Labels

భారత్, అమెరికా ప్రజలను తీవ్రవాదుల నుంచి కాపాడుకుంటాం "

అమెరికాలోని హూస్టన్‌లో నిర్వహిస్తున్న 'హౌడీ మోదీ' కార్యక్రమం ప్రారంభమైంది. ఎన్‌ఆర్‌జీ స్టేడియంకు చేరుకున్న భారత ప్రధాని మోదీకి నిర్వాహకులు, టెక్సస్ ప్రభుత్వ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.


కొద్దిసేపటి కిందట అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా సభా వేదిక వద్దకు చేరుకున్నారు.

సభనుద్దేశించిన మాట్లాడిన మోదీ ‘‘మిస్టర్ ట్రంప్ మీరు 2017లో మీ కుటుంబాన్ని నాకు పరిచయం చేశారు. ఇప్పుడు నేను నా కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తున్నాను’’ అనగానే సభకు హాజరైనవారంతా పెద్ద పెట్టున చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.

ఈ సభతో భారత్, అమెరికాల మైత్రి శిఖర స్థాయికి చేరిందని మోదీ అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మళ్లీ గెలవడం ఖాయమని ఆయన అన్నారు.

రాబోయే రోజుల్లో రెండు దేశాల మధ్య స్నేహం మరింత బలపడుతుందని, ట్రంప్‌ను కలిసిన ప్రతిసారీ తనకు స్నేహ హస్తాన్ని అందించారని మోదీ అన్నారు.

మోదీ పిలిస్తే ముంబయి వస్తాను: ట్రంప్

ట్రంప్ మాట్లాడుతూ తనను ఈ సభకు పిలిచినందుకు సంతోషంగా ఉందని, ఈ చరిత్రాత్మక సభకు రావడం తన అదృష్టమన్నారు.

మోదీ నాయకత్వంలో భారత్‌లో 30 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చారని.. అది అపూర్వమని ట్రంప్ అన్నారు.

‘‘అమెరికా, భారత్ స్నేహ బంధానికి ఈ సమావేశం నిదర్శనం, దీనికి 50 వేలమంది హాజరుకావడం స్ఫూర్తిదాయకం’’ అన్నారాయన.

వచ్చే నెలలో భారత్‌లోని ముంబయిలో మొట్టమొదటి ఎన్‌బీఏ బాస్కెట్ బాల్ మ్యాచ్ జరగబోతోందని.. మోదీ ఆహ్వానిస్తే తాను వచ్చే అవకాశముందన్నారు.

అమెరికా అభివృద్ధిలో భారతీయుల పాత్ర కీలకమని ప్రస్తుతించారు. భారత్, అమెరికా పౌరులను ’ఉగ్రవాదం’ నుంచి కాపాడుకుంటామని ట్రంప్ చెప్పారు.

అంతకుముందు.. ఈ కార్యక్రమంలో మిత్రుడు మోదీతో పాటు వేదికను పంచుకోనున్నానని ట్రంప్ ట్వీట్ చేయగా.. మోదీ దానికి స్పందనగా, మీ రాక కోసం ఎదురుచూస్తున్నానంటూ ట్వీట్ చేశారు