Labels

మన మార్కెట్‌పై హాలీవుడ్ కన్ను!

న తెలుగు హీరోలంతా తమిళంలోను, మళయాళంలోను మార్కెట్ సంపాదించి ఎదగాలని ఉత్సాహపడుతున్నట్టే ప్రపంచ సినిమాకు పెద్దన్నలాంటి హాలీవుడ్‌కు కూడా ఆసియన్ కంట్రీస్‌లో ముఖ్యంగా ఇండియాలో మార్కెట్‌ను విస్తరించాలన్న ఆశ మొదలైంది. అందుకు తగినట్లుగా పావులు కదిపి ఇక్కడి మార్కెట్టును కబళించేందుకు విశ్వప్రయత్నం ప్రారంభించింది. ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్ స్టుడియో రూపొందించిన ‘అవతార్’ ఘనవిజయంతో కళ్లు తిరిగే కలెక్షన్లతో వారికి ఇక్కడి మార్కెట్‌పై ఆసక్తి కలిగింది. అమెరికా, కెనడా మార్కెట్లను కలిపి డబుల్ చేస్తే వచ్చే మార్కెట్ ఇక్కడుందని వారు అంచనా వేస్తున్నారు. వారు తమ మార్కెట్‌ను 2013 నాటికి ఇక్కడ 130 బిలియన్స్‌కు పెంచాలని ప్లాన్ చేసుకున్నట్టు వెల్లడిస్తున్నారు.

వాస్తవానికి ఇప్పుడు హాలీవుడ్ శరవేగంగా తన రూపం మార్చేసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వివిధ దేశాల ఆచార వ్యవహారాలను నటీనటులను, కథలను, హాస్యాన్ని వంటబట్టించుకుని వండి వడ్డించే ప్రయత్నం చేయబోతోంది. దాంతో ఇన్నాళ్లుగా మనకు మనమే పోటీ అనుకుంటున్న మన సినిమాకు హాలీవుడ్ పెద్ద పోటీనే ఇవ్వబోతోంది. ఈ వేసవిలో హాలీవుడ్ పైరేట్స్ (సముద్రపు దొంగలు), రోబోట్స్ అన్ని చోట్లా వీరవిహారం చేయడానికి సిద్ధపడుతున్నాయి. యానిమేషన్ సినిమాలకు అయితే లోకల్‌గా ఉండే స్టార్స్ చేత డబ్బింగ్ చెప్పి ఆకట్టుకునే ప్రయత్నం చేయబోతున్నారు.
ఈ విషయమై ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్ ఇంటర్నేషనల్ సంస్థ కో-ప్రెసిడెంట్ తామోస్ మాట్లాడుతూ...మా దగ్గర ఉన్న అమెరిక చుట్టూ తిరిగే కథలను, ముఖ్యంగా యాక్షన్, సైన్స్ ఫిక్షన్‌లతో తయారయ్యే స్టోరీ లైన్స్‌ను యూనివర్సల్‌గా ప్రపంచంలో ఎక్కడైనా జరిగే కథలుగా మార్చమని ఇప్పటికే మా రైటర్స్‌కు చెప్పడం జరిగింది. గ్లోబుల్‌గా మా కథలు ఉండాలన్నదే మా సంస్థ నినాదంగా మార్చాం అని స్పష్టం చేస్తున్నారు.
