Labels

నీకు వీళ్లెక్కడ దొరికారు.. ఇమ్రాన్‌?

24 Sep, 2019  న్యూయార్క్‌ : కశ్మీర్‌ అంశంపై తనను ప్రశ్నించిన రిపోర్టర్‌పై అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్‌ ట్రంప్‌ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. మీరు ప్రశ్న అడుగుతున్నారో లేదా స్టేట్‌మెంట్‌ ఇస్తున్నారో అర్థం కావడం లేదంటూ రిపోర్టర్‌ను ఎదురు ప్రశ్నించారు. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సెషన్‌లో భాగంగా పాకిస్తాన్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తో ట్రంప్‌ సోమవారం భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇరువురూ కలిసి మీడియా సమావేశంలో పలు విషయాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో ఓ విలేకరి...‘కశ్మీర్‌ అంశంలో పాకిస్తాన్‌ శాంతిదూతలా వ్యవహరిస్తుంటే..భారత్‌ దూకుడు ప్రదర్శిస్తూ హింసను రెచ్చగొడుతుంది కదా’ అంటూ ఓ సుదీర్ఘ ప్రశ్నను ట్రంప్‌ ముందుంచారు. ఈ నేపథ్యంలో అసహనానికి గురైన ట్రంప్‌...‘ నువ్వు ఇమ్రాన్‌ బృందానికి చెందినవాడివా? నీ ఆలోచనల గురించి నువ్వు ఇక్కడ చెబుతున్నావు. నిజానికి నువ్వు ప్రశ్న అడిగినట్లు లేదు. నీ అభిప్రాయాన్ని ఇతరులపై రుద్దేలా ప్రవర్తించినట్లు ఉంది’ అని కౌంటర్‌ ఇచ్చారు. అదే విధంగా..‘మీకు అసలు ఇలాంటి రిపోర్టర్లు ఎక్కడ దొరుకుతారు. నిజంగా వీళ్లు చాలా అద్భుతంగా వ్యవహరిస్తున్నారు’ అంటూ తన పక్కన కూర్చున్న ఇమ్రాన్‌ ఖాన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ‘హౌడీ మోదీ’ కార్యక్రమంపై ఇమ్రాన్‌ ఖాన్‌ సమక్షంలోనే ట్రంప్‌ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. అంతేగాకుండా కశ్మీర్‌ అంశంపై తాను మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ట్రంప్‌ మరోసారి ప్రకటన చేశారు. తనకు భారత్‌-పాక్‌ ప్రధానులతో మంచి అనుబంధం ఉందని...కశ్మీర్‌ అంశంపై ఇరు దేశాధినేతలు తన సహాయం కోరితే తప్పక మధ్యవర్తిగా వ్యవహరిస్తానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా... అమెరికాలో 9/11ఉగ్ర దాడుల అనంతరం ఉగ్రవాదంపై పోరులో అమెరికాతో కలసి సాగడం పాకిస్తాన్‌ చేసిన అతిపెద్ద పొరపాటని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యానించారు. అది గత ప్రభుత్వాలు చేసిన తప్పన్నారు. కశ్మీర్లో కర్ఫ్యూ ఎత్తేయాల్సిందిగా భారత్‌పై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి చేయాలని ‘కౌన్సిల్‌ ఆన్‌ ఫారిన్‌ రిలేషన్స్‌’ కార్యక్రమంలో ఇమ్రాన్‌ మేధావులను కోరారు. ఆర్టికల్‌ 370 రద్దుతో ఐరాస తీర్మానాన్ని, సిమ్లా ఒప్పందాన్ని భారత్‌ ఉల్లంఘించిందని ఆరోపించారు.