Labels

కశ్మీర్‌లో ఒక్కసారే పర్యటించిన గాంధీ.. అప్పుడు ఆయన ఏమన్నారు?

26 సెప్టెంబర్ 2019


స్వాతంత్ర్యం ఇంటి గుమ్మం దగ్గరే ఉంది. కానీ, తలుపు ఇంకా తెరుచుకోలేదు. రాచరిక రాజ్యాలను విలీనం చేసే ప్రణాళికలో జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ తలమునకలై ఉన్నారు.

రాచరిక రాజ్యాలు రకరకాల ఎత్తులు వేస్తున్నాయి. భారత దేశంలో విలీనం అయ్యేందుకు అనేక షరతులు పెడుతున్నాయి.

అదే సమయంలో, సామ్రాజ్యవాద శక్తులు కొత్త కుట్రలు పన్నుతున్నాయి. స్వాతంత్ర్యం అంచున ఉన్న భారత్‌పై ఓ కన్నేసి ఉంచడంతో పాటు, ఆసియా కీలక రాజకీయాల్లో జోక్యం చేసుకునేందుకు ఈ పరిస్థితులను ఒక అవకాశంగా మలచుకోవాలని ఆ శక్తులు చూస్తున్నాయి.

అప్పటికే పాకిస్తాన్ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. కశ్మీర్ కూడా సామ్రాజ్యవాదుల వ్యూహానికి అనుకూలంగా ఉంది. 1881 నుంచి సామ్రాజ్యవాదులు ఆ 'సాలిగూడు'ను అల్లుతూ వస్తున్నారు. అందుకు సంబంధించిన పత్రాలు తాజాగా బయటపడ్డాయి.

కశ్మీర్ కీలకంగా మారింది. రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న యువ నాయకుడు షేక్ మొహమ్మద్ అబ్దుల్లాకు కాంగ్రెస్‌ మద్దతు ఉంది. ఆయన జవహర్‌లాల్‌కు సన్నిహితుడిగా ఉండేవారు.

స్థానికంగా నిరసన కార్యక్రమం చేపట్టిన ఆయనను మహారాజా హరిసింగ్ జైలులో పెట్టారు. దాంతో, ఆగ్రహం వ్యక్తం చేసిన జవహర్‌లాల్ నెహ్రూ ప్రతీకార చర్యలు చేపట్టేందుకు కశ్మీర్ వెళ్లారు. ఆయనను కూడా తన సొంత గెస్ట్ హౌజ్‌లోనే గృహనిర్బంధం చేశారు. ఆ పరిణామంతో మహారాజాకు ఇక్కట్లు మొదలయ్యాయి.

కశ్మీర్ ఎటు వెళ్లాలి? అన్న సందిగ్ధత కారణంగా లోయలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. ఆ పరిస్థితులను చక్కదిద్దేందుకు ఎవరు బాధ్యత వహిస్తారు? బాపుజీని అక్కడికి వెళ్ళాలని కోరితే ఎలా ఉంటుంది? అని లార్డ్ మౌంట్‌బాటన్ ప్రతిపాదించారు.
‘అల్-ఖైదాకు మా దేశమే శిక్షణ ఇచ్చింది’ : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంగీకారం
హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్తాన్‌కు చేరిన 3.5 కోట్ల పౌండ్ల సొమ్ము దక్కేది ఎవరికి?Image copyrightGETTY IMAGES

అంతకుముందు మహాత్మా గాంధీ ఎన్నడూ కశ్మీర్‌‌లో అడుగుపెట్టలేదు. వెళ్లాలని అనుకున్న ప్రతిసారీ ఏదో ఒక కారణంతో ఆ పర్యటన విరమించుకోవాల్సి వచ్చేది.

జిన్నా కూడా కశ్మీర్‌ను కేవలం ఒక్కసారే సందర్శించారు. అప్పుడు, టొమాటోలు, కోడి గుడ్లతో ఆయనకు స్వాగతం లభించింది. భూస్వాములకు, యువరాజులకు జిన్నా అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉండేది.

గాంధీజీ కశ్మీర్ వెళ్లాలని మౌంట్‌బాటన్ ప్రతిపాదనలు చేశారు. గాంధీజీకి అప్పుడు 77 ఏళ్లు.

