Labels

లాల్‌ బహుదూర్‌ శాస్త్రి మరణం: గుండెపోటా? విషప్రయోగమా? 52 ఏళ్లయినా సమాధానం దొరకని ప్రశ్నలు


తెలుగు డెస్క్
బీబీసీ
26 సెప్టెంబర్ 2018

Image copyrightGETTY IMAGESచిత్రం శీర్షికలాల్ బహుదూర్ శాస్త్రి

భారత మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి మరణించి 52 ఏళ్లయినా ఇప్పటికీ ఆయన మృతిపై ముసురుకున్న అనుమానాలకు తెరపడలేదు.

1965లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం తరువాత 1966 జనవరిలో శాస్త్రి అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌తో భేటీ అయ్యేందుకు అప్పటి సోవియట్ యూనియన్‌లోని తాష్కెంట్ వెళ్లారు. భారత్, పాక్‌ల సంయుక్త ప్రకటనపై ఆయన సంతకం చేసిన కొద్ది గంటల్లోనే మరణించారు.

అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన మరణంపై ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు.

శాస్త్రి మృతిపై విచారణ జరిపేందుకు జనతా పార్టీ హయాంలో రాజ్‌ నారాయణ్ కమిటీని ఏర్పాటుచేసినా ఆ నివేదిక వెలుగు చూడలేదు.

శాస్త్రి మృతికి సంబంధించిన పత్రాలను బయటపెట్టాలని కోరుతూ నవదీప్ గుప్తా అనే సమాచార హక్కు కార్యకర్త గత ఏడాది జులై 14న కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. హోం శాఖ ఆ దరఖాస్తును 'నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా'కు పంపించగా వారు సమాచారం ఇవ్వలేమని సమాధానమిచ్చారు.

దరఖాస్తుదారు దానిపై రెండుసార్లు అప్పీల్ చేసుకున్నా సమాచారం రాకపోవడంతో కేంద్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు.

దీనిపై విచారణ జరిపిన కమిషన్... పత్రాలను బహిర్గతం చేయాలని ప్రధాన మంత్రి కార్యాలయ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు(సీపీఐవో) సహా విదేశాంగ, హోం శాఖల సీపీఐవోలను ఆదేశించింది.

విచారణ సందర్భంగా వివిధ శాఖలు ఏం చెప్పాయన్నది పేర్కొంటూ, లాల్ బహుదూర్ శాస్త్రి మరణం, కారణాలపై 1966 ఫిబ్రవరి 16న పార్లమెంటు ఉభయ సభల్లో అప్పటి విదేశాంగ మంత్రి చేసిన ప్రకటనను పొందుపరుస్తూ కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు 2018 సెప్టెంబర్ 24న తన తుది ఆదేశాలను వెలువరించారు.

దీంతోపాటు శాస్త్రి కుటుంబీకులు లేవనెత్తిన అనుమానాలను, ప్రముఖ పాత్రికేయుడు కులదీప్ నయ్యర్ రాసిన పుస్తకంలోని అంశాలను, మరికొన్ని పత్రికల్లోని వ్యాసాలను ఉటంకిస్తూ పలు అంశాలను ప్రస్తావించారు.
ప్రధానమంత్రి లాల్‌ బహదూర్ శాస్త్రి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని కారు కొన్నప్పుడు ఏం జరిగిందంటే..Image copyrightGETTY IMAGESచిత్రం శీర్షికలండన్ పర్యటన సందర్భంగా లాల్ బహుదూర్ శాస్త్రి దంపతులు

శాస్త్రి మరణంపై అనుమానాలు

లాల్ బహుదూర్ శాస్త్రి మరణంపై ఆయన భార్య సహా కుటుంబ సభ్యులు గతంలో అనేకసార్లు అనుమానాలు వ్యక్తంచేశారు.

శాస్త్రితో పాటు తాష్కెంట్ వెళ్లిన ప్రతినిధుల బృందంలో ఉన్న ప్రముఖ జర్నలిస్ట్ కులదీప్ నయ్యర్ రాసిన పుస్తకంలోనూ పలు అనుమానాస్పద అంశాల ప్రస్తావన ఉంది. వీటితో పాటు శాస్త్రి మరణంపై వివిధ మార్గాల్లో సేకరించిన సమాచారాన్ని కేంద్ర సమాచార కమిషన్ ఇటీవల వెల్లడించింది.

అందులో ప్రస్తావించిన కొన్ని ముఖ్యాంశాలు..

