Labels

గల్ఫ్‌ వల.. యువత విలవిల

  29 Sep, 2019                   ఆశలపల్లకిలో కువైట్‌కు పంపుతున్న ఏజెంట్లు బానిసలుగా బతుకీడుస్తున్న నగరి, పుత్తూరు వాసులు  నానాతిప్పలు, జైలుశిక్షలు అనుభవిస్తున్న వైనం ఇండియన్‌ ఎంబసీ సాయంతో సొంత గ్రామాలకు గుర్తింపు లేని ఏజెంట్లపై చర్యలు చేపట్టని అధికారులు సాక్షి, నగరి: ఉపాధి కోసం కన్న ఊరిని వదలి వెళుతున్న యువత విదేశాల్లో నరకయాతన అనుభవిస్తోంది. అత్యధిక జీతం, ఉచిత వసతి, ఇతర ఆదాయం పేరిట ఏజెంట్ల వలలో చిక్కి అప్పుల ఊబిలో చిక్కుకుపోతోంది. స్థానికంగా రోజువారీ కూలి పనులు చేసుకుని సంతోషంగా జీవించే అవకాశం ఉన్నా.. ఆశలవలలో చిక్కుకుని అల్లాడుతోంది. రెండు మూడేళ్లు పనిచేస్తే రూ.లక్షలు సంపాదించవచ్చనే ఏజెంట్ల మాటలు నమ్మి అప్పు చేసి అరబ్‌ దేశాలకు వెళ్లి చిత్ర హింసలకు గురవుతోంది. జిల్లా యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులు తరచూ వెలుగులోకి వస్తున్నా అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం సరైన చర్యలు తీసుకోవడం లేదు. నగరి, పుత్తూరు ఏజెంట్ల వలలో చిక్కి కువైట్, దుబాయ్‌కి వెళ్లి నానా తిప్పలుపడి, జైలు శిక్షలు అనుభవించి ఉత్త చేతులతో ఇటీవల స్వదేశానికి చేరుకుని పలువురు బోరున విలపిస్తున్నారు. తాజాగా  కలకడ మండలం తూర్పువడ్డిపల్లెకు చెందిన నాగేంద్ర కువైట్‌లో గుండెపోటుతో మృతిచెందాడు. ఆయన మృతదేహం బుధవారం రాత్రి స్వగ్రామానికి చేరుకుంది. ఇతను అక్కడ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఉద్యోగాల కోసం ఆరాటపడేవారు.. కుటుంబ పరిస్థితి దృష్ట్యా ఆదాయ మార్గాలు అన్వేషించే వారు.. పేదరికాన్ని జయించి అభివృద్ధి పథంలో నడవాలని ఆరాటపడేవారు కువైట్, దుబా య్‌లో ఉద్యోగాల పేరిట నగరి, పుత్తూరులోని ఏజెంట్లు విసిరే వలలో చిక్కుకుంటున్నారు. కొండనాలుకకు మందేస్తే ఉన్ననాలిక ఊడిం దన్న చందాన కువైట్‌ ఉద్యోగాలకు వెళ్లేవారి పరిస్థితి మారింది. ఆదాయం ఎక్కువగా సంపాదించవచ్చని చేతిలో ఉన్న డబ్బుల్ని ఏజెంట్లకు అప్పజెప్పి కువైట్‌కు వెళ్లి నానా తిప్పలు పడి, జైలు శిక్షలు అనుభవించి ఉత్తచేతులతో స్వదేశాలకు చేరుకొని బోరున విలపిస్తున్నారు. తమలా ఎవ్వరూ మోసపోకూడదంటూ మొరపెట్టుకుంటున్నారు. ఏం చెయ్యాలో తెలియక పలువురు కువైట్‌లోనే ఇబ్బందిపడుతున్నారని, మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉందని వాపోయారు. నిరుద్యోగులకు ఆశచూపి మోసం చేసే నకిలీ ఏజెంట్లపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. మహిళలనైతే ఉచితంగానే తీసుకెళుతు