అందుకు ఉదాహరణగా ఈ మధ్య విడుదలైన ఫాస్ట్ ఫైవ్ చిత్రాన్ని చూపెడుతున్నారు. అందులో నటించిన నటీనటులను కేవలం అమెరికాకు చెందినవారినే కాకుండా మిగతా చోట్లనుంచి కూడా తీసుకున్నాం. అలాగే కథని బ్రెజిల్‌లో జరిగేట్లుగా ప్లాన్ చేసాం. బ్రెజల్‌ని టార్గెట్ చేయడంతో అక్కడినుంచి రెవెన్యూ వచ్చింది అంటున్నారు. అలాగే పైరసీని అరికట్టడానికి కూడా అన్ని దేశాల్లోను ఒకేసారి విడుదల చేయాల్సిన పరిస్థితి. కథ కానీ, నటీనటులు కానీ ఏమైనా కానీ తమ ప్రాంతానికి చెందినవి లేకపోతే థియేటర్‌కి ప్రేక్షకుడు డబ్బు చెల్లించి ఎందుకు వస్తాడు? ఏ డౌన్‌లోడ్స్‌నుంచో లేకపోతే పైరసీ సీడీలలో చూస్తాడు. అప్పుడు బాగా లాస్ కదా. అందుకే వారు చూడాలి. మాకు డబ్బులు రావాలనే ఈ గ్లోబలైజేషన్ స్కీమ్‌లోకి వచ్చాం అని స్పష్టంగా పేర్కొంటున్నారు. అయినా ఇప్పుడు సినిమా అనేది గ్లోబల్ బిజినెస్. ఇంకొంత కాలం అలవాటు పడితే హీరోలు ఎక్కడివారు ఏ ప్రాంతంలో జరుగుతుందనేది పట్టించుకోరు. అప్పటివరకు మమ్మల్ని మేము అలవాటు చేసుకుంటూ మార్కెట్ చేసుకోవాలి అంటున్నారు హాలీవుడ్ ట్రేడ్ విశే్లషకుడు పౌల్. ఆ రకంగా ప్లాన్ చేసి రూపొందించిన పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్...ఆన్‌స్టేంజర్ టైడ్స్, ఎక్స్‌మెన్....్ఫస్ట్‌క్లాస్ చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. ఏ రేంజి కలెక్షన్స్ వస్తాయో చూడండి అంటున్నారు.
ఈ విషయాన్ని మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ ఆసియా పసిఫిక్ ప్రాంతాల అధ్యక్షుడు మైక్ ఎలీస్ చెబుతూ అమెరికాలో స్ట్రగుల్ పడుతూ మార్కెట్‌ను పెంచుకోవడం కన్నా, ఇలా ఇతర దేశాల్లో రెవెన్యూ ఎంచుకోవడం సుఖం అని హాలీవుడ్ స్టుడియోలు గుర్తించాయి. దాదాపు ప్రతీ హాలీవుడ్ స్టూడియో ఇప్పుడు ఇండియాలో తమ ఆఫీస్ తెరుస్తోంది. వాళ్లు డెఫినిట్‌గా ఇండియన్ మార్కెట్‌ను ఆక్రమిస్తారు అంటున్నాడు. తమ చిత్రాలు సంవత్సరానికి దాదాపు 1,325 ఇండియన్ భాషల్లోకి డబ్బింగ్ అవుతున్నాయని తెలుసుకుని తమ మార్కెట్‌ని వారు స్వయంగా గుర్తించారు. అలాగే ఇక్కడ మార్కెట్‌పై దృష్టిపెట్టడానికి ముఖ్య కారణం అమెరికా, కెనడా వంటి రెగ్యులర్‌గా విడుదలయ్యే దేశాల్లో కొత్త ప్రేక్షకులు పెరగడంలేదని, స్టాగినేషన్ వచ్చిందని అందుకే తమ మనుగడకోసం కొత్త ప్రాంతాలకు వలస రావడం జరుగుతోందని చెబుతున్నారు. అయితే ఇది వలసా..దాడా అన్నది అర్ధం కాని విషయం. దీనికి తోడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు చైనా, ఇండియా కావడంతో వాటిపై వారి దృష్టి పడింది.