* తాష్కెంట్ ఒప్పందం జరిగిన మరుసటి రోజు అంటే 1966 జనవరి 11న వేకువజామున 1.20 గంటలకు(తాష్కెంట్ సమయం) శాస్త్రి అస్వస్థతకు గురయ్యారు. తొలుత ఆయన వ్యక్తిగత వైద్యుడు ఆర్.ఎన్.చుగ్‌ వచ్చి పరిశీలించారు. అప్పటికే శాస్త్రి తీవ్రమైన దగ్గుతో శ్వాస తీసుకోడానికి ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆయన శాస్త్రికి.. మెప్తెటేయిన్ సల్ఫేట్, మిక్రెనా ఇంజక్షన్లను ఇచ్చారు. అనంతరం 3 నిమిషాలకే శాస్త్రి స్పృహ కోల్పోయారు. కొద్దిసేపట్లోనే ఆయన శ్వాస, గుండె కొట్టుకోవడం మందగించాయి.

* సోవియట్ డాక్టర్ ఇ.జి.యెర్మన్కోతో కలిసి కృత్రిమ శ్వాస ఇచ్చేందుకు డాక్టర్ చుగ్ ప్రయత్నించారు. కానీ, అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. శాస్త్రి గుండెపోటు కారణంగా రాత్రి 1.32 గంటలకు మరణించారని వైద్యులు ప్రకటించారు.
'మూగ' ఇందిర 'ఉక్కు మహిళ'గా ఎలా మారారు?Image copyrightGETTY IMAGESచిత్రం శీర్షికకులదీప్ నయ్యర్
కులదీప్ నయ్యర్ ఏం చెప్పారు?

కాగా.. కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు 2018 మే నెలలో కులదీప్ నయ్యర్‌ను కలిసినప్పుడు ఆయన శాస్త్రి మరణానికి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నారు.

''శాస్త్రి మరణించారని తెలియగానే అందరం షాకయ్యాం. మాకు అప్పుడు ఏ అనుమానం రాలేదు. కానీ, భారత్‌కు తిరిగివచ్చాక శాస్త్రి భార్య, బంధువులు కీలకమైన అనుమానాలు వ్యక్తం చేశారు. తాష్కెంట్‌లో శాస్త్రి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలనే ఆలోచన రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయనపై విషప్రయోగం జరిగిందా అనే ప్రశ్నలపై నేనేమీ చెప్పలేను. అయితే, ఆ అనుమానాలు నిరాధారాలు అని కొట్టిపారేయలేం.

శాస్త్రి మృతిపై నిజాలు తేల్చేందుకు ఏర్పాటైన రాజ్ నారాయణ్ కమిటీ ఎదుట సాక్ష్యం చెప్పేందుకు వస్తున్న శాస్త్రి వ్యక్తిగత వైద్యుడు చుగ్, వ్యక్తిగత సహాయకుడు రాంనాథ్ ఇద్దరూ వేర్వేరుగా రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు.

ఈ రెండు నిజంగా రోడ్డు ప్రమాదాలేనా? శాస్త్రిపై విషప్రయోగం జరిగిందా? అదే నిజమైతే ఆ పని చేసిందెవరూ? నేనేమీ చెప్పలేను.. దీనిపై దర్యాప్తు జరగాలని మాత్రం చెప్పగలను'' అన్నారు.

అంతేకాదు.. కమిషన్ ఈ వ్యవహారంలో 2018 మే 13న మధ్యంతర ఆదేశాలు ఇచ్చిన తరువాత ప్రభుత్వ స్పందనలను కులదీప్ నయ్యర్ ఆసక్తిగా చదివారు. శాస్త్రి మరణంపై సమాచార హక్కు దరఖాస్తు రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అయితే, ఆయన్ను మరోసారి కలుసుకుని వివరాలు తెలుసుకోవాలని కమిషన్ అనుకున్నప్పటికీ ఆయన మరణించడంతో అది సాధ్యం కాలేదు.

అయితే, అంతకుముందు ఆయన 'బియాండ్ ద లైన్స్' పేరుతో రాసిన పుస్తకంలో లాల్ బహుదూర్ శాస్త్రి మరణించిన నాటి రాత్రి ఏం జరిగిందో రాశారు.
వాజ్‌పేయి మాటల్ని నెహ్రూ ఎందుకంత శ్రద్ధగా వినేవారు?Image copyrightGETTY IMAGES
'బియాండ్ ద లైన్స్' ఏం చెప్తోంది?

కులదీప్ నయ్యర్ తన 'బియాండ్ ద లైన్స్' పుస్తకంలో అనేక అంశాలను వివరించారు.

''శాస్త్రికి అంతకుముందే రెండుసార్లు గుండెపోటు వచ్చింది. తాష్కెంట్ ఒప్పందం సమయంలో ఆయన చాలా బిజీగా గడిపారు. చాలా తక్కువ సమయం నిద్రపోయారు. ఆ రోజు సాయంత్రం నేను డాక్టర్ చుగ్‌ను కలిశాను. శాస్త్రి ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటున్నారని అడిగాను. అప్పుడు ఆయన ఆకాశంవైపు చూస్తూ అంతా దేవుడి చేతిలోనే ఉంది అని బదులిచ్చారు'' అని కులదీప్ తన పుస్తకంలో ప్రస్తావించారు.

