిక వ్యవస్తను ట్రంప్ పరిపుష్ఠం చేశారు. అమెరికాకు.. ప్రపంచానికి ఆయన ఎంతో సాధించారు. భారత్ లో ఉంటున్నప్పుడు కూడా మేం కూడా ఆయనతో బాగా మమేకమయ్యం. వచ్చే ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మళ్లీ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా.
% అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్. హ్యూస్టన్ నుంచి హైదరాబాద్ వరకు.. బోస్టన్ నుంచి బెంగళూరు దాకా.. షికాగో నుంచి సిమ్లా వరకూ.. లాస్ ఏంజిలెస్ నుంచి లూథియానా దాకా మన ప్రజల మైత్రి పరిఢవిల్లుతుంది. భారత్.. అమెరికా ప్రజల మధ్య చక్కటి సంబంధాలు ఉన్నాయి.