Labels

టాలీవుడ్‌కు కలిసొచ్చిన కాలం

తెలుగు చిత్రపరిశ్రమకు 2011 బాగానే కలిసివస్తున్నట్లుంది. ఈ ఏడాదిలో విడుదలైన అగ్రహీరోల చిత్రాలు బాలయ్య ‘పరమవీరచక్ర’, ఎన్‌టిఆర్ ‘శక్తి’, పవన్‌కళ్యాణ్ ‘తీన్‌మార్’ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తాకొట్టి పరిశ్రమను ఆలోచనలో పడేసినప్పటికీ కొన్ని చిత్రాలు మళ్లీ మళ్లీ ఊపిరిపోశాయి. నందినీరెడ్డి ‘అలా..మొదలైంది’ మొదలుకుని రవితేజ ‘మిరపకాయ్’, ఆది ‘ప్రేమకావాలి’, నరేష్ ‘అహ..నా పెళ్లంట’ చిత్రాలు విజయవంతం కావడంతో పాటు తాజాగా ప్రభాస్, కాజల్ అగర్వాల్ నటించిన ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’తో పాటు నాగచైతన్య, తమన్నాల ‘100%లవ్’ చిత్రాలు కూడా అదే బాటలో పయనించి మంచి ఫలితాలను తెచ్చిపెడుతున్నాయి. అంతే కాదు నరేష్, పూర్ణ నటించిన ‘సీమ టపాకాయ్’తో పాటు ‘రంగం’ అనే అనువాద చిత్రం కూడా హిట్ టాక్ తెచ్చుకోవడం..వసూళ్లు పెంచుకోవడం పరిశ్రమకు సంతోషాన్ని ఇచ్చింది. ‘అలా మొదలైంది’ చిత్రంతో నందినీరెడ్డి దర్శకురాలిగా పరిచయం కాగా, నిత్యామీనన్ హీరోయిన్ రంగ ప్రవేశం చేసింది. అలాగే ‘ప్రేమకావాలి’ చిత్రంతో సాయికుమార్ తనయుడు ఆది హీరోగా పరిచయం కావడంతో పాటు, ఇషాచావ్లా అనే హీరోయిన్ తెలుగు తెరంగేట్రం చేసింది. అదే విధంగా ‘అహ నా పెళ్లంట’ చిత్రం ద్వారా వీరభద్రం అనే దర్శకుడు పరిచయం కాగా, అదే చిత్రం ద్వారా రీతూ బర్మేచా అనే భామ తెలుగు తెరపై తళక్కున మెరిసింది. ఇక ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’తో దశరథ్, ‘100%లవ్’తో సాయికుమార్, ‘సీమటపాకాయ్’తో జి.నాగేశ్వరెడ్డి ఫామ్‌లోకి రావడం మరో విశేషం. కాబట్టి ఇప్పటి వరకు చూస్తే టాలీవుడ్‌లో ఎక్కువ శాతం మంచి జరిగినట్టేనని విశే్లషకులు అంచనా. ఏది ఏమైనా ఈ ఏడాది టాలీవుడ్‌కు బాగానే కలిసి వస్తుండడం అందరికీ సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ ఊపుతోనే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయని ఆశిద్దాం. -ఎమ్.డి

No comments:

Post a Comment