Labels

డాలర్‌ సిరి.. హెచ్‌ 1బీ వీసా ఉంది మరి


22 Sep, 2019 02:01 IST|Sakshi

అమెరికా వీసా విధానంతో భారత్‌కు కాసుల పంట

భారీగా సొమ్ము పంపుతున్న టెకీలు

2017లో అత్యధికంగా రూ. 4.42 లక్షల కోట్లు

దేశ రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధిలోనూ డాలర్‌ పాత్ర

గ్రీన్‌కార్డు కోసం నిరీక్షిస్తున్న భారతీయుల్లో 26 శాతానికిపైగా మిలియనీర్లే

మిన్నెసోట వర్సిటీ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు 

మారుతున్న ట్రెండ్‌.. 
స్వదేశంలో ఆస్తులు కొనుగోలు చేయడానికి బదులుగా అమెరికాలో విలాసవంతమైన జీవనం గడపాలనుకునే భారతీయుల సంఖ్య నాలుగైదేళ్లుగా పెరుగుతోంది. ఎటూ కొన్నాళ్లకు గ్రీన్‌కార్డు వస్తుంది కదా... ఇల్లు కొను క్కుంటే బాగుంటుందని అను కుంటున్న వాళ్ల సంఖ్య పెరుగు తోంది. అదీ అత్యంత విలాస వంతమైన గృహాల కొనుగోలుకు ఎక్కువ మంది భారతీయులు ఇష్టపడుతున్నారని యూనివర్సిటీ ఆఫ్‌ మిన్నెసోట సోషియాలజీ ప్రొఫెసర్‌ ఎలిజబెత్‌ హెగర్‌ బోయ్లే ఓ నివేదికలో ప్రస్తావించారు. ఆయన బృందం భారతీయులు ఎక్కువగా నివసించే శాన్‌జోస్, డాలస్, హ్యూస్టన్, న్యూజెర్సీ, షికాగో, బోస్టన్, అట్లాంటా వంటి నగరాల్లో సర్వే నిర్వహించింది. 

సాక్షి ప్రత్యేక ప్రతినిధి : పొద్దుంటే మాపుండదు, మాపుంటే రేపుండదు.. బతుకులేమో ఎండిపాయే, మొండిమాను బతుకులాయే’ ఓ సినిమాలో ఈ పాట చరణం కర్ణాటక రాష్ట్రంలోని షిమోగలో ఒక నిరుపేద కుటుంబానికి అక్షరాలా వర్తిస్తుంది. కూలీ పనులు చేస్తూ ఓ పూట తిని ఓ పూట ఉపవాసం ఉంటూ చదివించిన కొడుకు అమెరికా వెళ్లి ఉద్యోగంలో స్థిరపడి ఐదేళ్ల తరు వాత (1990 దశకంలో ఆఖరులో) సొంతూ రుకు బెంగళూరు నుంచి హెలికాప్టర్‌ అద్దెకు తీసుకుని వెళ్లిన ఘటనను జాతీయ పత్రికలు పతాక శీర్షికల్లో ప్రచురించాయి. విదేశీ సాంకేతిక నిపుణులను ఆకర్షించడానికి అమెరికా తీసుకు వచ్చిన హెచ్‌1బీ వీసా అతని కలను సాకారం చేసింది. అంతేకాదు లక్షలాది మంది భారతీయ కుటుంబాల్లో సిరులు నింపింది. 2017లో భార తీయ ఐటీ ఉద్యోగులు ఇక్కడకు బదిలీ చేసిన మొత్తం రూ.4.42 లక్షల కోట్లు (65 బిలియన్‌ డాలర్లు). ఈ మొత్తం ఆ ఏడాది దేశంలోని 16 రాష్ట్ర ప్రభుత్వాల వార్షిక బడ్జెట్‌ కంటే ఎక్కువ. భారతీయులు అమెరికా వెళ్లడం 1970 దశకంలో మొదలైనా అత్యంత ధనవంతులైన పెట్టుబడిదారులు, వైద్యులకు మాత్రమే అవకాశం ఉండేది. సమాచార సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులను గమనించి ఐటీ నిపుణులను ఆకర్షించడానికి 1990 దశకం మధ్యలో అమెరికా తీసుకువచ్చిన హెచ్‌1బీ వీసా విధానం తెలుగు రాష్ట్రాల్లో వేలాది దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఎదగడానికి తోడ్పాటునిచ్చింది.