చైనా గవర్నమెంట్ సంవత్సరానికి ఇరవై మాత్రమే ఇంపోర్టెడ్ సినిమాలను తమ దేశంలోకి రానివ్వాలని నిర్ణయించుకుని ఈ హాలీవుడ్ ప్రవాహానికి అడ్డుకట్ట వేసింది. ఈ పరిమాణంతో ఇండియానే హాలీవుడ్‌కు పెద్ద దిక్కయింది. ఇక్కడ సరళీకృత ఆర్ధిక విధానాలు హాలీవుడ్ వలసలకు ఆహ్వానం పలుకుతున్నాయి. క్రితం సంవత్సరం (మార్చి 31 వరకు) గవర్నమెంట్ వారి అధికారిక లెక్కల ప్రకారం అరవై ఫారిన్ సినిమాలు ఇక్కడ విడుదల కాగా అవి 3.8 బిలియన్ రాబడి సంపాదించుకున్నాయి. మరోపక్క ఫాక్స్ స్టూడియో ఈ సంవత్సరంలో మినిమం ఆరు భాషల్లో అయినా సినిమాలు ప్లాన్ చేస్తోందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయ్‌సింగ్ చెబుతున్నారు. దీనికి తోడు ఇండియాలో యావరేజ్ టికెట్ రేటు అమెరికాతో పోలిస్తే బాగా తక్కువని ఇక్కడ మిడిల్ క్లాస్ ఖర్చు పెట్టే డిస్పోబల్ ఇన్‌కమ్ బాగా ఎక్కువని లెక్కలు వేసుకుని మరీ రంగంలోకి దిగుతున్నారు. అంతేకాక మల్టీప్లెక్స్‌లు కూడా బాగా వేగంగా పెరుగుతున్నాయని, 1997లో మొదటి మల్టీప్లెక్స్ ఢిల్లీలో కడితే ఈరోజు ఇండియాలో ఎనిమిది వందలకు పైగా ఉన్నాయని, అంటే మల్టీప్లెక్స్‌ల వృద్ధి రేటు ఏరేంజిలో ఉందో ఊహించుకోవచ్చునని, అదే హాలీవుడ్ స్టూడియోల లెక్కల్లో ప్రధమంగా నిలుస్తోందని విశే్లషిస్తున్నారు. అలాగని ఇక్కడ లోకల్‌గా ఉండే నిర్మాతలకు చేయూతనివ్వమని స్పష్టంగా చెబుతున్నారు. తాము కేవలం ఫిల్మ్‌మేకర్స్‌మేనని, ఇనె్వస్టిమెంట్ బ్యాంకర్స్‌మి కాదని, చాలావరకు స్ట్రయిట్‌గానే పెట్టుబడులు పెట్టి సినిమాలు తీస్తామని, తప్పదనుకుంటే టైఅప్ అయినా పూర్తిస్థాయిలో మొదటిరోజునుంచి అంటే క్రియేటివ్ ప్రాసెస్‌నుంచి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ వరకు తామే దగ్గరుండి చూసుకుంటామని చెబుతున్నారు.
ముందుగా బాలీవుడ్‌లో అడుగుపెడతామని, బాలీవుడ్‌కి ఇతర దేశాల్లో ఉన్న మార్కెట్ తమ ప్రణాళికలకు బాగా ఉపయోగపడుతుందంటున్నారు. అప్పట్లో రోడ్‌సైడ్ రోమియో యానిమేషన్ చిత్రంతో డిస్నీవారు యష్‌రాజ్ ఫిల్మ్‌కు సపోర్టు ఇచ్చారు. అలాగే మొన్న సంక్రాంతికి విడుదలైన తెలుగు చిత్రం అనగనగా ఓ ధీరుడుకి వారు సమర్పించడం జరిగింది. తమ బ్రాండ్‌ని ఇండియాలో మెల్లిగా అలవాటు చేయడంలో భాగమే ఈ కో ప్రొడక్షన్ వ్యవహారం. ఇండియాలో ఉండే పిల్లలకు, పెద్దలకు డిస్నీ సినిమాలను అలవాటు చేసి మెల్లిగా తమ ప్రొడక్టులను ఇక్కడ డబ్బింగ్ చేయడమో, రీమేక్ చేయడమో చేయాలని ఆలోచిస్తున్నారు. అయితే సినిమా పుట్టిన నాటినుంచి హాలీవుడ్ తమ సినిమాలను ఇండియాను టార్గెట్ చేయాలని చూసినప్పటికీ ఆ కోరిక తీరడంలేదు. దానికి కారణం ఇక్కడ ప్రజల్లో ఉన్న విభిన్నత. ప్రాంత ప్రాంతానికి పూర్తిగా మారిపోయే సాంస్కృతిక వ్యవహారాలు, కట్టుబాట్లు, హాస్యం, జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వారి భాషలోని యాస దూరంగా పెడుతున్నాయి. ఇప్పుడు వాటిని అధిగమించాలని నిర్ణయించుకుని దానికి అనుగుణంగా పావులు కదుపుతున్నారు.
