న్యూఢిల్లీ, అక్టోబర్ 21: హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలనుంచి గృహ రుణాలు తీసుకున్న వారికి ఓ శుభవార్త. ఈ సంస్థల్లో గృహ రుణాలు తీసుకునే కస్టమర్లు ముందుగా జరిపే చెల్లింపులపై పెనాల్టీలు వసూలు చేయడాన్ని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బి) నిషేధించింది. దీనివల్ల దాదాపు 54 హౌసింగ్ ఫైనాన్స్ సంస్థల్లో రుణాలు తీసుకున్న కస్టమర్లకు లాభం చేకూరనుంది. అంతేకాకుండా ఎప్పుడు రుణం తీసుకున్నా పాత, కొత్త రుణ గ్రహీతలందరూ ఒకే వడ్డీ రేటు చెల్లించేలా చూడాలని కూడా హౌసింగ్ ఫైనాన్స్ రెగ్యులేటర్ కూడా అయిన ఎన్‌హెచ్‌బి హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలను కోరింది. ముధవారం నోటిఫై చేసిన ఈ రెండు నిర్ణయాలు హెచ్‌డిఎఫ్‌సి మొదలుకొని ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ దాకా అన్ని హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలకు వర్తిస్తాయని ఎన్‌హెచ్‌బి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్వి వర్మ చెప్పారు. ఈ రెండు ఆదేశాలను నోటిఫై చేయడం ద్వారా ఎన్‌హెచ్‌బి రిజర్వ్ బ్యాంక్ గత కొంతకాలంగా అనుకుంటున్న ఆలోచనను కార్యరూపంలోకి తెచ్చినట్లయింది. వాస్తవానికి రిజర్వ్ బ్యాంక్ గత కొద్దిరోజులుగా ఈ విషయమై బ్యాంకులతోను, అంబుడ్స్‌మన్‌లతో చర్చలు జరుపుతూ ఉంది. అయితే బ్యాంకులకు ఈ విషయమై ఆదేశాలు జారీ కానందున హౌసింగ్ రుణాలు తీసుకున్న మొత్తం కస్టమర్లలో 33 శాతం మందికి మాత్రమే లబ్ధి చేకూరనుంది. ఇకపై హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు ఫ్లోటింగ్ రేటు రుణాలపై ఎలాంటి పెనాల్టీలు విధంచబోవని ఎన్‌హెచ్‌బి తెలిపింది. ఫిక్స్డ్ రేటు రుణాలు తీసుకున్న వారిని మాత్రం రెండు వర్గాలుగా విభజించింది. ఒక వేళ రుణం తీసుకున్న వారు తమ సేవింగ్స్ ద్వారా కానీ, లేదా బంధువులనుంచి అప్పు తీసుకుని కానీ, సొంతమార్గంలో రుణాన్ని చెల్లిస్తే పెనాల్టీ చెల్లింపునుంచి పూర్తి మినహాయింపు లభిస్తుంది. అదే వేరే బ్యాంక్‌కు, లేదా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థకో మారినప్పుడు పెనాల్టీ వర్తిస్తుంది. దీనివల్ల రుణ గ్రహీతలు తక్కువ వడ్డీ ఉండే బ్యాంకులు, హౌసింగ్ సంస్థలకు మారడానికి వీలు కలుగుతుంది. బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు ఇప్పటివరకు రుణాలు ముందుగా చెల్లిస్తే 4 శాతం దాకా పెనాల్టీ విధిస్తున్నాయి. దీంతో విధిలేక రుణగ్రహీతలు అదే సంస్థలో కొనాసగుతున్నారు. ఇప్పుడు ఆ ఇబ్బంది ఉండదు.
No comments:
Post a Comment