Labels

విమాన ప్రయాణికుల కోసం.. జపాన్‌ ఎయిర్‌ లైన్స్‌ సరికొత్త ఫీచర్‌

టోక్యో: మనం విమాన ప్రయాణం చేస్తునప్పుడు చాలా విషయాలు మనకు చిరాకు తెప్పిస్తుంటాయి. నచ్చని సీటు, పక్క సీట్లో వ్యక్తి గురక పెట్టడం, పక్క సీట్లో ఏడ్చే పిల్లలు ఇలా చాలా సమస్యలుంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లల ఏడుపు ఒక్కొసారి మనకు తలనొప్పి తెప్పిస్తుంటుంది. విమాన ప్రయాణికుల్లో చాలా మంది దీన్ని అస్సలు తట్టుకోలేరు కూడా. అలాంటి వారి కోసమే జపాన్‌ ఎయిర్‌ లైన్స్‌ సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. టిక్కెట్ రిజర్వేషన్‌ బుకింగ్‌లో ఒక కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. టిక్కెట్‌ బుకింగ్‌ సమయంలో రెండేళ్లలోపు పిల్లలు ఏ వరుసలో, ఏ సీటులో కూర్చున్నారో తెలియజేస్తూ బేబీ బొమ్మతో ఉన్న ఐకాన్‌ కనిపిస్తుంది. దాంతో ఆ సీటును వదిలేసి మిగతా వాటిలో ఖాళీగా ఉన్న సీటును ముందుగానే మనం బుక్‌చేసుకోవచ్చు. దీని కోసం ‘సీట్‌ అరెంజ్‌మెంట్‌’ చార్ట్‌‌ను ఉపయోగించుకోవాలి. అలాగే ఎనిమిది రోజుల పసివాళ్ల నుంచి రెండేళ్లలోపు పిల్లలను తీసుకొచ్చే ప్రయాణికులు కూడా ‘బేబీ ఐకాన్‌’ చూపిన సీటునే ముందుగా బుక్‌ చేసుకోవాల్సి ఉంటుందట. ఇక ఈ ఫీచర్ పిల్లలు లేనివారికి సౌరక్యవంతంగానే ఉన్నా... పిల్లలను తీసుకొచ్చే వారికి మాత్రం కొంచెం తలనొప్పి వ్యవహారమనే చెప్పాలి.