చెక్ పెట్టేందుకు సన్నద్ధం
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ప్రకటించిన రోజు నుంచి వివాదంగా మారి తమ మధ్య ఘర్షణకు దారితీస్తూ సాగిపోతున్న బిజెపి అగ్రనేత అద్వానీ జన చేతన యాత్రపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తీవ్ర అసహనంతో ఉంది. తమకిచ్చిన హామీకి విరుద్ధంగా ప్రధానమంత్రి పదవిపై పూటకొక మాట మార్చటమే కాక పార్టీ ప్రయోజనాల కంటే తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునే వేదికగా అద్వానీ యాత్ర జరుగుతోందని సంఘ్ భావిస్తోంది. ఈ ప్రక్రియకు చెక్ పెట్టే దిశలో తన కార్యకర్తలకే కాక బిజెపికి చెందిన సీనియర్ నాయకులకు కూడా వ్యవహరించవలసిన తీరుతెన్నులను ఖరారు చేసింది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం అద్వానీ యాత్రలో ఆయన కుమార్తె ప్రతిభతో పాటు ఆయనకు అత్యంత నమ్మకస్థులైన పార్టీ ప్రధాన కార్యదర్శి అనంతకుమార్, పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రవి శంకర్ ప్రసాద్, స్వదేశీ జాగరణ్ మంచ్‌కి చెందిన మురళీధర్‌రావు కీలక పాత్ర వహిస్తున్నారు. వీరిలో మురళీధర్‌రావు మాత్రమే సంఘ్ మనిషి. యాత్ర సాగేచోట స్థానిక నాయకులు, రాష్ట్ర శాఖల నాయకులు అద్వానీని అనుసరిస్తున్నారు. అయితే అద్వానీ ప్రయాణం చేస్తున్న రథంపై ఆయనతో పాటు కుమార్తె ప్రతిభ, యాత్ర కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న అనంతకుమార్‌లకు తప్పించి స్థానిక నాయకులకు స్థానం లభించకపోవటం, స్థానికులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవటం వంటి అంశాలను సంఘ్ తీవ్రంగా పరిగణిస్తోందని చెబుతున్నారు. ఇది ఒక ఎత్తయితే ప్రధాన మంత్రి పదవి రేసులో తాను లేననీ, ఉండబోనని కరాఖండిగా ప్రతిచోట చెప్పవలసిందిగా యాత్ర ప్రారంభానికి ముందే సంఘ్ అద్వానీకి స్పష్టం చేసింది. తాము విధించిన ఈ షరతుకు అంగీకరిస్తేనే స్వయం సేవకలు యాత్రను విజయవంతం చేయటానికి సహకరిస్తారని ఆర్ఎస్ఎస్ తేల్చిచెప్పింది. అయితే అద్వానీ ఇప్పటివరకు పూర్తయిన రథయాత్రలో ప్రధానమంత్రి పదవిపై ఆర్ఎస్ఎస్ ఆదేశాలను ఖాతరు చేయటం లేదు. పార్టీయే తుది నిర్ణయం తీసుకుంటుందని ఒకసారి, ఆరోగ్యం అనుమతిస్తే అప్పుడు ఆలోచిస్తానని మరోసారి బాణి మార్చటాన్ని సంఘ్ తీవ్రంగా పరిగణిస్తోంది. అద్వానీ వ్యవహరిస్తున్న తీరును అదుపుచేయని పక్షంలో రానున్న కాలంలో పార్టీపై తీవ్ర ప్రభావం చూపించే అస్కారం ఉందని భావిస్తోంది. ఈ తిరుగుబాటు ధోరణిని ఆదిలోనే తుంచి వేసే చర్యలకు సంఘ్ ఉపక్రమించింది. ఇంతకుముందు తీసుకున్న నిర్ణయం మేరకు జాతీయ స్థాయిలోని ప్రముఖ నాయకులు తమ నియోజకవర్గాలు, రాష్ట్రాలతో నిమిత్తం లేకుండా అద్వానీ యాత్రలో పాల్గొనవలసి ఉంది. అయితే ఇప్పుడు ఇద్దరు ప్రతిపక్ష నాయకులు సైతం అద్వానీ యాత్రకు డుమ్మా కొట్టే అవకాశాలున్నాయి. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గత ఎన్నికలలో మధ్యప్రదేశ్ నుంచి గెలిచినందున అద్వానీ యాత్రలో పాల్గొన్నారు. రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు పంజాబ్, జమ్మూ, హిమాచల్ ప్రదేశ్‌లో జరిగే ర్యాలీలలో పాల్గొంటారు. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ ఆ రాష్ట్రంలో భాగస్వామ్య పక్షం అధినేతగా యాత్రలో పాల్గొంటారు. తమ కూటమి లేదా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు యాత్రలో పాలుపంచుకుంటారని తెలిసింది.
No comments:
Post a Comment