భారత భౌగోళిక స్వరూప మూలాలు బలంగా లేకపోతే, రాచరిక రాజ్యాలు భవిష్యత్తులో కొరకరాని కొయ్యలా తయారవుతాయని ఆయనకు తెలుసు. కశ్మీర్ వెళ్లేందుకు గాంధీ సరే అన్నారు.

"మీరు ఈ వయసులో అంత క్లిష్టమైన ప్రయాణం చేయడం అవసరమా? మీరు మహారాజాకు లేఖ పంపితే సరిపోతుంది కదా" అని ఒకరు గాంధీకి సలహా ఇచ్చారు. గాంధీ ఆయన కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ... ’’మీ లాజిక్ ప్రకారం, బంగ్లాదేశ్‌లోని నోవాఖలీకి కూడా నేను వెళ్లాల్సిన అవసరం లేదు. అక్కడికి కూడా నేను ఉత్తరం పంపేవాడిని కదా. కానీ మిత్రమా, అలా చేస్తే పనులు జరగవు" అని అన్నారు.

ఆ ప్రయాణం చాలా క్లిష్టమైనది. కానీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా, గాంధీజీ తన ప్రయాణాన్ని పెద్ద ఇబ్బందిగా భావించలేదు.

స్వాతంత్య్రానికి కేవలం 14 రోజుల ముందు మహాత్మా గాంధీ తొలిసారి రావల్పిండి మీదుగా కశ్మీర్ చేరుకున్నారు. కశ్మీర్‌కు ఆయన చివరి ప్రయాణం కూడా అదే. ఆ ప్రయాణం ప్రారంభానికి ముందు, 1947 జులై 29న ప్రార్థనా సమావేశం సందర్భంగా తాను కశ్మీర్‌‌కు వెళ్తున్నానని గాంధీ చెప్పారు.

"భారత్‌లోనే ఉండేలా కశ్మీర్‌‌ను ఒప్పించేందుకు నేను అక్కడికి వెళ్లడం లేదు. ఆ నిర్ణయం తీసుకోవాల్సింది కశ్మీర్ ప్రజలు.. అది నేను లేదా మహారాజా తీసుకునే నిర్ణయం కాదు. కశ్మీర్‌కు మహారాజా ఉన్నారు, పౌరులు ఉన్నారు. ఒకవేళ రేపు రాజు మరణించినా, ఆ ప్రజలు అక్కడే ఉంటారు. కశ్మీర్ భవితవ్యాన్ని నిర్ణయించేది వాళ్లే" అని మహాత్మా గాంధీ అన్నారు.
Image copyrightGETTY IMAGESచిత్రం శీర్షికజవహర్ లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ

1947 ఆగస్టు 1న గాంధీ కశ్మీర్ చేరుకున్నారు. అప్పట్లో ఎన్నడూ లేనంతగా భారీ మొత్తంలో ప్రజలు కశ్మీర్ లోయలో ఒక్కచోటకు చేరుకున్నారు. జీలం నది మీద ఉన్న వంతెన మీద కూర్చునేందుకు కూడా చోటు దొరకనంత మంది వచ్చారు.

ఆ వంతెన మీది నుంచి శ్రీనగర్‌లోకి గాంధీ కారు వెళ్లలేకపోయింది. దాంతో, ఆయన కారు దిగి, బోటులో నదిని దాటి శ్రీనగర్‌కు వెళ్లారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన కశ్మీరీలు, గాంధీ పర్యటన పట్ల ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారు.

ఆ సమయంలో షేక్ అబ్దుల్లా జైలులో ఉన్నారు. గాంధీ కోసం బేగం అక్బర్ జెహాన్ అబ్దుల్లా కూడా మర్యాదపూర్వక విందు ఏర్పాటు చేశారు. మహారాజా కూడా తన రాజభవనంలో విందు ఇచ్చారు.

మహారాజా హరి సింగ్, మహారాణీ తారా దేవీ, రాకుమారుడు కరణ్ సింగ్ రాజభవనం నుంచి బయటకు వచ్చి గాంధీకి స్వాగతం పలికారు. దేశీయ వ్యవహారాల గురించి అక్కడ వారు ఏం చర్చించారో తెలియలేదు. కానీ, బేగం అక్బర్ జెహాన్ విందు కార్యక్రమంలో మాత్రం బాపూజీ బాహాటంగానే మాట్లాడారు.
Image copyrightGETTY IMAGES
"ఈ రాచరిక రాజ్యానికి నిజమైన పాలకులు ప్రజలే. వాళ్లు పాకిస్తాన్‌తో వెళ్లాలని అనుకుంటే, వారిని ఏ శక్తీ అడ్డుకోలేదు. కానీ, ప్రజల అభిప్రాయాలను మీరు ఎలా సేకరిస్తారు? ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు అనువైన పరిస్థితులను నెలకొల్పాలి. ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడించేలా చూడాలి. వారిపై దాడి చేసి, వారి గ్రామాలను, ఇళ్లను తగలబెట్టడం ద్వారా మీరు వారి అంగీకారాన్ని పొందలేరు.

