Labels

బొత్స సత్యనారాయణ వర్సెస్ కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతి చోటా చెక్?


హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెసు పార్టీ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వర్సెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతి చోటా బొత్స సత్యనారాయణ కిరణ్ కుమార్ రెడ్డికి చెక్ పెట్టే పరిస్థితిని కావాలనే కాంగ్రెసు అధిష్టానం కల్పించిందని అంటున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో బిసీలకు అన్యాయం జరిగిందని సహచర మంత్రులను కూడగట్టిన బొత్స సత్యనారాయణ తన చుట్టూ బిసిలను కూడగట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే బొత్స సత్యనారాయణకు ఓ లాబీ ఏర్పడిందని కూడా చెబుతున్నారు. పిసిసి అధ్యక్ష పదవిని చేపట్టినప్పటికీ బొత్స సత్యనారాయణ మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశాలు లేవని అంటున్నారు. ఈ విషయంపై పార్టీ అధిష్టానం ఆదేశాలను పాటిస్తానని ఆయన చెప్పారు.
మంత్రి వర్గ సమావేశాల్లో పిసిసి అధ్యక్షుడిగా, మంత్రిగా బొత్స సత్యనారాయణ గొంతు పెంచే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇప్పటికే వైయస్ జగన్ వెంట వెళ్తున్న శాసనసభ్యుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని బొత్స సత్యనారాయణ బలంగానే చెప్పారు. బొత్స దూకుడును దృష్టిలో పెట్టుకునే కిరణ్ కుమార్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా సభలో వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. తమ పార్టీ నుంచి వెళ్లిపోవాలని, వారి అవసరం తమకు లేదని ఆయన హెచ్చరించారు. బొత్స సత్యనారాయణ ఆధిపత్యం వహిస్తారనే ఉద్దేశంతోనే కిరణ్ కుమార్ రెడ్డి అంతటి ఘాటు వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఇరువురి మధ్య ఆధిపత్య పోరు కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
కాంగ్రెసు పార్టీ రెడ్లపై ఆధారపడి ఉందనే అభిప్రాయం బలంగా ఉంది. ఇప్పుడు రెడ్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ స్థితిలో బిసీలను తమ వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉందని చెబుతున్నారు. ఇందులో భాగంగానే బొత్స సత్యనారాయణకు పిసిసి పదవి అప్పగించినట్లు చెబుతున్నారు. కాపు సామాజిక వర్గం బిసిల్లో ఆధిపత్య వర్గంగా కొనసాగుతోంది. ఈ వర్గానికి చెందిన బొత్స సత్యనారాయణ బీసీలను కూడగట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తారని అంటున్నారు. ఏమైనా, రాష్ట్ర కాంగ్రెసు రాజకీయాలు అనతి కాలంలోనే ఆసక్తికరమైన మలుపు తీసుకోవచ్చునని అంటున్నారు.

No comments:

Post a Comment