Labels

తెలుగు ఇంజనీర్‌పై పాకిస్థాన్‌ కుట్ర.. అల్‌ కాయిదాకు నిధులిస్తున్నాడని ఆరోపణ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా అంతర్జాతీయ వేదికపై భారత్‌ను అప్రతిష్ఠ పాలు చేయడానికి పాక్‌ కుట్ర పన్నింది. కుల్‌భూషణ్‌ జాధవ్‌ తరహాలోనే మరో వ్యక్తిని ఉగ్రవాదిగా చిత్రించే ప్రయత్నం చేసింది. అఫ్గానిస్థాన్‌లో ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్న తెలుగు ఇంజనీర్‌ వేణుమాధవ్‌ అల్‌ కాయిదాకు నిధులు ఇస్తున్నాడని ఆరోపించింది. 2015లో పెషావర్‌ ఎయిర్‌‌బేస్‌పై జరిగిన ఉగ్రదాడిలో అతని ప్రమేయం ఉందని పేర్కొంది. దీనికోసం తప్పుడు సాక్ష్యాలు, ఫొటోలు సృష్టించింది.  కుల్‌భూషణ్‌ను ఇరాన్‌లో పట్టుకొన్నట్లుగానే.. వేణుమాధవ్‌ను అరెస్టు చేసి అంతర్జాతీయ సమాజం ముందు ఉగ్రవాదిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. వేణుమాధవ్‌ తారిక్‌ గిదార్‌ ఉగ్రసంస్థకు ఆయుధాలు సమకూర్చాడని మార్చి 11న అతనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. అంతర్జాతీయ భద్రతా మండలి 1267 ఆంక్షల కమిటీలో అతని పేరును చైనా సహాయంతో లిస్టింగ్‌ కూడా చేసింది.అయితే పాక్‌ కుట్రను భారత్‌ అధికారులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. భారత భద్ర తా దళాలు వేణుమాధవ్‌ను సెప్టెంబరు 7నే ఇండియాకు రప్పించాయి.