తాము ముస్లింలం అయినప్పటికీ భారతదేశంలోనే ఉండాలని కోరుకుంటున్నామని ఇక్కడి ప్రజలు చెబితే, వారిని ఏ శక్తీ ఆపలేదు. పాకిస్తానీయులు ఈ ప్రాంతంలోకి ప్రవేశిస్తే, వారు తమ పాలనను స్థాపించకుండా ఇక్కడి ప్రజలు అడ్డుకోవాలి. పాకిస్తాన్‌ను అడ్డుకోలేకపోతే, అప్పుడు వారు నిందల నుంచి తప్పించుకోలేరు" అని గాంధీ అన్నారు.

భారత విధానాన్ని గాంధీ మరోసారి స్పష్టం చేశారు: "కాంగ్రెస్ ఎప్పుడూ రాచరికానికి వ్యతిరేకమే. అది ఇంగ్లండ్‌లో కావచ్చు, ఇక్కడ కావచ్చు. షేక్ అబ్దుల్లా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటారు, దాని కోసం పోరాడుతున్నారు. మేము ఆయనకు అండగా ఉన్నాం. ఆయన జైలు నుంచి బయటకు రావాలి. ఆ తర్వాత ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఆయనతో చర్చలు జరుపుతాం. కశ్మీర్ ఎటు వెళ్లాలో ఇక్కడి ప్రజలు నిర్ణయిస్తారు" అని గాంధీజీ అన్నారు.

"ఇక్కడి ప్రజలు" అని చెప్పినప్పుడు గాంధీ తన ఉద్దేశాన్ని కూడా స్పష్టం చేశారు: "ఇక్కడి ప్రజలు" అంటే, నేను ముస్లింలు, హిందువులు, కశ్మీరీ పండిట్స్, డోగ్రాలు, సిక్కులను ఉద్దేశించి అన్నాను" అని ఆయన వివరించారు.
Image copyrightGETTY IMAGES

కశ్మీర్‌ విషయంలో భారత్ తన పాత్ర గురించి అధికారికంగా చేసిన ప్రకటన అది. అప్పటికి స్వతంత్ర భారత ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఏర్పడనందున గాంధీ ప్రభుత్వ ప్రతినిధి కాదు.

ఆయన భారత స్వాతంత్ర్య పోరాట విలువలకు పితామహుడు. స్వతంత్ర భారతదేశం పాత్రకు అత్యంత అధికారిక, విశ్వసనీయమైన ప్రతినిధి అన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు.

గాంధీ పర్యటన కశ్మీరీలలో విశ్వాసాన్ని ఎంతగానో పెంచింది. షేక్ అబ్దుల్లా జైలు నుంచి విడుదల, కశ్మీర్ భారత దేశంతోనే ఉంటుందని ఆయన ప్రకటించడం, కశ్మీరీ ముస్లింలను పాకిస్తాన్ నుంచి వేరుచేసేందుకు ఆయన ప్రయత్నించడంలో ఆ విషయం స్పష్టంగా కనిపించింది.

జవహర్‌లాల్ నెహ్రూ -సర్దార్ పటేల్- షేక్ అబ్దుల్లాలు గాంధీ ప్రశంసలు పొందారు. అలా చరిత్రలో ఓ అధ్యాయం లిఖితమైంది. ప్రస్తుత ప్రభుత్వం దానిని చెరిపివేసేందుకు ప్రయత్నిస్తోంది.

ఆనాటి ప్రక్రియలో ఎలాంటి పాత్రా పోషించని వారు, ఇవాళ దానిని తుడిచేసేందుకు తాము అర్హులమని చెప్పుకొంటున్నారు.

ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. పాకిస్తాన్ తన సైనిక బలంతో కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు, భారత్ తిప్పికొట్టింది.

అప్పుడు, మహాత్మా గాంధీ భారత సైనిక చర్యకు మద్దతు ఇచ్చారని మరచిపోకూడదు.