వాతావరణ మార్పులపై ఇక కార్యాచరణే: మోదీ పిలుపు23-09-2019 2
న్యూయార్క్: వాతావరణ మార్పులపై చర్చలకు ఇక ముగింపు పలికి, చర్యలకు యావత్ ప్రపంచం నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులపై న్యూయార్క్‌లో సోమవారంనాడు జరిగిన యూఎన్ఎస్‌జీ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారతదేశంలో తాము లక్షలాది కుటుంబాలకు శుద్ధమైన వంటగ్యాస్ అందించామని, జల వనరుల అభివృద్ధి, నీటి సంరక్షణ, వర్షపు నీటి ఆధారిత సేద్యం కోసం 'జల్ జీవన్' మిషన్‌ను ప్రారంభించామని చెప్పారు. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేయాలంటూ పిలుపునిచ్చామని, తద్వారా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ స్థాయిలోనూ చైతన్యం వస్తుందని తాము ఆశిస్తున్నామని ఆయన అన్నారు. టన్నుల కొద్దీ మాటలు చెప్పడం కన్నా ఒక ఔన్స్ ఆచరణ మిన్న అని తాను బలంగా నమ్మతానని మోదీ పేర్కొన్నారు.