మరణానికి ముందు రోజు రాత్రి శాస్త్రి తనకు కేటాయించిన కాటేజ్‌కు వచ్చారు. తన వ్యక్తిగత సిబ్బందితో మాట్లాడారు.

శాస్త్రి కాటేజ్‌లో వంటగాడికి సహాయంగా ఇద్దరు రష్యన్ మహిళలు ఉండేవారు. వారు ఆ దేశ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందినవారు. శాస్త్రికి ఆహారపదార్థాలు వడ్డించడానికి ముందు వారు వాటిని పరీక్షించేవారు. చివరకు ఆయన తాగే మంచినీటికి కూడా పరీక్షించాకే ఆయనకు ఇచ్చేవారని నయ్యర్ రాసుకొచ్చారు.
‘నేను కేవలం ప్రధానమంత్రిని, ఆమె సంగీత ప్రపంచ మహారాణి’Image copyrightGETTY IMAGES
'ఆయన చనిపోతున్నట్లు కల వచ్చింది'

''ఆ రోజు రాత్రి శాస్త్రి చనిపోతున్నట్లు కల వచ్చింది. నేనున్న గది తలుపుకొట్టినట్లు అనిపించడంతో హఠాత్తుగా లేచాను. కారిడార్‌లో ఒక మహిళ.. 'మీ ప్రధానమంత్రి మృత్యువు ముంగిట ఉన్నారు' అని చెప్పింది. నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా దుస్తులు తొడుక్కుని ఒక భారతీయ అధికారిని వెంట తీసుకుని శాస్త్రి ఉన్న చోటికి వెళ్లాను.

అక్కడ వరండాలో సోవియట్ ప్రధాని అలెక్సీ కోస్జిన్ నిల్చున్నారు. నన్ను చూడగానే.. శాస్త్రి ఇక లేరు అన్నట్లుగా చేతులతో సంజ్ఞ చేశారు. ఆ వెనుక ఉన్న భోజనాల గదిలో కొందరు వైద్యులు శాస్త్రి వ్యక్తిగత వైద్యుడు ఆర్.ఎన్.చుగ్‌ను వివరాలు అడుగుతున్నారు.

ఆ పక్కనే శాస్త్రి గది ఉంది. ఆ విశాలమైన గదిలోని మంచంపై శాస్త్రి అచేతనంగా పడి ఉన్నారు. ఆ పెద్ద మంచంపై శాస్త్రి శరీరం ఒక భారీ డ్రాయింగ్ బోర్డుపై చిన్న చుక్కలా కనిపించింది నాకు. మంచం పక్కనే నేలపై ఆయనపై పాదరక్షల పొందికగా అమర్చినట్లు ఉన్నాయి. ఆయన వాటిని ఉపయోగించిన ఆనవాళ్లేమీ కనిపించలేదు. కానీ, ఆ పక్కనే ఉన్న టేబుల్‌పై మాత్రం థర్మాస్ ప్లాస్క్ పడిపోయి కనిపించింది. ఆయన దాన్ని తెరవడానికి ఎంతో ప్రయత్నించినట్లుగా అనిపించింది. సహాయకులను పిలవడానికి వీలుగా గదిలో బజర్ వంటిదేమీ లేదు.

పక్కనే టేబుల్‌పై శుభ్రంగా మడతపెట్టి ఉన్న భారత జాతీయ పతాకాన్ని మా అధికారిక ఫొటోగ్రాఫర్, నేను కలిసి ఆయనపై కప్పాం. అక్కడున్న పుష్పాలను ఆయనపై ఉంచి నివాళులర్పించాం.

అక్కడి నుంచి నేను శాస్త్రి సహాయకులతో మాట్లాడడానికి వెళ్లాను. అర్ధరాత్రి సమయంలో శాస్త్రి తమ గది తలుపు కొట్టి తాగడానికి నీరు అడిగారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి జగన్నాథ్ సహాయి చెప్పారు. ఆ తరువాత సహాయి, ఇద్దరు స్టెనోగ్రాఫర్లు కలిసి శాస్త్రిని తిరిగి ఆయన గదికి చేర్చినట్లు చెప్పారు.

ఆ తరువాత పక్కనే ఉన్న గదిలో జనరల్ కుమారమంగళం భారత్‌లోని అధికారులకు ఫోన్‌లో(దిల్లీ, తాష్కెంట్ మధ్య ఏర్పాటుచేసిన హాట్‌లైన్లో) సూచనలిస్తున్నారు.. శాస్త్రి మృతదేహం భారత్ చేరుకునేటప్పటికి చేయాల్సిన ఏర్పాట్ల గురించి వారితో చర్చించారు. ఆయన మాట్లాడడం పూర్తయ్యాక నేను రిసీవర్ అందుకుని.. అక్కడి ఆపరేటర్‌కు యూఎన్‌ఐ విలేఖరి నంబర్ ఇచ్చాను.

