Labels

సౌదీ చమురుకేంద్రాలపై డ్రోన్ దాడులు: అమెరికా చమురును భూగర్భంలో ఎందుకు దాచిపెడుతోంది?

సౌదీ అరేబియాలోని కీలకమైన చమురు నిల్వలపై దాడుల నేపథ్యంలో, అమెరికా అధికారులు తమ దేశంలో నిల్వచేసిన అత్యవసర చమురు నిల్వల గురించి చర్చించుకుంటున్నారు.


చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో ''మార్కెట్‌లో సరఫరాకు ఈ చమురును ఉపయోగించవచ్చు'' అని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు.

టెక్సాస్, లూసియానా రాష్ట్రాలలోని ఉప్పు గుహలలో నిల్వ చేసిన 640 మిలియన్ బారెల్స్ కంటే ఎక్కువ మొత్తంలో ఉన్న నిల్వల గురించి ట్రంప్ ప్రస్తావిస్తూ ఈ ట్వీట్ చేశారు.

అయితే, అమెరికాకు ఈ ''వ్యూహాత్మక నిల్వలను'' కలిగి ఉండాలనే ఆలోచన 1970లలో వచ్చింది.

ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీలోని సభ్య దేశాలు 90 రోజులకు సరిపడా అత్యవసర పెట్రోలియం దిగుమతులు నిల్వ ఉంచుకోవచ్చు. కానీ, అమెరికా ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో అత్యవసర నిల్వలు కలిగి ఉంది.


Image copyrightGETTY IMAGESచిత్రం శీర్షిక1973‌లో అరబ్ దేశాలు-ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధంలో అమెరికా.. ఇజ్రాయెల్‌కు మద్దతిచ్చింది. దీంతో పెట్రోలియం ఎగుమతి దేశాలు ఇరాక్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియాలు అమెరికాకు చమురు ఎగుమతి చేయడానికి నిరాకరించాయి.

ఎందుకు ఈ నిల్వలు ఉంచారు?

1970లలో చమురు సరఫరాపై మధ్యప్రాచ్య దేశాలు ఆంక్షలు విధించాక ప్రపంచవ్యాప్తంగా ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో అమెరికా రాజకీయ నాయకులు చమురును నిల్వ చేయాలనే ఆలోచనకు వచ్చారు.

1973‌లో అరబ్ దేశాలు-ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతిచ్చింది. దీంతో పెట్రోలియం ఎగుమతి దేశాలు ఇరాక్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియాలు అమెరికాకు చమురు ఎగుమతి చేయడానికి నిరాకరించాయి.

యుద్ధం మూడు వారాలు మాత్రమే కొనసాగింది. కానీ, ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకున్న అరబ్ దేశాలు 1974 మార్చి వరకు ఈ ఆంక్షలు కొనసాగించాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ధరలు నాలుగు రెట్లు పెరిగి బ్యారెల్ దాదాపు 12 డాలర్లకు చేరింది.

ప్రభావిత దేశాలలో పెట్రోల్ పంపుల వద్ద బారులు తీరిన కార్లను చూస్తే సంక్షోభం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.

చమురు సరఫరా సమస్య వచ్చినప్పుడు వ్యూహాత్మకంగా పెట్రోలియం రిజర్వ్‌ను ఏర్పాటు చేసేలా అమెరికా కాంగ్రెస్ 1975లో ఎనర్జీ పాలసీ అండ్ కన్జర్వేషన్ యాక్ట్‌ను ఆమోదించింది.


నిల్వలు ఎక్కడున్నాయి?

ప్రస్తుతం, అమెరికాలో నాలుగు చోట్ల చమురు నిల్వ చేస్తున్నారు. అవి టెక్సాస్‌లోని ఫ్రీపోర్ట్, విన్నీ సమీపంలో, లూసియానాలోని చార్లెస్ సరస్సు, బాటన్ రూజ్ వెలుపల.

ప్రతి ప్రాంతంలో చమురు నిల్వ చేసేందుకు వీలుగా భూగర్భంలో ఒక కిలోమీటర్ (3,300 అడుగుల) వరకు అనేక మానవ నిర్మిత ఉప్పు గుహలు ఏర్పాటు చేశారు.

