Labels

జగన్ అనుకూల మంత్రులపై వేటు, ఈ నెల 16 మంత్రివర్గ ప్రక్షాళన?

ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అనుకూల మంత్రులపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వైయస్ జగన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న మంత్రులను మంత్రివర్గం నుంచి తప్పించడానికి తగిన ప్రణాళిక సిద్దమైనట్లు చెబుతున్నారు. దీనికి గాను ఈ నెల 16వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ నెల 12, 13 తేదీల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి, మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు ఆమోద ముద్ర వేయించుకుంటారని చెబుతున్నారు. మంత్రి వర్గం నుంచి తొలగించేవారి జాబితాను, కొత్తగా తీసుకునేవారి జాబితాను కూడా పార్టీ అధిష్టానానికి సమర్పించి ఆమోదం పొందుతారని అంటున్నారు.
దామోదర రాజనర్సింహను ఉప ముఖ్యమంత్రిగా నియమంచారు. ఇది జరిగిన తర్వాత మంత్రి వర్గ ప్రక్షాళనకు ఎక్కువ సమయం తీసుకోకూడదని, మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ ద్వారా మంత్రులపై పట్టు సాధించాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. ప్రజారాజ్యం పార్టీకి కూడా మంత్రివర్గంలో చోటు కల్పిస్తారు. ఉప ముఖ్యమంత్రిగా నియమితులై దామోదర రాజనర్సింహకు హోం శాఖను అప్పగించే అవకాశాలున్నాయి. ఈ శాఖ ప్రస్తుతం దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తన చెల్లెలుగా భావించిన సబితా ఇంద్రా రెడ్డి వద్ద ఉంది. ప్రజారాజ్యం పార్టీ నుంచి గంటా శ్రీనివాస రావు, బండారు సత్యనారాయణ, వంగా గీత, సి. రామచంద్రయ్యల్లో ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కాంగ్రెసు సీనియర్ నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోమటి రెడ్డి వెంకటరెడ్డి వైయస్ జగన్ కోవర్టు అని ఆరోపించారు. ఇటువంటి మంత్రులకు ఉద్వాసన పలకాలనే ఉద్దేశంతో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. తనదైన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకునే యోచనలో ఆయన ఉన్నారు. పిసిసి అధ్యక్షుడిగా నియమితులైన బొత్స సత్యనారాయణ మంత్రిగా కొనసాగుతారా, లేదా అనేది కూడా ఈ సమయంలో తేలే అవకాశం ఉంది.

No comments:

Post a Comment