ఈ సందర్భంగా పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ నిర్మాత ఏమంటున్నాడంటే...అన్ని ప్రాంతాల్లోనూ మార్కెట్ ఉన్న నటుడిని ఎంచుకోవడంలోనే నీ ప్రతిభ, విజయం దాగుంది అంటున్నారు. అలాగే హీరోకి కూడా వరల్డ్‌వైడ్ పాపులారిటీ ఉంటే ఆడియన్స్ బాగా కనెక్టు అవుతారు. డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉంటారని విశదీకరిస్తున్నాడీయన. ఇదే విషయాన్ని బ్లూ స్కై స్టూడియోస్ వారు చెబుతూ మా ఐస్‌ఏజ్ చిత్రానికి మేములోకల్‌గా ఉండేవాయిస్‌లను డబ్బింగ్ చేసి వదిలాం. పెద్దవిజయం సాధించాం అన్నారు. అలాగే ఐస్‌ఏజ్ కథ తయారుచేసుకునేటప్పుడు మేము పర్టికులర్‌గా ఓ కల్చర్‌కి చెందిన కథగా దాన్ని తీయదలుచుకోలేదు. అదే ఎక్కడైనా జరగొచ్చు అనిపించేలా రాసుకున్నాం. అందుకే అది అంత మెగా హిట్టయింది అన్నారు.
ఇటీవల విడుదలై విజయాన్ని అందుకున్న రియో చిత్రం డైరక్టర్ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు. ఇక ఫిక్సర్ యానిమేషన్ వారు కూడా తాము ఇదే తరహా ఫార్ములాని ఫాలో అవుతున్నట్టు వెల్లడించారు. కార్స్ 2 చిత్రాన్ని ఆరు దేశాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించామని, ఏ దేశంవారు చూసినా అది తమ దేశంలో తిరిగే కారు అనుకునేలాగ డిజైన్ చేసామని, ఆ పాయింట్ దగ్గరే తాము సగం విజయం సాధించినట్టు భావిస్తున్నామని అంటున్నారు. ఇక మార్కెట్ పెరగడం వల్ల చాలా లాభాలు ఉన్నాయంటున్నారు. భారీ బడ్జెట్‌కు వెళ్లినా భయం ఉండదు. అప్పుడు మరింత నాణ్యతతో కూడిన చిత్రాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
గత ఏడాది హాలీవుడ్‌లో సూపర్ హిట్టయిన హ్యాంగోవర్ చిత్రం ఇప్పుడు సీక్వెల్‌కు రెడీ అవుతోంది. వారు కూడా ఈ కథను బ్యాంకాక్ నైట్‌లైఫ్‌లో ప్లాన్ చేసి తీసామంటున్నారు. ఎందుకలా అంటే ఆసియా దేశాల్లో హ్యాంగోవర్ చిత్రం పెద్ద హిట్టయింది కదా. అందుకే ఈసారి అక్కడివారినే మరింతగా టార్గెట్ చేస్తున్నాం అని చెబుతున్నారు.