భూమిపై ట్యాంకులలో నిల్వ చేయడంకంటే ఇలా చేయడం వల్ల ఖర్చు బాగా తగ్గుతుంది. సురక్షితంగా కూడా ఉంటుంది. ఉప్పు వల్ల భౌగోళిక పీడన ప్రభావంతో చమురు బయటకు రాకుండా నిరోధించవచ్చు.

ఫ్రీపోర్ట్ సమీపంలోని బ్రయాన్ మౌండ్ వద్ద అతిపెద్ద స్థలంలో 254 మిలియన్ బారెల్స్ చమురును నిల్వ చేసేందుకు వీలుంది.

ఈ గుహలలో సెప్టెంబర్ 13న 644.8 మిలియన్ బారెల్స్ చమురు ఉన్నట్లు రిజర్వ్ వెబ్‌సైట్ తెలిపింది. యూఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, అమెరికన్లు 2018లో సగటున రోజుకు 20.5 మిలియన్ బారెల్స్ పెట్రోలియంను వినియోగించారు. అంటే సుమారు 31 రోజుల పాటు దేశ అవసరాలకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని అర్థం.


ఇది ఎలా పని చేస్తుంది?

జెరాల్డ్ ఫోర్డ్ సంతకం చేసిన 1975 చట్టం ప్రకారం, ''తీవ్రమైన ఇంధన సరఫరా అంతరాయం'' ఉంటే చమురు నిల్వలను విడుదల చేయడానికి అధ్యక్షుడికి అధికారం ఉంటుంది.

కానీ, ప్రతిరోజూ గుహల నుంచి కొద్ది మొత్తంలో చమురును మాత్రమే తరలించవచ్చు. చమురును విడుదల చేయడానికి అధ్యక్షుడికి అధికారం ఉన్నప్పటికీ మార్కెట్లలోకి చమురు రావడానికి దాదాపు రెండు వారాలు పడుతుంది.

అంతేకాక, ఇలా విడుదల చేసిన చమురు శుద్ధి చేసినదికాదు. కార్లు, ఓడలు, విమానాలకు ఉపయోగపడే ముందు ఈ చమురును ఇంధనంగా మార్చే ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది.

సౌదీ అరేబియాలో దాడుల నేపథ్యంలో తమ నిల్వల గురించి మాట్లాడటం తొందరపాటు చర్య అవుతుందని అమెరికా ఇంధన కార్యదర్శి రిక్ పెర్రీ సెప్టెంబర్ 16న సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.


ఈ నిల్వలను ఉపయోగించారా?

2011లో చివరిసారిగా ఈ 'అత్యవసర నిల్వ చుమురు'ను అమ్మారు. అరబ్ విప్లవం నేపథ్యంలో చమురు సరఫరా దేశాల నుంచి ఇంధన సరఫరాకు అంతరాయం కలగడంతో అమెరికా తన దగ్గర ఉన్న 60 మిలియన్ బారెల్స్ చమురును విడుదల చేసింది.

అయితే, కొన్ని సందర్భాల్లో అమెరికా పెద్ద సంఖ్యలో చమురును విక్రయించింది. సీనియర్ బుష్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 1991 గల్ఫ్ యుద్ధం సమయంలో నిల్వ చేసిన చుమురును ఉపయోగించటానికి అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత జూనియర్ బుష్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కత్రినా తుపాన్ నేపథ్యంలో 11 మిలియన్ బారెల్స్ చమురును అమ్మేందుకు అనుమతించారు.

అయితే, అమెరికాలో ఇంధన ఉత్పత్తి పెరుగుతున్న సమయంలో ఇంత భారీ స్థాయిలో చమురును నిల్వ చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటనే ప్రశ్నలు తలెత్తాయి.

అధ్యక్షుడు బిల్ క్లింటన్ హయాంలో ఆర్థిక లోటును తగ్గించే చర్యల్లో భాగంగా 1997లో 28 మిలియన్ బారెల్స్ చమురును అమ్మేశారు.