అప్పటికి అక్కడ సుందర్ ధింగ్రా అనే ఆపరేటర్ విధుల్లో ఉన్నారు. ఆయనకు ఏం చేయాలో చెప్పాను.. 'లాల్‌బహుదూర్ శాస్త్రి మరణించారు' అనే ఫ్లాష్ న్యూస్ పంపించమని చెప్పాను. అప్పటికే అర్ధరాత్రి దాటడంతో వార్తాపత్రికల ముద్రణకు వెళ్లే సమయం దాటిపోయింది. నా మాట వినగానే ధింగ్రా గట్టిగా నవ్వారు.. అంతకుముందు శాస్త్రి పాల్గొన్న కార్యక్రమంలో చేసిన ఉపన్యాసాన్ని ఇంకా అప్పుడే పూర్తిచేశానని చెప్పారు. సమయం వృథా చేయకుండా వెంటనే ఫ్లాష్ న్యూస్ పంపించమని నేను మళ్లీ చెప్పినప్పటికీ ఆయన నమ్మకపోవడంతో కాస్త గట్టిగా చెప్పాను. దాంతో ఆయన నేను చెబుతున్నది నిజమేనని తెలుసుకుని పత్రికా కార్యాలయాలకు ఫోన్లు చేశారు. చాలా పత్రికలు ముద్రణ ఆపి ఈ వార్తను పతాక శీర్షికగా ప్రచురించాయి.

అక్కడి నుంచి పక్కనే వై.బి.చవాన్, స్వరణ్ సింగ్‌లు ఉన్న గదికి వెళ్లాను. అక్కడ వారిద్దరూ శాస్త్రి తరువాత ప్రధాని ఎవరవుతారని చర్చించుకుంటున్నారు. నన్ను చూడగానే నన్నూ అదే ప్రశ్న అడిగారు స్వరణ్ సింగ్. శాస్త్రి బతికున్నప్పుడు తన తరువాత చవాన్ ప్రధాని కావాలనుకున్నారని.. ఆయన మరణిస్తే ఇందిరాగాంధీ ప్రధాని అవుతారని అనుకున్నారని చెప్పాను'' అని రాశారు.
ఈదీ అమీన్: మనిషి రక్తం తాగిన నియంతImage copyrightGETTY IMAGESచిత్రం శీర్షిక1966 జనవరి 10 తాష్కెంట్ ఒప్పందం నాటి చిత్రం: అప్పటి భారత ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్, సోవియట్ ప్రధాని అలెక్సీ కోస్టిన్
గుండెపోటా? విషప్రయోగమా?

అక్కడి నుంచి మళ్లీ శాస్త్రి సహాయకుల గదికి వెళ్లి అసలేం జరిగిందో కనుక్కునే పని ప్రారంభించాను. వారితో మాట్లాడాక తెలిసిందేంటంటే... వీడ్కోలు వేడుకలో పాల్గొన్నాక శాస్త్రి రాత్రి 10 గంటలకు తన గదికి చేరుకున్నారు. జగన్నాథ్ సహాయి, శాస్త్రి సేవకుడు రామ్ నాథ్, మరికొందరు సహాయకులు ఆయనతో వచ్చారు.

పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ తేనీటి విందుకు ఆహ్వానించినట్లు వారికి తెలియడంతో వారు శాస్త్రిని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. పాకిస్తాన్ హాని తలపెట్టే ప్రమాదముందని జాగ్రత్తగా ఉండాలని శాస్త్రికి వారు సూచించారు.

ఇండియా-పాకిస్తాన్ యుద్ధ సమయంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి బల్వంత్‌రాయ్ మెహతా ప్రయాణిస్తున్న ప్రైవేట్ విమానాన్ని పాకిస్తాన్ కూల్చేసిన ఘటనను జగన్నాథ్ సహాయి గుర్తు చేసుకున్నారు.

అయితే, శాస్త్రి వారి ఆందోళనను కొట్టిపారేసి.. అయూబ్ ఖాన్ మంచివారని చెబుతూ రాయబారి టి.ఎన్.కౌల్ ఇంటి నుంచి వచ్చిన భోజనాన్ని తన కోసం తెమ్మని రామ్‌నాథ్‌ను పురమాయించారట. ఆ భోజనాన్ని కౌల్ వంటమనిషి జన్ మొహమ్మద్ తయారుచేశారు. శాస్త్రి చాలా కొంచెమే తిన్నారని.. తింటున్న సమయంలో దిల్లీ నుంచి ఫోన్ వచ్చిందని జగన్నాథ్ చెప్పారు. ఆ ఫోన్ దిల్లీలో ఉన్న శాస్త్రి మరో సహాయకుడు వెంకటరామన్ నుంచి వచ్చింది. తాష్కెంట్ ఒప్పందంపై మంచి స్పందన వచ్చిందని.. కానీ, కుటుంబసభ్యులు మాత్రం సంతోషంగా లేరని చెప్పారాయన. అంతేకాదు... ప్రజా సోషలిస్ట్ పార్టీ నేత సురేంద్ర నాథ్ ద్వివేదీ, జనసంఘ్ నేత అటల్ బిహారీ వాజ్‌పేయిలు కూడా హాజీపూర్, టిత్వాల్ నుంచి సేనలను ఉపసంహరించాలన్న నిర్ణయాన్ని తప్పు పట్టినట్లుగా చెప్పారు. అయితే.. శాస్త్రి దానికి స్పందిస్తూ ఒప్పందాన్ని విమర్శించడమే ప్రతిపక్షాల పని అన్నారట.

