Labels

విచారణకు హాజరయిన ధరున్ రవి

 న్యూజెర్సీ కోర్టులో వాదనలు
న్యూయార్క్: ఆకతాయితనంతో చేశాడో, తెలియక చేశాడో గానీ రూమ్మేట్‌కు చెందిన రహస్య వీడి యోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసి అమెరికాలో భారత సంతతికి ధరున్ రవి(19) అనే యువకుడు సహచరుడి మరణానికి కారణమయ్యాడు. గతేడాది సెప్టెంబర్‌లో ఈ ఘటన
చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రవిని సోమవారం న్యూజెర్సీ కోర్టులో హాజరుపరిచారు. రట్జర్స్ యూనివర్సిటీ విద్యార్థి అయిన రవి 18 ఏళ్ల టిలర్ క్లెమెంటీ అనే యువకుడితో కలిసి ఒకే గదిలో అద్దెకు దిగాడు. మూడు రోజుల తర్వాత న్యూయార్క్‌లోని జార్జి వాషింగ్టన్ బ్రిడ్జి పైనుంచి దూకి క్లెమెంటీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను మరో వ్యక్తితో సెక్స్‌లో పాల్గొన్న వీడి యో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడంతో అతడు ప్రాణాలు తీసుకున్నాడు. గతేడాది సెప్టెంబర్ 22న ఈ సంఘటన జరిగింది.
ఈ కేసులో రవిని నిందితుడిగా పోలీసులు అరెస్ట్ చేశారు. పక్షపాతం, వ్యక్తిగత రహస్యాలను బహిర్గతం చేయడం తదితర నేరాల కింద అతడిపై 15 అభియోగాలు నమోదు చేశారు. ముదురు ఊదా రంగు సూట్‌లో సోమవారం విచారణకు హాజరయిన రవి కోర్టులో మౌనం దాల్చాడని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అతడి తరపు న్యాయవాది డి ఆల్ట్‌మాన్ కోర్టులో వాదనలు వినిపించారు. విచారణ ముగిసిన తర్వాత వీరిద్దరూ విలేకరులతో ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. రవిపై మోపిన అభియోగాలు నిరూపితమయితే అతడికి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. ఈ కేసులో సహ నిందితురాలిగా ఉన్న రవి స్నేహితురాలు మొలీ వుయ్ విచారణలో నిజాలు వెల్లడిస్తే 300 రోజుల సామాజిక సేవతో సరిపెట్టుకోవచ్చు. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు జూలై 25కు వాయిదా వేసింది.

No comments:

Post a Comment