‘చంద్రయాన్-2 వందకు వంద శాతం సక్సెస్’
23 Sep, 2019
న్యూఢిల్లీ : ‘చంద్రయాన్-98 శాతం సక్సెస్’ అని ఇస్రో చైర్మన్ శివన్ చేసిన వ్యాఖ్యల్ని మాజీ శాస్త్రవేత్తలు తప్పుబడుతున్నారు. కీలకమైన ల్యాండర్ విక్రమ్‌తో సంబంధాలు తెగిపోయినా కూడా ప్రయోగం విజయవంతమైందని చెప్పడమేంటని ఆక్షేపిస్తున్నారు. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విక్రమ్ విడిపోయిన సమయంలోనే చంద్రయాన్-2 ప్రయోగం 90 నుంచి 95 శాతం సక్సెస్ అయిందని చెప్పారని, విక్రమ్ పత్తా లేకుండా పోయినా మరో మూడు శాతం కలిపి ప్రయోగం 98 శాతం విజయవంతమైందని చెప్పడం దేనికి సంకేతమని విమర్శించారు. మరో నాలుగు రోజులు ఆగితే.. ‘చంద్రయాన్-2 వందకు వంద శాతం సక్సెస్’ అంటారని చురకలంటించారు. వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ముందుకు సాగాలని సూచించారు. అంతర్జాతీయ మీడియా మనల్ని గమనిస్తోందని, శివన్ అర్థవంతమైన ప్రకటనలు చేస్తే మంచిదని హితవు పలికారు.
ఇక చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌ల కథ దాదాపుగా ముగిసిపోయింది. చంద్రగ్రహంపై శుక్రవారం-శనివారం అర్ధరాత్రి మధ్య రాత్రి సమయం ప్రారంభం కావడంతో విక్రమ్‌తో మళ్లీ సంబంధాలు ఏర్పరుచుకోవాలన్న ఇస్రో ఆశలు అడియాసలయ్యాయి. చంద్రగ్రహంపై రాత్రివేళ మైనస్ 180 డిగ్రీల సెల్సియస్ వాతావరణం ఉంటుంది. అలాంటి ప్రతికూల వాతావరణంలో పనిచేసే విధంగా విక్రమ్ రూపొందలేదు. చంద్రుడిపై రాత్రి అంటే.. భూమిపై 14 రోజులకు సమానం. అక్కడ పగలు కూడా పద్నాలుగు రోజలుంటుంది. చంద్రుడిపై రాత్రి ప్రారంభం కావడంతోనే విక్రమ్ ల్యాండర్ పనిచేయడం ఆగిపోతుంది. పైగా, చంద్రుడిపై విక్రమ్ ‘హార్డ్ ల్యాండింగ్’ చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సోలార్ ప్యానెళ్లు అనుకున్నరీతిలో సెట్‌కాకపోతే.. చార్జింగ్ అయిపోయే.. విక్రమ్ మూగబోయే అవకాశముంది.