ఆ తరువాత జగన్నాథ్.. 'రెండు రోజులుగా మీరు ఇంట్లో వాళ్లతో మాట్లాడలేదు. ఫోన్ కలపమంటారా' అని అడగ్గా తొలుత వద్దని చెప్పిన శాస్త్రి ఆ వెంటనే మనసు మార్చుకుని చేయమని చెప్పారు. అప్పుడు తాష్కెంట్లో సమయం దాదాపు 11 గంటలైంది(దిల్లీలో సుమారు 11.30 గంటలు). మొదట ఆయన అల్లుడు వి.ఎన్.సింగ్ మాట్లాడిన తరువాత శాస్త్రికి ఎంతో ఇష్టమైన పెద్ద కుమార్తె కుసుమ్‌కు(వి.ఎన్.సింగ్‌కు వదిన) ఫోన్ ఇచ్చారు. తాష్కెంట్ ఒప్పందంపై ఆయన ఆమె అభిప్రాయాన్ని కోరగా ఆమె తనకు నచ్చలేదని చెప్పారు. ఆ వెంటనే అమ్మ ఏమంటోంది అని ప్రశ్నించగా.. తనకూ ఇష్టం లేదని చెబుతుంది కుసుమ్. ఆ తరువాత భార్య లలితా శాస్త్రితోనూ ఆయన మాట్లాడారు.

ఆ సంభాషణలు శాస్త్రిని అసంతృప్తికి గురిచేశాయని జగన్నాథ్ సహాయి చెప్పారు. ఫోన్లో మాట్లాడిన తరువాత ఆయన గదిలోనే అటూఇటూ పచార్లు చేశారని.. దిల్లీలో ఇంటికి వచ్చినవారితో మాట్లాడాక కూడా ఆయన ఇలాగే అటూఇటూ నడుస్తారని జగన్నాథ్ చెప్పారు. అప్పటికే రెండు సార్లు హార్ట్ అటాక్‌ వచ్చిన ఆయనపై ఆ సంభాషణ, పత్రికల్లో వస్తున్న విమర్శలు ఒత్తిడికి గురిచేసి ఉండొచ్చు.

అనంతరం రామ్‌నాథ్ పాలు తెచ్చి ఇచ్చారు. తాను అక్కడే నేలపై పడుకుంటానని రామ్‌నాథ్ చెప్పినప్పటికీ వద్దు నీ గదికి వెళ్లి పడుకోమని శాస్త్రి చెప్పడంతో ఆయన పైనున్న తన గదికి వెళ్లిపోయారు.

ఉదయాన్నే కాబూల్ వెళ్లాల్సి ఉండడంతో సామాన్లు సర్దుకుంటుండగా రాత్రి 1.20 గంటల సమయంలో శాస్ర్తి తమ గది తలుపు కొట్టారని జగన్నాథ్ గుర్తు చేసుకున్నారు. రాగానే డాక్టర్ ఎక్కడున్నారని అడిగారని.. తీవ్రమైన దగ్గుతో మెలికలు తిరిగిపోతుండడంతో ఆయన గదికి తీసుకెళ్లి పడుకోబెట్టి మంచి నీళ్లు ఇచ్చినట్లు జగన్నాథ్ చెప్పారు. ఆ వెంటనే శాస్త్రి ఛాతీపై చేయి పెట్టుకుని అచేతన స్థితిలోకి వెళ్లిపోయారని జగన్నాథ్ గుర్తు చేసుకున్నారు.

