Labels

విమానంలో ఎయిర్ హోస్టెస్‌తో అసభ్య ప్రవర్తన.. ఎన్నారైకి నాలుగు నెలల జైలు

సింగపూర్: విమానంలో ఎయిర్ హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించిన ఎన్నారైకి సింగపూర్ న్యాయస్థానం శుక్రవారం నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. వినయన్ మాథన్ అనే వ్యక్తి నవంబర్ 2, 2017లో కొచ్చి నుంచి సింగపూర్ వెళ్తున్న విమానంలో ప్రయాణించాడు. ఆ సమయంలో 22 ఏళ్ల ఎయిర్ హోస్టెస్‌తో మాథన్ అసభ్యంగా ప్రవర్తించాడు. కావాలనే కాల్ లైట్ బటన్‌ను మళ్లీ మళ్లీ నొక్కి ఆమెను పిలవడం చేశాడు. అప్పటికే ఆమె ఇలా చేయకండి సార్ అని వారించే ప్రయత్నం చేసింది. కాని ఎయిర్ హోస్టెస్‌ మాటలను పెడచెవిన పెట్టిన అతడు నీవు చాలా అందంగా ఉన్నావంటూ ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని దగ్గరకు లాక్కున్నాడు. అతడి చర్య ఆమెకు కష్టంగా ఉన్న, అసహ్యంగా అనిపిస్తున్న ప్రయాణికుడు అనే కారణంతో మర్యాదపూర్వంగా మీరు ఇలా చేయడం సరికాదు సార్ అంటూ అక్కడి నుంచి వెళ్లబోయింది. నా మీద నీకు కోపంగా ఉంది కదూ. నేను ఈ ఫ్లైట్‌కు బాస్ అంటూ ఆమెను మరింత దగ్గరకు లాక్కుని గట్టిగా అదిమిపట్టుకున్నాడు. ఎలాగోలా అతడి నుంచి తప్పించుకున్న ఆమె జరిగిన విషయం విమానం కెప్టెన్‌తో చెప్పింది. అలాగే విమానం ల్యాండ్ అయిన తరువాత సింగపూర్ ఎయిర్‌పోర్టు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. దీంతో మాథన్‌పై పోలీసులు మహిళపై వేధింపుల కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసు న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. విచారణలో తన నేరాన్ని అంగీకరించడంతో మాథన్‌కు కోర్టు నాలుగు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.