Labels

ఏపీకి కొత్త ఓడరేవులు..

Thu Sep 26 2019


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా రెండు ఓడరేవులను ఏర్పాటు చేయాలని ఏపీ ఐటీ - పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి మాన్ సుఖ్ మాండవియాను కోరారు. భారతదేశంలో అత్యధిక సముద్ర తీరం ఉన్న రాష్ట్రంలో ఏపీ ఒకటి. ఏపీకి 972 కిలోమీటర్ల సుదీర్ఘమైన తీరరేఖ ఉంది. గుజరాత్ 1061 కిలోమీటర్ల తర్వాత దేశంలో ఎక్కువ తీరరేఖ ఉన్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. ఏపీకి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న సముద్రతీరం ఇప్పుడు ఓ అంతర్జాతీయ సరుకు రవాణాకు ముఖ్యమైన కేంద్రంగా విరాజిల్లుతుంది.

అయితే సరుకు రవాణాకు ఓడల ద్వారా ఖర్చు తక్కువ అవుతోంది. విమాన రవాణా - రైల్ రవాణాతో ఖర్చు అధికంగా అవుతుంది. అదే ఓడరేవులతో ఖర్చు తక్కువ అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇంత పెద్ద సముద్ర తీరం ఉన్న ఏపీకి మరో రెండు మూడు ఓడరేవులు వస్తే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని ఏపీ సర్కారు అభిప్రాయపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు - అందాల్సిన సహకారంపై కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి మాన్ సుఖ్ మాండవియాను ఏపీ పరిశ్రమలు - ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి బుధవారం కలిశారు.

ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రతిపాదనలతో కూడిన వినతి పత్రాన్ని కేంద్ర మంత్రికి గౌతంరెడ్డి అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఏపీలోని దుగరాజ పట్నం పోర్టును జాతీయ పోర్టుగా గుర్తించి ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల దృష్ట్యా ముందుకు సాగలేదు. దీంతో దుగరాజపట్నం పోర్టును జాతీయ పోర్టుగా చేయనందున - ప్రత్యామ్నాయంగా రామాయపట్నం - మచిలీపట్నం వంటి ప్రాంతాల్లో కొత్త ఓడరేవులను ఏర్పాటు చేయాలని మాండవియాకి గౌతం రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ రెండు ఓడరేవులు కేంద్రం ఏర్పాటు చేస్తే ఏపీ అభివృద్ధికి బాటలు పడుతాయని గౌతం రెడ్డి అన్నారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే ఏపీ సముద్ర రవాణాలో మరింత ముందుకు దూసుకు వెళ్లడం ఖాయం.