అంతలో ఆయన వ్యక్తిగత వైద్యుడు చుగ్ వచ్చి శాస్త్రి నాడి పట్టుకుని చూసి 'బాబూజీ! మీరు నాకు ఏమాత్రం సమయం ఇవ్వలేదు' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చేతికి ఒక ఇంజక్షన్ ఇచ్చి ఆ తరువాత ఛాతీకి మరో ఇంజక్షన్ ఇచ్చినా ఎలాంటి స్పందనా లేకపోవడంతో చివరి ప్రయత్నంగా నోటి ద్వారా శ్వాస అందించే ప్రయత్నమూ చేశారు. అవేమీ ఫలితమివ్వకపోవడంతో ఇంకా వైద్యులను పిలిపించాలని జగన్నాథ్‌కు ఆయన సూచించారు. కొద్ది నిమిషాల్లోనే వైద్య బృందం వచ్చి అప్పటికే శాస్త్రి మరణించినట్లు నిర్ధారించింది. తాష్కెంట్ సమయం ప్రకారం 1.32 గంటలకు(దిల్లీ సమయం 2.00 గంటలు) ఆయన మరణించినట్లుగా ప్రకటించారు.
వాజ్‌పేయి: అటల్‌తో పీవీ, కలాం, మోదీ, సోనియా, చంద్రబాబు, జయలలిత, కరుణImage copyrightGETTY IMAGESచిత్రం శీర్షికజుల్ఫికర్ అలీ భుట్టో
'ఇద్దరిలో ఎవరు చనిపోయారు?' భుట్టో వేసిన ఈ ప్రశ్నకు అర్థమేంటి?

వేకువన 4 గంటలకు పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ అయూబ్ ఖాన్ వచ్చి నన్ను చూసి 'భారత్-పాక్ మధ్య శాంతి కోసం ఈ మనిషి ప్రాణాలర్పించారు' అన్నారు. ఆ తరువాత ఆయన పాక్ పాత్రికేయులతో మాట్లాడుతూ.. శాస్త్రి బతికుంటే రెండు దేశాల మధ్య సమస్యలు పరిష్కారమయ్యేవి అని చెప్పారు.

అయితే, పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి అజీజ్ అహ్మద్... అప్పటి విదేశాంగ మంత్రి జుల్ఫికర్ అలీ భుట్టోకు ఫోన్ చేసి శాస్త్రి మరణవార్త చెప్పగా సగం నిద్రలో ఉన్న ఆయన 'చనిపోయారు' అన్నది మాత్రమే విని 'ఇద్దరిలో ఎవరు?' అని ప్రశ్నించారు.

నేను తాష్కెంట్ నుంచి తిరిగొచ్చాక లలితా శాస్త్రి(శాస్త్రి సతీమణి) ఆయన శరీరం ఎందుకు నీలంగా ఉందని నన్నడిగారు. మృతదేహాలకు ఎంబాల్మింగ్ చేశాక నీలం రంగులోకి మారుతాయని అక్కడ చెప్పారని ఆమెతో చెప్పాను నేను. మరి ఒంటిపై ఉన్న ఆ గాయాలేంటని అడిగారామె. మృతదేహాన్ని చూడకపోవడంతో నాకు వాటి సంగతి తెలియదని చెప్పాను.

అంతేకాదు.. శాస్త్రి భౌతిక కాయానికి పోస్టు మార్టం నిర్వహించకపోవడంపైనా కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తంచేశారు. శాస్త్రిది సహజ మరణం కాదని ఆరోపిస్తూ చేసిన ఒక ప్రకటనపై సంతకాలు చేయాలని కోరగా ఆయన ఇద్దరు సహాయకులు అందుకు నిరాకరించడంపైనా లలితా శాస్త్రి ఆగ్రహంతో ఉన్నట్లు అక్కడికి కొద్ది రోజుల తరువాత నాకు తెలిసింది.

కామరాజ్ నాకు ఫోన్ చేసి శాస్త్రి మరణంపై ఎక్కడా మాట్లాడొద్దని సూచిస్తూ ఆయన కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత ఆ కుటుంబం ఉండేందుకు గృహవసతి, జీవనభృతి కల్పిస్తూ తీర్మానించారు.

విషప్రయోగం వల్లే శాస్త్రి మరణించారన్న అనుమానం ఆయన కుటుంబసభ్యుల్లో మరింత బలపడింది. ఆయన వ్యక్తిగత సేవకుడు రామ్‌నాథ్ కాకుండా టి.ఎన్.కౌల్ వంటమనిషి జన్ మొహమ్మద్ ఆ రోజు వంట చేయడంపై వారు అసంతృప్తి, అనుమానంతో ఉన్నారు. 1965లో శాస్త్రి మాస్కోలో పర్యటించినప్పుడూ జన్ మొహమ్మదే వంట చేశారు. కాగా.. శాస్త్రి మరణంపై విచారణ జరిపించాలంటూ 1970లో ఆయన జయంతి రోజున(అక్టోబర్ 2) లలితా శాస్త్రి కోరారు.

