Labels

చంద్రబాబు ఆస్తులపై హైకోర్టులో పిల్

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆస్తులపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు విజయమ్మ 2,424 పేజీల పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ప్రకటించిన ఆస్తుల వివరాలు పూర్తిగా అబద్ధం అని ఆమె తెలిపారు. దేశవిదేశాలలో చంద్రబాబు పేరన ఉన్న ఆస్తుల వివరాలు, బినామీ పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలు అందులో తెలిపారు. టిడిపి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు వేల కోట్ల రూపాయలు సంపాదించినట్లు పేర్కొన్నారు. అతని ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమె కోరారు.
18 అంశాలలో చంద్రబాబు అధికార దుర్వినియోగానికి, అక్రమాలకు పాల్పడినట్లు ఆమె తన పిటిషన్ లో పేర్కొన్నారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ పేర్ల మీద పెట్టిన అక్రమ ఆస్తుల వివరాలు తెలిపారు. చివరకు తల్లి పేరుతో కూడా ఆయన సాగించిన అక్రమాల వివరాలను వెల్లడించారు. సింగపూర్ లో బినామీ పేరు మీద కొనుగోలు చేసిన హొటల్ వివరాలను కూడా అందులో పొందుపరిచారు. చంద్రబాబు బినామీలుగా వ్యవహరిస్తూ సుజనా చౌదరి, సిఎం రమేష్ విదేశాల నుంచి తరలించిన నిధుల వివరాలు తెలిపారు. నెల్లూరు జిల్లా బాలాయిపల్లెలో చంద్రబాబుకు చెందిన వ్యవసాయ భూముల
వివరాలు అన్నింటినీ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. కేవలం రెండు ఎకరాలు ఉన్న చంద్రబాబు అనేక అక్రమ మార్గాలలో వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో తిరుగులేని సాక్ష్యాధారాలతో ఈ పిటిషన్ దాఖలు చేశారు.
విజయమ్మ తన పిటిషన్ లో ప్రతివాదులుగా చంద్రబాబుతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను,రామోజీరావుని కూడా చేర్చారు. 9 ఏళ్ల చంద్రబాబు పరిపాలనపై సిబిఐతో విచారణ చేయించాలని ఆమె కోరారు. ఆయన హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను అయినవాళ్లకే కట్టబెట్టినట్లు పేర్కొన్నారు. నామా నాగేశ్వర రావుకు పాలేరు షుగర్స్ ని పరిహారంగా ఇచ్చారని తెలిపారు. చిత్తూరు డెయిరీని నాశనం చేసి, హెరిటేజ్ డెయిరీ ద్వారా బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకున్నట్లు తెలిపారు. ఐఎంజి భారత కేసులో చంద్రబాబు అవినీతిపై పూర్తి సాక్ష్యాధారాలను ఆమె కోర్టుకు సమర్పించారు. ఏలేరు భూ కుంభకోణంలో చంద్రబాబు అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు.
రామోజీరావు మార్గదర్శి ఫైనాన్స్ లోకి వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ఆమె ప్రశ్నించారు. రామోజీరావు ఆర్ బిఐ, ఎపి చిట్ ఫండ్ చట్టాలను ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు. ఆయనపై ఏ ప్రభుత్వ శాఖ చర్య తీసుకునే ధైర్యం చేయలేకపోయిందన్నారు. రామోజీ కంపెనీలకు నిధులు ఎలా తరలి వెళ్లాయో ఆ పిటిషన్ లో వివరించారు. మార్గదర్శి ఎస్క్రో అకౌంట్ లో ఇప్పటికీ 275 కోట్ల రూపాయలను ఎవరూ క్లెయిమ్ చేయలేదని తెలిపారు. ఆ డబ్బుని చంద్రబాబుదిగా ఎందుకు భావించకూడదని ఆమె ప్రశ్నించారు. మార్గదర్శిలో చంద్రబాబు అక్రమ సంపాదన చేరిందని తెలిపారు. అందువల్లే ఆ డబ్బు ఎవరికి చెందినదో రామోజీరావు వివరించడంలేదని ఆమె తెలిపారు. రామోజీరావు పాలమాకుల భూముల వ్యవహారాన్ని కూడా ఆ పిటిషన్ లో ప్రస్తావించారు.
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చంద్రబాబు అనేక అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. అవినీతి నిరోధక చట్టం, ఫెమా, మనీ ల్యాండరింగ్ చట్టం, భూకబ్జా, బినామీ చట్టాల కింద విచారణ జరిపించాలని విజయమ్మ కోరారు.

No comments:

Post a Comment