న్నారు. వారికి ఏపనిలో తర్ఫీదులేకున్నా పంపిస్తున్నారు. బ్యూటీపార్లర్‌లో ఉద్యోగమని, జిమ్‌లో ఉద్యోగమని కువైట్‌కు తీసుకెళ్లి అక్కడ ఇంటి పనులకు వారిని వేలంలో విక్రయిస్తున్నారు. ఇంటిపనుల్లో వారికి యజమానులు నరకయాతన చూపుతున్నారు. కొందరు ధైర్యం చేసి బయటపడి మరో ప్రాంతంలో ఉద్యోగం వెతుక్కొని పోతుంటే, కొందరు తమ విధి అంటూ కష్టాలు అనుభవిస్తున్నారు. ఇటీవల కొందరు కువైట్‌ నుంచి ఎలాగో వచ్చేశారు. నరకం చూపెట్టారు నా పేరు వడివేలు. చింతలపట్టెడలో నివాసం. నాపై ఆధారపడి ఐదుగురు జీవిస్తున్నారు. కూలిపని చేసి కుటుంబాన్ని పోషించేవాడిని. పుత్తూరుకు చెందిన ఏజెంట్‌ తనకు తెలిసిన వారు కువైట్‌లో ఉన్నారని, అక్కడికి వెళితే నెలకు రూ.50 వేలు సంపాదించవచ్చని ఆశచూపాడు.  వీసా, మెడికల్‌ సర్టిఫికెట్‌కు రూ.2.5 లక్షలు అవుతుందన్నాడు. అన్నీ మేమే సిద్ధం చేస్తామని తెలిపాడు.  అప్పు చేసి డబ్బులు కట్టాను. పుత్తూరుఏజెంట్‌ నగరి ఏజెంట్‌ ద్వారా నన్ను చెన్నై ఎయిర్‌పోర్టుకు పంపాడు. అక్కడ నంచి కువైట్‌కు పంపారు. వీరికి సంబంధించిన కువైట్‌ ఏజెంట్‌ నన్ను పుత్తూరు ఏజెంట్‌ బంధువు నడిపే ఒక హోటల్‌లో పడేశాడు.  ఇక్కడే పనిచేయాలి అంటూ రెండు నెలలు పనిచేయించుకున్నారు. జీతం కోసం పోరు పెడితే రూ.20వేలు ఇచ్చారు. నెలకు యాభైవేలు ఇస్తామని చెప్పారుకదా అంటేæ నీ పాస్‌పోర్టు, వీసా మా దగ్గర ఉంది ఎక్కడికీ వెళ్లలేవుఅంటూ బెదిరించారు. పరిచయమైన తమిళనాడు వారి సహకారంతో తప్పించుకొన్నాను. ఇండియన్‌ ఎంబసీని సంప్రదించి, జైలులో కఠినమైన శిక్షలు అనుభవించి ఫైన్‌లు,ఫ్లైట్‌ చార్జీలు కట్టి భారతదేశానికి చేరుకున్నా.  నాలా ఎవ్వరూ బాధపడకూడదని నగరి, పుత్తూరు పోలీస్‌ స్టేషన్లతో పాటు  చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదుచేశా, స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు విన్నవించాను. 5 సంవత్సరాల్లో 150 మంది వెళ్లారు ఐదేళ్లలో నగరి, పుత్తూరు నుంచి కువైట్‌కు సుమారు 150 మంది వెళ్లారు. కొందరిని సూన్‌వీసాతో, మరికొందరిని ఖాదీ వీసాలతో పంపితే, పలువురిని విజిటింగ్‌ వీసాలతో పంపారు. వీరిలో పలువురు అక్కడ అవస్థలు పడుతున్నారు. ఎక్కువగా సంపాదించి కుటుంబానికి అన్ని సమకూర్చాలని కోరుకునే ఎందరో కుటుంబ యజమానులు ఇలా విష వలయంలో చిక్కుకుంటున్నారు. నీచమైన పదజాలం వాడుతూ పనిచేయిస్తున్నారు. భార్యాపిల్లలను చూస్తామన్నా నమ్మకం కూడా లేనివారు అక్కడ పరిచయమయ్యే భారతీయుల సలహాల మేరకు ఇండియన్‌ ఎంబసీని సంప్రదించి, శిక్షలు అనుభవించి అవుట్‌పాస్‌తో స్వదేశానికి