అదే నెలలో మొరార్జీ దేశాయిని శాస్త్రిది సహజ మరణం కాదని మీరు నమ్ముతున్నారా అని నేను ప్రశ్నించగా.. ఆయన.. 'అదంతా రాజకీయం. ఇందులో ఎలాంటి కుట్రా లేదు. ఆయన గుండెపోటుతో చనిపోయారు. ఆయన వైద్యుడు, సెక్రటరీతో మాట్లాడి నేను నిర్ధారించుకున్నాను' అని చెప్పారు'' అని కులదీప్ తన పుస్తకంలో ఆ నాటి ఘటనలను రాశారు.
హిందూమతం అంటే ఏమిటి? చరిత్ర ఏం చెప్తోంది?
సంజయ్ గాంధీకి చరిత్ర అన్యాయం చేసిందా?Image copyrightGETTY IMAGES
పోస్ట్‌మార్టం చేయకపోవడంపై..

కులదీప్ నయ్యర్ పుస్తకంలోని అంశాలు, శాస్త్రి కుటుంబ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలతో 2012లో 'అవుట్ లుక్'లో ఒక వ్యాసం ప్రచురితమైంది. అందులో.. శాస్త్రి మృతికి సంబంధించిన వెల్లడించాలని కోరుతూ దాఖలైన సమాచార హక్కు దరఖాస్తును ప్రధానమంత్రి కార్యాలయం తిరస్కరించినట్లుగా పేర్కొన్నారు. శాస్త్రి మృతికి సంబంధించి రెండు దేశాల రాయబార కార్యాలయాల మధ్య జరిగిన సంప్రదింపుల పత్రాలు కోరుతూ అనూజ్ ధర్ అనే వ్యక్తి 2009లో ఈ దరఖాస్తు చేశారు.

శాస్త్రి మరణంపై సమాధానం దొరకని ప్రశ్నలున్నాయంటూ అవుట్‌లుక్ వ్యాసంలో కొన్ని ప్రస్తావించారు. అవి..

* శాస్త్రి మరణం తరువాత ఒక రష్యన్ వంటగాడిని సోవియట్ అధికారులు అరెస్టు చేశారు. అయితే, 5 గంటల పాటు ఆయన్ను ప్రశ్నించి ఆ తరువాత వదిలేశారు.

* విష ప్రయోగం జరిగిందని ప్రాథమికంగా అనుమానాలు ఉన్నప్పటికీ ఆయన మృతదేహానికి తాష్కెంట్‌లో కానీ, భారత్‌లో కానీ పోస్ట్‌మార్టం నిర్వహించలేదు.

* శాస్త్రి కుటుంబసభ్యులు అనేకసార్లు అనుమానాలు వ్యక్తంచేసినా దర్యాప్తు చేయలేదు.

* ఎమర్జెన్సీ తరువాత జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శాస్త్రి మరణంపై దర్యాప్తు కోసం రాజ్‌నాథ్ కమిటీ నియమించారు. కమిటీ నివేదిక ఇవ్వనప్పటికీ దర్యాప్తు ప్రక్రియ ప్రారంభించింది. కానీ, దీనికి సంబంధించి పార్లమెంటు లైబ్రరీలో ఎలాంటి పత్రాలు లేవు.

* ఈ కమిటీ ముందు వివరాలు చెప్పడానికి వస్తుండగానే శాస్త్రి వ్యక్తిగత వైద్యుడు చుగ్ రోడ్డు ప్రమాదంలో మరణించగా... వ్యక్తిగత సహాయకుడు రామ్‌నాథ్ కూడా ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గతం మర్చిపోయారు.(అయితే... కమిటీ ఎదుట హాజరవడానికి వెళ్లడానికి ముందు రామ్‌నాథ్ శాస్త్రి సతీమణిని కలిశారు. ''చాలా రోజులుగా మనసులో ఈ భారమంతా మోస్తున్నాను. ఈ రోజు మొత్తం చెప్పేస్తాను'' అని చెప్పారని కుటుంబీకులు వెల్లడించారు.)
‘ముక్కు నుంచి రక్తం, ఒంటిపై గాయాలు’ - అనిల్ శాస్త్రి

లాల్ బహుదూర్ శాస్త్రి కుమారుడు అనిల్ శాస్త్రి తన తండ్రి మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. తన తండ్రి మృతికి సంబంధించిన రహస్య పత్రాలను బహిర్గతం చేయాలని ఆయన 2015లో ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరారు. సీఎన్ఎన్ ఐబీన్ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్.. తన తండ్రి మృతిపై అనేక అనుమానాలు లేవనెత్తారు.

'నాన్న మృతదేహం దిల్లీ విమానాశ్రయానికి వచ్చినప్పుడు చూస్తే ఆయన శరీరం నీలిరంగులో కనిపించింది. ముఖంపై తెల్లమచ్చలు కనిపించాయి. ఉజ్బెకిస్తాన్‌లో భారత్ ప్రధాని ఉండే రూంలో కాలింగ్‌బెల్ కూడా ఉండదా, ఫోన్ ఉండదా, కనీసం చూసుకునే వారు కూడా ఉండరా? నమ్మశక్యంగా లేదు' అని ఆయన వ్యాఖ్యానించారు.