హెచ్‌1బీ వీసా విధానానికి పూర్వం (1995కి ముందు) అమెరికా నుంచి భారత్‌కు బదిలీ అయిన మొత్తం 5 బిలియన్‌ డాలర్లుకాగా ఈ వీసాతో ఉద్యోగాలు ఇవ్వడం ప్రారంభమైన తరువాత మొదటి ఏడాది భారత్‌కు తరలివచ్చిన నగదు 6 బిలియన్‌ డాలర్లు. ఆ పరంపర 24 సంవత్సరాలుగా కొనసాగుతూ అమెరికా నుంచి వస్తున్న డబ్బు ఏటేటా పెరుగుతోందే తప్ప తగ్గిన దాఖలా కనిపించలేదు. 1998లో 10 బిలియన్‌ డాలర్లను తాకిన విదేశీ సంపద... 2014కు వచ్చేసరికి గరిష్టంగా 70 బిలియన్‌ డాలర్లు (రూ. 3.22 లక్షల కోట్లు) దాటింది. ఆ తరువాత అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో కొంత మార్పు వచ్చి అక్కడే ఇల్లు, ఇతర ఆస్తులు కొనుగోలు చేయడం ప్రారంభించడంతో 2017కు వచ్చేసరికి 5 బిలియన్లు తగ్గి 65 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. గత 2–3 ఏళ్లలో భారతీయ అమెరికన్లలో బాగా మార్పు కనిపించిందని, పుట్టిన పిల్లలను అమెరికాలోనే చదివించడం, విలాసవంతమైన ఇళ్లు, కార్లు కొనుగోలు చేయడం వంటి చర్యల ఫలితంగా భారత్‌కు పంపుతున్న మొత్తం తగ్గుతూ వస్తోందని యూనివర్సిటీ అఫ్‌ మిన్నెసోట అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు... వేలాది మంది భారతీయ అమెరికన్లు మిలియనీర్లు అయ్యారని ఆ అధ్యయనం విశ్లేషించింది. గ్రీన్‌కార్డు (శాశ్వత నివాసం) కలిగి ఉన్న వాళ్లే కాదు, గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న వారిలోనూ మిలియన్‌ డాలర్లు, అంతకంటే ఎక్కువ నికర విలువగలవారు 26 శాతం కంటే ఎక్కువ మంది ఉన్నారు.

13 ఏళ్ల క్రితమే 40 బిలియన్‌ డాలర్లు...
సమాచార సాంకేతిక రంగంలో పనిచేసే నిపుణులు భారత్‌ నుంచి ఏటా వేల సంఖ్యలో అమెరికాకు తరలివెళ్లడంతో 2000 దశకం రెండో భాగం నుంచి భారీగా డాలర్లు వచ్చిపడ్డాయి. 2005కు ముందు 20 బిలియన్‌ డాలర్లు మాత్రమే బదిలీకాగా ఆ తరువాత మూడేళ్లకు (2008) అది 50 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. దాదాపు ఆరేడు సంవత్సరాలపాటు అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులు సంపాదించిన మొత్తంలో 65 శాతానికిపైగా స్వదేశానికి పంపారు. ఏటేటా ఇక్కడి నుంచి వెళ్లే సాంకేతిక నిపుణుల సంఖ్య పెరగడంతో 2014కు వచ్చేసరికి 70 బిలియన్‌ డాలర్లకు ఎగబాకింది. ఆ తరువాత మూడేళ్లపాటు కొంత మేర తగ్గడానికి భారతీయులు అమెరికాలో పెట్టుబడులు పెట్టడమే ప్రధాన కారణం. దానికితోడు ఎప్పుడు వస్తుందో తెలియని వలస ఆధారిత ప్రతిభ గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూడటం కంటే ఈబీ–5 (అర మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెడితే వచ్చే గ్రీన్‌కార్డు) పథకానికి ఎక్కువ మంది మొగ్గు చూపారు. గడచిన మూడేళ్లలో హెచ్‌1బీపై ఉద్యోగం చేస్తున్న లేదా వారి భాగస్వాములు 38 వేల మంది ఈబీ–5 సథకానికి దరఖాస్తు చేశారు. మామూలుగా 8–10 ఏళ్లు గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూడటం కంటే 5 లక్షల డాలర్లు అమెరికా మౌలిక సదుపాయాల సంస్థల్లో పెట్టుబడి పెడితే ఏడాదిలో గ్రీన్‌కార్డు తెచ్చుకోవచ్చన్న ఉద్దేశంతో పెట్టుబడులు పెట్టారు. 