ఇవన్నీ ఇలావుంటే ఆఫీషియల్‌గా ఈ సంవత్సరం హాలీవుడ్ స్టూడియోలు కొన్ని తమ సినిమాలను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాయి. అవి కనక హిట్టయితే వరసగా తమ సంస్థలో హిట్టయిన గత చిత్రాలను ఇక్కడి వాతావరణానికి అనుగుణంగా మార్చి రూపొందించే అవకాశం ఉంది. ఇప్పటికే హాలీవుడ్‌లో హిట్టయిన స్టెప్ మామ్ సినిమాను కరణ్ జోహార్‌తో కలిసి అఫీషియల్‌గా ఉయ్ ఆర్ ఫ్యామిలీ అని రీమేక్ చేశారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని మూట కట్టుకుంది. దాంతో ఆ ఊపు కాస్త తగ్గింది. అయితే చైనాలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. హాలీవుడ్‌లో హిట్టయిన సెల్యులర్ అనే కిడ్నాప్ డ్రామా సినిమాని చైనాలో రీమేక్ చేస్తే అది పెద్ద హిట్టయింది. అదే ఫస్ట్ హాలీవుడ్ రీమేక్. ఇలాగే కోయిన్ బ్రదర్స్ రూపొందించిన హాలీవుడ్ చిత్రం బ్లడ్ శాంపిల్‌ని ఎ ఉమెన్.ఎ దన్.ఎ న్యూడిల్ షాప్ టైటిల్‌తో రీమేక్ చేసారు. అదీ బాగా ఆడింది. ఆ తర్వాత మెల్ గిబ్సన్ సూపర్ హిట్ వాట్ ఉమెన్ వాంట్స్ చిత్రాన్నికూడా హాంకాంగ్ సూపర్‌స్టార్‌తో రీమేక్ చేశారు. అదీ సంచలనం క్రియేట్ చేసే రేంజ్‌లో ఆడేసింది. ఇప్పుడదే వేడిలో జపాన్‌లో హాలీవుడ్‌లో హిట్టయిన ఘోస్ట్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. మరికొన్నిరీమేక్ సినిమాలు చర్చల స్థాయిలో ఉన్నాయి. ఈ పరిస్థితులు చూసిన ఆసియన్ సినీ పరిశ్రమకు భయం పట్టుకుంది. చైనాలో ఇన్ని సినిమాలు మించకూడదంటూ రూల్ అర్జెంటుగా తెచ్చేసారు. హాలీవుడ్‌కి మాత్రం ధైర్యం వచ్చింది. దాని ఫలితమే ఇండియన్ మార్కెట్‌పై పడ్డారు. ఈ సిట్యుయేషన్ రాబోయే రోజుల్లో ఇండియన్ సినిమాకు దాంతోపాటే మన తెలుగు సినిమాకు ఇబ్బందికర పరిస్థితిని, మనుగడ ప్రశ్నార్ధకమయ్యే సిట్యువేషన్ తీసుకురావడం గ్యారంటీ. ఎంతకాలమని డబ్బింగ్ చిత్రాలు ఆపమని గవర్నమెంట్ మీద వత్తిడి తేగలుగుతారు. అక్కడ ఆ విధంగా డబ్బింగ్ చిత్రాలను ఆపడం ద్వారా వారి రాకను ఆపినా వారు నిర్మాతలుగా మారి ఇక్కడ సినిమాలు తీసి మన మార్కెట్లోకి వస్తారు. ఈ సిట్యువేషన్‌లో మనకు ఒకటే దారి ఉంది. మన సినిమాలు క్వాలిటీ పెంచుకుని ప్రపంచ సినిమాకు పోటీ ఇవ్వగలగడం. మూస కథలను, మూర్చవచ్చే నటనలను మార్చుకుని మన సినిమాను ప్రపంచ సినీ మార్కెట్లో పెట్టగలగడం. వెనుతిరిగి పారిపోయి...క్విట్ హాలీవుడ్ అని అరవటమా లేక పోటీ ఇచ్చి మన స్టాండర్డ్స్‌ని పెంచుకోవడమా అనేది ఇండియన్ సినిమా ముందు ఉన్న ప్రశ్న.    -సూర్యప్రకాష్ జోశ్యుల

No comments:

Post a Comment