భారత దౌత్య కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన తండ్రి మరణించారంటూ అనిల్ ఆరోపించారు.

షిప్పింగ్ వ్యాపారి ధరమ్ తేజ్ కుంభకోణం గురించి నాన్నకు తెలుసు. శాస్త్రి చనిపోయన సమయంలో ధరమ్ తేజ్ కూడా తాష్కెంట్‌లోనే ఉన్నారని కుశ్వంత్ సింగ్ కథనం రాశారని ఆయన పేర్కొన్నారు.

తన తాతతో పాటు అమ్మమ్మ కూడా విదేశీ పర్యటనలకు వెళ్లేవారని.. కానీ, రష్యా పర్యటనకు ఆమె వెళ్లలేదని శాస్త్రి మనవడు సంజయ్ అన్నారు.

తాష్కెంట్‌లో హోటల్ బుక్ చేయాలనుకున్నారు. అయితే, ఆయనకు సోవియట్ ప్రభుత్వం ఒక కాటేజ్ కేటాయించింది. అందులో టెలీప్రింటర్, టెలిఫోన్ కూడా లేవు.

మృతదేహం దిల్లీకి వచ్చినప్పుడు చూస్తే ఆయన నోరు, ముక్కు నుంచి రక్తం కారడం కనిపించింది. ఆయన ఒంటిపై గాట్లు ఉన్నాయి. అమ్మమ్మ నెయ్యిలో ఆయన చేతులను ముంచింది. పెదాలకు నెయ్యి పూసింది. అప్పుడు నెయ్యి నీలిరంగులో కనిపించింది. ఆయన వ్యక్తిగత డైరీ, ఆయన రోజువారి కార్యక్రమాలను రాసుకొనే యాక్షన్ ప్లాన్ పుస్తకం కనిపించలేదు అని సంజయ్ తెలిపారు.
దళిత, మైనారిటీలలో పేదరికం వేగంగా తగ్గుతోంది. కానీ...Image copyrightGETTY IMAGESచిత్రం శీర్షికహిట్లర్‌తో సుభాష్ చంద్రబోస్
నేతాజీ అదృశ్యానికి, శాస్త్రి మరణానికి సంబంధం ఉందా?

మరోవైపు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం, శాస్త్రి మరణం మధ్య సంబంధం ఉందంటూ.. దీనికి సంబంధించి పలు ప్రశ్నలు లేవనెత్తుతూ సుప్రీంకోర్టు న్యాయవాది అనూప్ బోస్ 'ట్రాజిక్ డెత్ ఆఫ్ లాల్ బహుదూర్ శాస్త్రి అండ్ ది మిస్టిఫైయింగ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యాంగిల్' పేరుతో రాసిన వ్యాసంలో చర్చించారు. ఈ వ్యాసం 2016 డిసెంబరు 7న లా జెడ్ మ్యాగజీన్‌లో ప్రచురితమైంది.

శాస్త్రి.. నేతాజీకి వీరాభిమాని. ఫజియాబాద్‌లో ఉన్న గుమ్నామీ బాబా సుభాష్ చంద్రబోసేనని వస్తున్న వదంతులపై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. నెహ్రూ చనిపోయినప్పుడు ఆయనకు నివాళి అర్పించేందుకు నేతాజీ వచ్చారని చాలామంది భావిస్తుంటారు.

ప్రముఖ బ్లాగర్ కెప్టెన్ అజిత్ వడాకయిల్ కథనం ప్రకారం.. శాస్త్రికి సమాచారం ఇచ్చాకే నెహ్రూ చివరి చూపులకు నేతాజీ వచ్చారు.
ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?

2015 డిసెంబర్ 12న టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ప్రకారం.. బ్రిటిష్ నిపుణుడు నెయిల్ మిల్లర్ ఒక ఫోరెన్సిక్ ఫేస్ మ్యాపింగ్‌ నివేదికలో తాష్కెంట్ పర్యటన ఫొటోలను పరిశీలించి అందులో ఒక వ్యక్తి సుభాష్ చంద్రబోస్ పోలికలతో ఉన్నట్లు తెలిపారు.

శాస్త్రి తన మరణానికి ముందు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినప్పుడు ఒక ప్రత్యేక వ్యక్తిని కలవబోతున్నట్లు చెప్పారు.

జీ 24 గంట న్యూస్ చానెల్ ఇంటర్వ్యూలో శాస్త్రి కుమారుడు సునీల్ మాట్లాడుతూ, ఒక ప్రత్యేక వ్యక్తిని కలుసుకోబోతున్నానని అప్పుడు నాన్న చెప్పారు. బహుశా ఆయన నేతాజీనే కావొచ్చు? 26 జనవరి 1966న గణతంత్ర దినోత్సవానికి నేతాజీని ముఖ్యఅతిథిగా ఆహ్వానించాలనుకొని ఉండొచ్చు అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.