ఇండియా తరువాత ఛైనా...
అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ స్వదేశానికి డబ్బు పంపుతున్న దేశాల జాబితాలో భారత్‌దే అగ్రస్థానం. 2014, 2015లలో అమెరికా నుంచి భారత్‌కు 70 బిలియన్‌ డాలర్లు వస్తే 2016లో 68 బిలియన్‌ డాలర్లు, 2017లో 65 బిలియన్‌ డాలర్లు వచ్చిపడింది. భారత్‌ తరువాత స్థానం చైనాదే. 2012కు ముందు అగ్రస్థానంలో ఉన్న చైనా 2013 నుంచి భారత్‌ కంటే వెనుకబడింది. చైనీయులు అమెరికాలో పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టడం వల్లే భారత్‌ మొదటి స్థానంలోకి వచ్చిందని, సంపాదనలో భారత్‌ కంటే వారిదే పైచేయి అని స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం 2017లో భారత్‌ తరువాత స్థానంలో చైనా, ఫిలిప్పీన్స్, మెక్సికో, ఫ్రాన్స్, నైజీరియా, పాకిస్తాన్, ఈజిప్ట్, జర్మనీ, వియత్నాం ఉన్నాయి. స్టాన్‌ఫర్డ్‌ నివేదిక ప్రకారం భారత్‌ నుంచి అమెరికా వచ్చిన వారిలో 89 శాతం మంది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారే. సహజంగా ఆ రుణం తీర్చడానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. రెండో ప్రాధాన్యతగా స్వదేశంలో ఆస్తులు కూడబెట్టుకునేందుకు డబ్బు పంపారు.

‘రియల్‌’కు ఊతమిచ్చిన అమెరికా డాలర్‌...
అమెరికాలో హెచ్‌1బీపై ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల సంఖ్య ఏటేటా పెరుగుతుండటంతో వారు స్వదేశానికి డబ్బు బదిలీ చేయడం కూడా అంతే స్థాయిలో పెరిగింది. హైదరాబాద్, పుణే, విశాఖపట్నం, భువనేశ్వర్, నోయిడా, జైపూర్, నాగ్‌పూర్‌ వంటి పట్టణాలు, నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగం అభివృద్ధికి అమెరికా డాలర్‌ పాత్ర గణనీయమైనదని స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ మానవాభివృద్ది విభాగం అసొసియేట్‌ ప్రొఫెసర్‌ ఆంటోని లైజింగ్‌ అంటోనియో పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో ఓ బృందం భారత్, చైనాలకు చెందిన 1,100 మంది హెచ్‌1బీ, 550 మంది గ్రీన్‌కార్డు కలిగిన వారిని ఆదాయానికి సంబంధించి ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టింది. వాటి ప్రకారం చూస్తే భారత్‌కు డబ్బు పంపిన వారిలో 74 శాతం మంది రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టామని చెప్పారు. మరో 16 శాతం మంది తమ కుటుంబాల ఉన్నతికి ఖర్చు చేశామని పేర్కొనగా 8 శాతం మంది డాలర్‌ రేటు పెరిగినప్పుడల్లా రూపాయల్లో ఎక్కువ సొమ్ము వస్తుందన్న ఉద్దేశంతో బదిలీ చేశామన్నారు. రెండు శాతం మంది తాము అమెరికాలోనే ఇల్లు, కార్లు కొనుగోలు చేయడానికి ఖర్చు చేశామని వివరించారు.

ఊరికి ఇద్దరు లేదా ముగ్గురు...
డాలర్‌ డ్రీమ్‌ తెలుగు రాష్ట్రాలను గత పదేళ్లుగా ఊపేస్తోంది. ఒకరిని చూసి మరొకరు అప్పు చేసైనా సరే అమెరికా వెళ్లాలనే పట్టుదల పెరిగింది. ఊరికి ఇద్దరు లేదా ముగ్గురు అమెరికాలో ఉన్నారు. వెళ్లాలనుకునేవారు ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరంలో ఉండగానే జీఆర్‌ఈ, టోఫెల్‌ శిక్షణకు వెళ్తున్నారు. ఈ కారణంగానే హైదరాబాద్‌లో ఈ శిక్షణా సంస్థలు విపరీతంగా వెలిశాయి. అప్పులు ఇస్తామంటూ బ్యాంకులు ఉదారంగా ముందుకు వస్తున్నాయి. 2010కి ముందు ఏటా రూ. 1,500–2,000 కోట్ల మధ్య విద్యా రుణాలు ఇచ్చిన భారతీయ బ్యాంకులు... 2012 తరువాత రుణాలను 12 వేల కోట్లకు పెంచాయి.