ఈ ఏడాది చలి తక్కువే!
విశాఖపట్నం, అక్టోబర్ 21: ఈ ఏడాది చలి తక్కువే ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది వర్షాకాలంలో కూడా సాధారణ ఉష్ణోగ్రతల కన్నా నాలుగు, ఐదు డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంగతి తెలిసిందే. దీంతోపాటు ఈఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావం అంతంతమాత్రంగానే ఉన్నాయి. తెలంగాణలో 15 నుంచి 16 శాతం, కోస్తాలో 10 శాతం, రాయలసీమలో నాలుగు శాతం తక్కువగా వర్షాలు కురిసాయి. దీంతో వాతావరణం చల్లబడలేదు. ఫలితంగా వచ్చే శీతాకాలంలో సాధారణ ఉష్ణోగ్రత కన్నా ఒకటి, రెండు డిగ్రీల అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు తెలియచేస్తున్నారు. గత ఏడాదితో పోల్చి చూస్తే, ఈ ఏడాది చలి తక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉండగా సాధారణంగా అక్టోబర్ 20 నాటికి ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాలి. కానీ ఈ సంవత్సరం రుతుపవనాల రాకకు మరో నాలుగైదు రోజుల వ్యవధిపడుతుందని ఆంధ్రా యూనివర్సిటీ ఓష్ణోగ్రఫీ ప్రొఫెసర్ భానుకుమార్ తెలిపారు. సైబీరియా నుంచి ప్రయాణాన్ని ఆరంభించిన ఈశాన్య రుతుపవనాల వలన ఈ ఏడాది సాధారణ వర్షపాతమే నమోదవుతుందని ఆయన వెల్లడించారు. తుపానుల గమనం, ఫ్రీక్వెన్సీ గతి తప్పడం వలన నిపుణుల అంచనాలకు తగ్గట్టుగా అవి ప్రయాణించడం లేదని చెప్పారు.
No comments:
Post a Comment