చేరుకుంటున్నారు. తమలా ఎవ్వరూ మోసపోకూడదంటూ మొరపెట్టుకుంటున్నారు. ఏం చెయ్యాలో తెలియక పలువురు కువైట్‌లోనే ఇబ్బందిపడుతున్నారని, మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉందని, నిరుద్యోగులకు ఆశచూపి మోసంచేసే నకిలీ ఏజెంట్లపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. బ్యూటీ పార్లర్‌లో ఉద్యోగం అంటూ ఇంటి పనికి పెట్టారు  కుటుంబ పోషణకోసం బ్యూటీ పార్లర్‌ నడుపుతుండేదాన్ని. నగరికి చెందిన ఒక ఏజెంట్‌ కువైట్‌లో బ్యూటీ పార్లర్‌లో జీతం ఎక్కువగా వస్తుందని, ఇక్కడచేసే పనే అక్కడా  ఉం టుందన్నాడు. అక్కడి నుంచే వీసా పంపుతారు వెళ్లి రావచ్చని నమ్మబలికాడు. కుటుంబ కష్టాలు, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగానికి వెళ్లాను. నాలా పలువురు అక్కడకు వచ్చి ఉన్నారు. కువైట్‌లో మమ్మల్ని రిసీవ్‌ చేసుకున్న ఏజెంట్‌ ఇంటి పనులకంటూ వేలంలో కాంట్రాక్టుపై నన్ను విక్రయించాడు. వారు నన్ను చిత్రహింసలు పెట్టారు. జ్వరంతో ఉన్నా పనిచేయాల్సిందే.. లేకుంటే కొట్టేవారు. నన్ను విడిచిపెట్టండి నేను వెళ్లిపోతాను అంటే చంపేస్తామని భయపెట్టేవారు. అక్కడ పరిచయమైన భారతీయుల ద్వారా పనిచేస్తున్న చోటి నుంచి ఎలాగోలా బయటపడి మరో ప్రాంతంలో పనిలో చేరాను. కుటుంబాన్ని కాపాడుతుందని తల్లిదండ్రులు ఆశ నెరవేర్చేందుకు కువైట్‌లోనే పనిచేస్తున్నాను. – బాధిత మహిళ, నగరి నిద్రపోతే కొట్టారు.. కువైట్‌లో ఇంటి పని ఉంది, జీతం ఎక్కువగా ఇస్తారంటూ నన్ను పంపించారు. అక్కడికి తీసుకెళ్లిన రెండేళ్లకు అగ్రిమెంట్‌ అంటూ ఒక ఇంటిలో పనికిపెట్టారు. వారు  చిత్రహింసలు పెట్టారు. జ్వరం వచ్చి నిద్రపోయినా కొయ్యతో కొట్టేవారు. అగ్రిమెంటు ముగిసేంతవరకు జీతం ఇవ్వలేదు. మళ్లీ కూడా సగం డబ్బులు మాత్రమే ఇచ్చారు. అవస్థలు పడి ఇండియాకు చేరుకున్నాను. ప్రస్తుతం తమిళనాడులో వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నాను. – బాధిత మహిళ, నగరి కష్టాలకు కేరాఫ్‌ కువైట్‌ కష్టాలు తీరుతాయని కువైట్‌కు వెళితే.. అది కష్టాలకు కేరాఫ్‌గా ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళితే సంతలో పశువుల్లా వేలంలో వేసి అగ్రిమెంట్‌ రాయించుకుంటారు. ఆ ఇళ్లలో వారు మాట్లాడే భాష మనకు అర్థమై ఆ పనిచేసేలోపు కొడతారు. మహిళ అన్న గౌరవం ఏ కోశానా∙ఉండదు. మన ఆరోగ్యంపై వారికి శ్రద్ధ ఉండదు. ఏ పరిస్థితిలో ఉన్నా పనిచేసి తీరాల్సిందే. అమాయకులు నకిలీ ఏజెంట్ల కారణంగా మోసపోతున్నారు. అలాంటివారిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – బాధిత మహిళ, నగరి